Updated : 06/01/2023 21:16 IST

తరిగిన కూరగాయలు పాడైపోతున్నాయా?

రోజూ ఉదయం వంట చేయడానికి ముందు కాయగూరలు కట్ చేయాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుందని ముందే కట్ చేసి పెట్టుకుంటారు కొంతమంది.  అయితే అలా కట్ చేసిన కూరగాయల్లో కొన్ని రకాలు తాజాగానే ఉన్నా.. మరికొన్ని మాత్రం పాడవుతుంటాయి. ఈ క్రమంలో కట్ చేసిన కూరగాయలు ఏ విధంగా భద్రపరుచుకోవాలో ఓసారి చూద్దాం రండి..

దుంప జాతికి చెందినవైతే..!

బంగాళాదుంపలు, ముల్లంగి, క్యారట్.. మొదలైన కూరగాయల్ని కట్ చేసి ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో భద్రపరచడం వల్ల అవి వాటి మృదుత్వాన్ని కోల్పోతాయి. అలాగే వాటి రంగు కూడా మారిపోతుంది. దుంప జాతి కూరగాయల్లో ఉండే తేమ శాతం తొందరగా తగ్గిపోవడం వల్ల వాటి రుచి కూడా తగ్గిపోతుంది. అందుకే ఇటువంటి దుంప జాతి కూరగాయల్ని కట్ చేసిన తర్వాత వాటిని ఒక గిన్నెలో నీరు పోసి వదులుగా మూతపెట్టి భద్రపరచాలి. అయితే ఇంత జాగ్రత్తగా ఉంచినా అవి కేవలం ఒక రోజు మాత్రమే తాజాగా ఉంటాయి. కాబట్టి వండుకోవడానికి ఒక రోజు ముందు మాత్రమే వాటిని కట్ చేసుకోవడం ఉత్తమం. ఈ పద్ధతి పాటించడంలో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కట్ చేసిన ఈ కాయగూర ముక్కల్ని ఒక తడి టవల్‌లో చుట్టి కూడా ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.

ఆకుకూరలు..

ఆకుకూరలు ఫ్రిజ్‌లో భద్రపరచడానికి ముందే వాటి ఆకులను కొమ్మల నుంచి వేరు చేయాలి. ఈ విధంగా వేరు చేసిన ఆకుల్లో కూడా ఎండిపోయినవి, వాడిపోయినవి, కుళ్లినట్లు ఉన్నవాటిని వేరుచేసి పక్కకు తీసేయాలి. ఇప్పుడు మిగతా తాజా ఆకుల్ని ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. దీనికోసం ఒక పేపర్ టవల్ లేదా పలుచని కాటన్ వస్త్రం తీసుకుని అందులో ఈ ఆకులు వేసి చుట్టేసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. అయితే ఈ ఆకుకూరలు సాధారణంగా రెండు రోజులు మాత్రమే తాజాగా ఉంటాయి.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ..

క్యాబేజీ వంటి కాయగూరల్ని కట్ చేసిన వెంటనే ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేసి వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఇక క్యాలీఫ్లవర్, బ్రకలీ వంటి కూరగాయలైతే కట్ చేసినప్పటికీ వాటిలోని తేమని అంత తొందరగా కోల్పోవు. అందుకే క్యాలీఫ్లవర్‌ని గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరుచుకోవాలి. బ్రకలీ కట్ చేసిన తర్వాత నెట్‌తో ఉన్న కవర్స్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

వంకాయలు..!

సాధారణంగా వంకాయలు కట్ చేసిన కాసేపటికే రంగు మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే వాటి మీద పసుపు, నిమ్మరసం కలిపిన నీటిని చల్లితే అవి రంగు మారకుండా తాజాగా ఉంటాయి. అలాగే కట్ చేసిన వంకాయల్ని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలనుకుంటే వాటిని గుండ్రంగా కోసుకుని ఆ ముక్కల్ని పేపర్ టవల్స్ మధ్య వేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే వంకాయ ముక్కలు రెండు రోజులపాటు తాజాగా ఉంటాయి.

వీటిని ఇలా..!

కట్ చేసిన కీరాదోస ముక్కలను ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. అందుకే గాలి తగలని బ్యాగ్స్ లేదా డబ్బాల్లో వేసి వీటిని భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే కీరాదోస ముక్కలు 3 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

కట్ చేసిన టమాటా ముక్కలు ఎక్కువ సమయం నిల్వ ఉండవు. అందుకే ఒకవేళ వాటిని భద్రపరచాలనుకుంటే ఒక గిన్నెలో వాటిని వేసి పైన వదులుగా మూత పెట్టాలి. అయితే ఇలా భద్రపరచినవి కేవలం 24గం|| మాత్రమే తాజాగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

పొట్టు తీసేసి కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కల్ని విడివిడిగా గాలి తగలని కంటెయినర్లలో భద్రపరుచుకోవాలి. ఇవి దాదాపు 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా గాలి తగలకుండా భద్రపరుచుకోవాలి. వాటికి తడి తగిలితే జిగురుగా మారి తొందరగా పాడైపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని