Published : 19/01/2022 19:18 IST

పెదాలు పగులుతున్నాయా?

'అమ్మో.. అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా..!' - అన్నట్లు పాలరాతి శిల్పంలా మెరిసిపోవాలంటే అమ్మాయిలు శిరోజాల దగ్గర్నుంచి పాదాల వరకు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలే చలికాలం.. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెదవులు పొడిగా అయిపోవడం, పగలడం.. వంటివి జరుగుతూ ఉంటాయి. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే తిరిగి వాటిని మృదువుగా మార్చేయచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..!

శీతాకాలంలో పెదవులు పగలడానికి కేవలం చలిగాలులే కారణం కాదు.. విటమిన్ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం.. ఇలా అనేక అంశాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లో లభించే వస్తువులతోనే స్వస్తి చెప్పి, మృదువైన అధరాలను సొంతం చేసుకోవచ్చు.

చక్కెరతో..

రెండు చెంచాల చక్కెరకు, చెంచా తేనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని కొన్ని నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వేళ్ల చివరలతో పెదవుల చుట్టూ మెల్లగా రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల పై పొరల్లో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

కొబ్బరినూనెతో..

కొబ్బరినూనె సహజసిద్ధ్దమైన మాయిశ్చరైజర్‌లా పని చేసి పగిలిన పెదాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రోజంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పెదాలకు కొద్దిగా కొబ్బరినూనె రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల పెదవుల్లోని తేమ ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది. కొబ్బరినూనెకు బదులు ఆలివ్ ఆయిల్‌ని కూడా ఉపయోగించవచ్చు.

పాల క్రీమ్‌తో..

ఇందులో సహజంగా ఉండే కొవ్వు పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా సహజసిద్ధ్దమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. పెదవులకు ఈ క్రీమ్ రాసుకొని 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి.

గులాబీ రేకలతో..

పగిలిన పెదవులను సాధారణ స్థితికి తీసుకురావడానికి పెరట్లో ఉండే గులాబీ పూల రేకలు కూడా ఉపయోగపడతాయి. కొన్ని గులాబీ రేకలు తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని కొన్ని గంటల పాటు పాలలో నానబెట్టాలి. ఇప్పుడు వాటిని మెత్తని ముద్దలా చేసుకుని రోజుకు 2 లేదా 3 సార్లు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గి సాధారణ స్థితికి రావడమే కాదు.. మంచి రంగును కూడా సంతరించుకుంటాయి.

తేనెతో..

తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, గాయాన్ని మాన్పించే గుణాల వల్ల పగిలిన పెదవులకు ఇది కూడా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. పెదవులు పొడిగా అనిపించిన ప్రతిసారీ తేనెను తరచూ రాసుకుంటూ ఉండాలి. అలాగే తేనెకు కొద్దిగా గ్లిజరిన్ జత చేసి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని రోజూ పడుకునే ముందు పెదాలకు రాసుకోవాలి. ఫలితంగా కొద్ది రోజుల్లోనే లేలేత అధరాలు మన సొంతమవుతాయి.

ఆముదంతో..

ఆముదం, గ్లిజరిన్ ఒక్కో చెంచా చొప్పున తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. పెదవుల పగుళ్లు తగ్గేవరకు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెట్రోలియం జెల్లీతో..

కొద్దిగా తేనె తీసుకొని దానికి పెట్రోలియం జెల్లీ జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పెదాలకు రాసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.

కీరాదోసతో..

కీరాదోసను ముక్కలుగా కోసుకొని వాటితో 10 నుంచి 15 నిమిషాలు పెదాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

ఇవేకాకుండా కలబంద, నెయ్యి వంటివి కూడా పెదాలకు రాసుకోవచ్చు. అలాగే వీటిని పాటిస్తూనే వీలైనంత ఎక్కువ మొత్తంలో శరీరానికి నీటిని అందించాలి. అలాగే చలికాలంలో అధరాల సంరక్షణకు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవి;
* చలిగాలుల వల్ల పెదవులపై ఏర్పడే పొరలను లాగకూడదు.

* అలాగే పెదాలను తరచూ తడుపుతూ ఉండటం లేదా కొరుకుతూ ఉండటం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు.

* పెదవులపై ఏర్పడే మృతకణాలను ఎప్పటికప్పుడు బ్రష్‌తో తొలగించుకుంటూ ఉండాలి.

* బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా పెదవులకు లిప్‌బామ్ రాసుకోవాలి.

ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే విటమిన్ 'ఎ' ఎక్కువగా లభించే క్యారట్లు, టొమాటోలు, ఆకుకూరలు.. మొదలైనవన్నీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ అనుసరిస్తే గులాబీ లాంటి కోమలమైన, మృదువైన పెదవులను సులభంగా సొంతం చేసుకోవచ్చు.


Advertisement

మరిన్ని