సౌందర్య పోషకాలను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారా?

హలో అండీ.. నాకో డౌటు.. చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు? 'అది మా ట్రేడ్ సీక్రెట్' అంటారా? ఫర్లేదు లెండి.. మనలో మనకి రహస్యాలు ఏముంటాయి చెప్పండి? 'ఏముందీ? బయట దొరికే ఏ ఫేస్‌ప్యాకో, క్రీమో తెచ్చి వాడేస్తాం..' అంటారా? లేక 'అమ్మో.. బయట దొరికే ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.

Updated : 24 Sep 2021 18:24 IST

హలో అండీ.. నాకో డౌటు.. చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు? 'అది మా ట్రేడ్ సీక్రెట్' అంటారా? ఫర్లేదు లెండి.. మనలో మనకి రహస్యాలు ఏముంటాయి చెప్పండి? 'ఏముందీ? బయట దొరికే ఏ ఫేస్‌ప్యాకో, క్రీమో తెచ్చి వాడేస్తాం..' అంటారా? లేక 'అమ్మో.. బయట దొరికే ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇంట్లో తయారు చేసుకోవడమే బెటర్..' అంటారా? కరక్టే.. ఎక్కువ మంది మహిళలు చర్మ సంరక్షణ లేదా చర్మ సౌందర్యం కోసం బయట దొరికే వాటి కంటే ఇంట్లో దొరికే వస్తువుల పైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఇతరత్రా ఎలాంటి సమస్యలూ ఉండవనుకుంటారు. కానీ వివిధ రకాల సౌందర్య పోషకాలను ఇంట్లోనే తయారు చేసుకున్నా, కొంతమందికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఎందుకలా జరుగుతుంది?

'బయట కొన్న క్రీములు, ఫేస్‌ప్యాకుల్లో వాళ్లు ఏయే పదార్థాలు వాడతారో తెలీదు.. ఒకవేళ అవి మనకు పడకపోతే?' ఈ ఆలోచనతోనే చాలామంది ఇంట్లో తయారు చేసుకున్న ఉత్పత్తులనే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలీని విషయం ఏంటంటే ఇంట్లోనే తయారు చేసుకున్నా.. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వాటి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువే.. మరి ఇన్ఫెక్షన్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

శుభ్రమైన వస్తువులు

మన చేతుల్లో అనేక సూక్ష్మజీవులుంటాయి. ఫేస్‌ప్యాక్స్, క్రీమ్స్ తయారు చేయడానికి ఉపయోగించే బౌల్స్, స్పూన్లు, మిక్సర్., వేసుకోవడానికి వాడే బ్రష్ లాంటి వాటిల్లో కూడా చాలా రకాల క్రిములుంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఈ క్రిములన్నీ మన చర్మం మీదకు చేరి ఇన్ఫెక్షన్లు కలగజేస్తాయి.. అందుకే మనం తయారీ ప్రారంభించే ముందే వీటిని శుభ్రంగా కడిగి తర్వాత వీటిని ఉపయోగిస్తే మంచిది. వీలుంటే వీటన్నింటినీ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు నీళ్లలో వేసి మరిగించడం వల్ల వాటిలోని క్రిములన్నీ చనిపోయి ఆయా పాత్రలు, వస్తువులు అన్నీ శుభ్రపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మోతాదు చూసుకోండి

మనం వాడే ఫేస్‌ప్యాకులు, స్క్రబ్‌లు అప్పటికప్పుడే వేసుకునేవైతే ఫర్వాలేదు.. అలాగాక కొంతకాలం పాటు నిల్వ ఉండేలా తయారు చేసుకోవాలంటే మాత్రం వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్‌ని కలపడం తప్పనిసరి. వెనిగర్, ఆస్కార్బిక్ యాసిడ్, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉపయోగపడతాయి. కానీ వీటి మోతాదు తగ్గినా, పెరిగినా ప్రమాదమే.. వాటి మోతాదు తగ్గితే పదార్థాలు తొందరగా పాడైపోతాయి. మోతాదు పెరిగితే అది చర్మానికి హాని చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ కాలం కాకుండా కొంతకాలం పాటు మాత్రమే ఉపయోగించేలా ఈ పదార్థాలను తయారు చేసుకోవడం మంచిది. దీని వల్ల వాటిలో ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం ఉండదు.

