Updated : 02/11/2021 18:26 IST

ఈ దీపావళికి ఇలా అందమైన దీపంలా మెరిసిపోండి!

దీపపు కాంతులు.. బాణసంచా మోతలు.. రంగురంగుల రంగవల్లికల్లో అందంగా తీర్చిదిద్దే దీపాలు.. వెరసి ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి పండగ వచ్చేసింది. బోలెడన్ని సందళ్లు తెచ్చేసింది. మరి, ఈ పండగ శోభను మరింత రెట్టింపు చేయాలంటే.. ఇంటి ముంగిళ్లనే కాదు.. మనమూ అందంగా ముస్తాబు కావాలి. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టూతో, ముద్దబంతిలాంటి నగుమోముతో మెరిసిపోవాలంటే అందుకు ముందు నుంచే సన్నద్ధం కావాలి. ముఖ్యంగా అందం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దీపాల కాంతుల మధ్య దీపంలా వెలిగిపోవచ్చు. అందుకోసం ఎలాంటి సౌందర్య చిట్కాలు పాటించాలి..? మేకప్, హెయిర్‌స్త్టెల్స్ విషయంలో అనుసరించాల్సిన నియమాలేంటి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.

ముఖం శుభ్రంగా..

మనం అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలంటే చర్మం మీద ఎప్పటికప్పుడు పేరుకుపోయే మృతకణాలను తొలగించుకుంటూ ఉండాలి. అందుకే దీపావళికి ఒకటి లేదా రెండ్రోజుల ముందే ఫేషియల్ చేయించుకోవాలి. త్రెడింగ్ ద్వారా కనుబొమ్మల్ని కూడా షేప్ చేసుకోవాలి. అయితే ముందుగా మనం ఎంత సన్నద్ధమైనా దీపావళి రోజు మరింత ప్రకాశవంతంగా కనిపించాలి కాబట్టి ఇంట్లోనే లభించే వస్తువులతో కొన్ని ప్యాక్స్ వేసుకోవచ్చు.

ఈ క్రమంలో- తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ముఖం శుభ్రంగా కడుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. నిమిషాల్లో మెరిసిపోయే చర్మం మన సొంతమవుతుంది.

అలాగే టొమాటోని ఉపయోగించి కూడా కాంతివంతంగా మారిపోవచ్చు. టొమాటోని ముక్కలుగా కోసి దాని గుజ్జుతో ముఖమంతా రుద్దుకోవాలి. అలా 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖం శుభ్రం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇవేవీ కాకుండా ఐస్‌క్యూబ్‌తో ముఖం రుద్దుకున్నా సరే.. చర్మం ప్రకాశిస్తుంది.

మెరిసే కళ్ల కోసం...

సాధారణంగా ప్రత్యేక సందర్భాలనగానే ముదురు రంగుల్లోని ఐషేడ్స్‌ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు దీపపు కాంతుల మధ్య అందంగా కనిపించాలి కాబట్టి కళ్లు కూడా బాగా హైలైట్ కావాలి. అందుకే కళ్లపై ముందుగా ప్రైమర్ రాసుకుని, బ్రౌన్ కలర్ ఐషేడ్స్ అప్త్లె చేసుకోవాలి. తర్వాత లైనర్‌తో కంటి చుట్టూ లైనప్ చేసుకుని, కాటుక పెట్టుకోవాలి. మస్కారా అప్త్లె చేసుకుని కర్లర్‌తో కనురెప్పల్ని షేప్ చేసుకోవాలి. అవసరమనుకుంటే మార్కెట్లో లభ్యమయ్యే కృత్రిమ రెప్పలు కూడా అతికించుకోవచ్చు. అయితే అలా అతికించుకున్న తర్వాత ఐలైనర్‌తో మరోసారి లైనప్ చేసుకుని ఐషాడోని బ్లెండ్ చేసుకోవాలి. మనం ఐషాడోని ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత ఆకర్షణీయంగా ఉంటుంది. చివరిగా న్యాచురల్ పింక్ కలర్‌తో లైట్‌గా బ్లష్ చేసుకోవాలి.

మేకప్ ఇలా..!

