Pregnancy Tips : పొట్ట దురద పెడుతోందా?

గర్భం ధరించాక మన శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా ఇందులో ఒకటి. అయితే ఇలా చర్మం సాగే క్రమంలో దురద పెట్టడం సహజం.

Published : 23 Sep 2023 12:09 IST

గర్భం ధరించాక మన శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా ఇందులో ఒకటి. అయితే ఇలా చర్మం సాగే క్రమంలో దురద పెట్టడం సహజం. అలాగని ఆ ప్రదేశంలో గోకడం, రుద్దడం.. వంటివి చేస్తే చర్మంపై గాట్లు పడి.. అవి శాశ్వతమైన మచ్చలుగా ఏర్పడతాయి. అందుకే పొట్ట పెరుగుతున్నా దురద రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట అంతకంతకూ పెరుగుతుంటుంది. తద్వారా అక్కడి చర్మం సాగుతూ దురద పెడుతుంటుంది. అయితే కేవలం చర్మంలో సాగుదల వల్లే కాదు.. ఈ సమయంలో హార్మోన్లలో జరిగే మార్పులు, ఇతర కారణాల వల్ల కూడా పొట్టపై దురద వస్తుందంటున్నారు నిపుణులు. అలా జరగకుండా ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు.

శరీరం తేమను కోల్పోయినా దాని ప్రభావం చర్మంపై పడుతుంది. అది పొడిబారి దురద పెడుతుంటుంది. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం మంచిది. ఫలితంగా చర్మం తేమగా ఉండి దురద సమస్యకు దూరంగా ఉండచ్చు. అలాగే ఈ సమయంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవడం వల్ల ఉమ్మనీరు తగ్గకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

చర్మం పొడిబారకుండా చేయడంలో మాయిశ్చరైజర్‌ పాత్ర కూడా కీలకమే! అందుకే నిపుణుల సలహా మేరకు.. సువాసన రహిత, హైపోఅలర్జినిక్‌ మాయిశ్చరైజర్లను తరచూ పొట్టకు అప్లై చేసుకోవడం మంచిది.

గర్భిణిగా ఉన్న సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, వాటి రాపిడి వల్ల కూడా పెరుగుతున్న పొట్ట వద్ద చర్మం దురద పెడుతుంటుంది. అందుకే ఈ సమయంలో వదులుగా, శరీరానికి గాలి తగిలేలా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా దురద పెట్టకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

గర్భిణిగా ఉన్న సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల కూడా దురద వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి పోషకాహార నిపుణుల సలహా మేరకు శరీరానికి సరిపడే పోషకాహారం తీసుకోవడం మంచిదంటున్నారు.

కొంతమంది ఏ కాలంలోనైనా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. దీనివల్ల కూడా చర్మం పొడిబారిపోయి దురద పెట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే గోరువెచ్చటి నీళ్లను స్నానానికి ఉపయోగించడం మంచిదంటున్నారు. కావాలంటే ఇందులో కాస్త ఓట్‌మీల్‌ కలుపుకొన్నా దురద రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

అలాగే స్నానానికి ఉపయోగించే సబ్బులు, బాడీ వాష్‌లు.. గాఢత తక్కువగా ఉన్నవి, పరిమళభరితం కానివి ఎంచుకోవాలి.

పెరిగే పొట్టపై స్ట్రెచ్‌ మార్క్స్‌ పడకుండా, దురద పెట్టకుండా.. కొన్ని రకాల క్రీమ్స్‌, నూనెలు దోహదం చేస్తాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడడం ఉత్తమం.

పొట్ట పెరుగుతున్న కొద్దీ సాగుతున్న చర్మం దురద పెట్టకుండా ఉండాలంటే.. స్నానం చేశాక.. కాస్త కలబంద గుజ్జు లేదంటే కొబ్బరి నూనెను అప్లై చేసుకున్నా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

⚛ ఐస్‌ వాటర్‌లో ముంచిన క్లాత్‌ను పెరుగుతున్న పొట్టపై ఉంచడం లేదంటే ఐస్‌ ముక్కలతో పొట్టపై మర్దన చేయడం వల్ల కూడా దురద రాకుండా జాగ్రత్తపడచ్చట!

గమనిక : గర్భిణులందరి చర్మతత్వాలు ఒకేలా ఉండాలని లేదు. కాబట్టి పొట్ట పెరిగే కొద్దీ దురద నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఉత్పత్తి వాడాలన్నా ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. తద్వారా ఇటు మీకు, అటు మీ బిడ్డకు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్