ఎలర్జీ ఉందా?

బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసుకునే ముందే మీకేదైనా పదార్థాలంటే ఎలర్జీ ఉందా చూసుకోండి. లేకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఒంటికి పడని వస్తువును చర్మం కోసం ఉపయోగించడం మంచిది కాదు.. దీంతో పాటు మీరు ఏదైనా కొత్త పదార్థాన్ని తయారు చేసి, దాన్ని వాడేముందు ఒకసారి మీ చేతికి, లేదా కాలికి ఉపయోగించి చూడండి. కాసేపైన తర్వాత ఎలాంటి దురద, ర్యాష్, మంట లాంటివి లేకపోతేనే వాటిని ఉపయోగించడం మంచిది. ఇలాంటివేవైనా వస్తున్నాయంటే వాటిని వాడద్దు.. ప్రత్యేకించి మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఇలాంటివి ఎక్కువగా పట్టించుకోవాల్సి ఉంటుంది.

ఫ్రిజ్‌లో ఉంచండి

మనం ఇంట్లో తయారు చేసుకున్న సౌందర్య పోషకాలలో ప్రిజర్వేటివ్స్ కలిపినా, లేకపోయినా దాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం ఉత్తమమైన పద్ధతి. దీని వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి. అలాగని సాధారణంగా ఉండే సమయం కన్నా ఎక్కువ రోజులు ఉంటుందనుకోవడం కూడా తప్పే.. ఫ్రిజ్‌లో ఉంచినా.. వాటిని ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు మాత్రమే ఉపయోగించండి.

కలుషితం కాకుండా..

మీరు చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్థాలను కూడా ఆహార పదార్థాల లాగానే జాగ్రత్తగా కాపాడటం ముఖ్యం. దీని కోసం వాటిని నిల్వ చేసే డబ్బాలను ముందుగా స్టెరిలైజ్ చేయాలి. మధ్యలో ప్రొడక్ట్‌ని తీసుకునేటప్పుడు కూడా చేత్తో కాకుండా స్టెరిలైజ్ చేసిన స్పూన్, కాటన్ బాల్ వంటి వాటితో తీసుకోవడం వల్ల మన చేతికి ఉన్న క్రిములు దాన్లో కలవకుండా ఉంటాయి.

ఎక్కువ రోజులు వద్దు..

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆయా సౌందర్య పోషకాలను ఎక్కువ రోజులు ఉపయోగించకపోవడం మంచిది. ప్రత్యేకించి పాడైపోయిన వాసన వస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాడకూడదు. ఎందుకంటే వాటిని తయారు చేసే పద్ధతిలో ఎక్కడో తప్పు జరిగి అందులోకి క్రిములు చేరడం వల్ల అది త్వరగా పాడైపోయి ఉంటుంది. అందుకే ఉపయోగించిన ప్రతిసారీ వాసన చూడటం మర్చిపోకండి.

శుభ్రమైన నీరు

నిల్వ చేసుకొని ఉంచుకోవాలనుకునే పదార్థాల్లో ముందే నీటిని కలపడం మానేయండి. దానికి బదులు ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగించే ముందే నీటిని కలుపుకోండి. దీని వల్ల వాటిలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించచ్చు..వారం, అంతకంటే తక్కువ రోజుల పాటు వాడదగిన పదార్థాలైతే వాటిలో శుభ్రమైన నీటిని మాత్రమే కలపాలి. అలాగే నీటిని కాచి, వడబోసిన తర్వాత ఉపయోగించడం వల్ల మన చర్మానికి, జుట్టుకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. ఆయా పదార్థాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్