ముందుగా మీ డ్రస్సింగ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. దాని ప్రకారమే మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి. ఇందుకోసం ముఖం శుభ్రం చేసుకున్న వెంటనే పెదాలకు లిప్‌బామ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా తాజాగా ఉంటాయి. ఇప్పుడు మాయిశ్చరైజర్‌ని చర్మంలోకి ఇంకిపోయేలా నెమ్మదిగా రుద్దాలి. తర్వాత ప్రైమర్ రాసి, చర్మం రంగుకు సరిపడే ఫౌండేషన్‌ను అప్త్లె చేసుకోవాలి. కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే వాటిని కన్సీలర్‌తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖమంతా పౌడర్‌తో లైట్‌గా టచప్ ఇచ్చుకోవాలి.

మెరిసే పెదవులకు..

లిప్‌లైనర్‌తో ముందుగా పెదవులకు సరైన ఆకృతినివ్వాలి. ఇప్పుడు బ్రష్ లేదా బడ్‌తో లైట్‌షేడ్ లిప్‌స్టిక్ తీసుకుని కొద్దికొద్దిగా, పలుచగా అప్త్లె చేయాలి. తర్వాత పెదవులు మెరుస్తున్నట్లు కనిపించడానికి లిప్‌గ్లాస్‌తో పెదవుల మధ్యలో టచప్ ఇచ్చుకోవాలి. దీంతో మేకప్ పూర్త్తెనట్లే. అయితే ఇలా మేకప్ చేసుకునే క్రమంలో మనం వేసుకున్న ఐషాడో కలర్, లిప్‌స్టిక్ కలర్ ఒకేలా కనిపించేలా జాగ్రత్తపడాలి. ఇప్పుడు గోల్డ్ లేదా సిల్వర్ షేడ్‌లో ఉన్న డిజైనర్ బిందీని పెట్టుకోవాలి. అలాగే మనం ముఖానికి మేకప్ వేసుకున్నట్లే మెడకు, చేతులకు కూడా వేసుకోవడం వల్ల మొత్తం ఒకేలా సహజంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా.. రాత్రి సమయం కాబట్టి షిమ్మర్‌ను ఉపయోగిస్తే మరింత దేదీప్యమానంగా మెరిసిపోవచ్చు.

నప్పే హెయిర్‌స్త్టెల్..

ప్రత్యేక సందర్భాలకు మనం ఎక్కువగా లూజ్ హెయిర్‌తోనే కనిపించాలని అనుకుంటాం. అయితే దీపావళికి మాత్రం జుట్టును అలా వదలకపోవడమే మంచిది. దీపాల మధ్య తిరుగుతూ, టపాసులు కాల్చాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జడ వేసుకోవడం లేదా సింపుల్ హెయిర్ నాట్స్ ప్రయత్నించడం చక్కటి ప్రత్యామ్నాయం. మీరు ఎంచుకున్న డ్రస్సింగ్ ప్రకారం మీకు ఏ హెయిర్‌స్త్టెల్ నప్పుతుందో నిర్ణయించుకోవాలి. కావాలనుకుంటే హెయిర్ యాక్సెసరీస్ ఉపయోగించి మరింత ఆకర్షణీయంగా రడీ కావచ్చు.

జాగ్రత్తగా డ్రస్సింగ్..

దీపావళి రోజున కొందరు సంప్రదాయబద్ధంగా కనిపించడానికి ఇష్టపడితే, మరికొందరు ట్రెండీగా కనిపించాలని అనుకుంటారు. అయితే ఎలా కనిపించాలనుకున్నా సరే- ఎంపిక చేసుకునే వస్త్రాలు మాత్రం సాధ్యమైనంత మేరకు కాటన్‌వే వేసుకోవడం మంచిది. సిల్క్, పట్టు వస్త్రాలు ధరించి దీపాల మధ్య తిరగడం ప్రమాదకరం. కాబట్టి డ్రస్సింగ్ ఏదైనా మొదటి ప్రాధాన్యం సౌకర్యవంతంగా ఉండటానికే ఇవ్వాలి. ఎలానూ మేకప్‌తో హైలైట్ అవుతున్నాం కాబట్టి డ్రస్సింగ్ సింపుల్‌గా ఉన్నా మీ లుక్ అదిరిపోతుంది.
చూశారుగా.. ఈ దీపావళి పర్వదినాన మీరు కూడా దీపపు కాంతుల మధ్య మెరిసిపోవాలంటే మరి ఇవన్నీ మీరూ పాటించి అందంగా తయారైపోండి. పండగని మరింత సందడిగా జరుపుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని