Published : 20/10/2022 20:44 IST

మాడు వాసన రాకూడదంటే..!

వంట చేయడం ఓ కళ అంటుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కోసారి కూరలు, ఇతర వంటకాలు మాడిపోవడం.. వాటి రుచి తగ్గిపోవడం.. వంటివి చాలామందికి అనుభవమే! ఇలాంటప్పుడు చాలామంది ఆయా పదార్థాల్ని పడేస్తుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మాడు వాసన రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

✮ కూర/ఇతర పదార్థాలు అడుగంటాయనిపిస్తే.. అందులో కొన్ని తొక్క తొలగించిన బంగాళాదుంప ముక్కల్ని వేసి మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఫలితంగా మాడు వాసనను ఆ ముక్కలు పీల్చేసుకుంటాయి. ఆపై ఈ ముక్కల్ని తొలగిస్తే సరిపోతుంది.

✮ ఒక్కోసారి మనం సమయానికే స్టౌ కట్టేసినా.. అడుగున ఉండే పదార్థం కొద్దిగా మాడిపోతుంటుంది. అలాంటప్పుడు రుచి తగ్గకుండా, మాడు వాసన రాకుండా ఉండాలంటే.. అందులో ఆమ్ల గుణాలున్న నిమ్మరసం, వెనిగర్‌, టొమాటో/టొమాటో రసం.. వంటివి కొద్దిగా జత చేస్తే ఫలితం ఉంటుంది. పైగా కొన్ని పదార్థాలకు వీటి వల్ల అదనపు రుచి చేకూరుతుంది.

✮ కూరలు, గ్రేవీ తరహా పదార్థాలు మాడిపోయినప్పుడు క్రీమ్‌, వెన్న, పెరుగు.. వంటివి జతచేస్తే అడుగంటిన వాసన రాకుండా ఉంటుంది.. అలాగే ఆ పదార్థానికి మరింత చిక్కదనం కూడా వస్తుంది.

✮ గ్రిల్‌ చేసిన పదార్థాల నుంచి కూడా మాడు వాసన రావడం మనం గమనిస్తుంటాం. అలాంటప్పుడు వాటికి సాస్‌లను జత చేసుకొని తీసుకుంటే.. అందులోని తియ్యదనం, పులుపుదనం.. ఆయా పదార్థాల రుచిని పెంచడంతో పాటు మాడు వాసన రాకుండా చేస్తాయి.

✮ బిర్యానీ, పులావ్‌.. వంటివి అడుగంటినప్పుడు.. ఒక ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా తరిగి.. గిన్నెలో నలుమూలలా ఉంచి మూతపెట్టేయాలి. పావుగంట తర్వాత వీటిని తొలగిస్తే ఫలితం ఉంటుంది.

✮ మాడిపోయిన కూరలు, ఇతర పదార్థాలపై కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లి చూడండి.. అటు రుచికి రుచి, ఇటు మాడు వాసన రాకుండానూ ఉంటుంది.

✮ ఒక్కోసారి గిన్నె అడుగు పల్చగా ఉన్నా కూరలు మాడిపోతుంటాయి. కాబట్టి అలాంటి గిన్నెలకు బదులుగా మందపాటి అడుగు ఉన్న గిన్నెల్ని కూర కోసం ఎంచుకుంటే సమస్య ఉండదు.
✮ అడుగంటినా కొంతమంది కూరంతా కలిపేస్తుంటారు. దీనివల్ల మాడు వాసన కూరంతా వ్యాపిస్తుంది. కాబట్టి అడుగంటినట్లు గమనించగానే.. పైపైన కూరను విడిగా తీసి వేరే గిన్నెలోకి మార్చడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని