తేమకు బూజు పట్టకుండా..!

వర్షాకాలంలో తడిదనం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు, స్నాక్స్‌.. వంటివి బూజు పడుతుంటాయి. ఇలా జరగకూడదంటే వాటిని నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు....

Published : 14 Jul 2023 12:45 IST

వర్షాకాలంలో తడిదనం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు, స్నాక్స్‌.. వంటివి బూజు పడుతుంటాయి. ఇలా జరగకూడదంటే వాటిని నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

బయటి నుంచి కొని తెచ్చుకున్న స్నాక్స్‌ చాలావరకు ప్యాకెట్లలో నిల్వ చేస్తారు. అయితే వీటిని ఒక్కసారి తెరిచాక.. వాటిని అలాగే వదిలేస్తే.. అవి మెత్తగా అయిపోతాయి. కొన్ని కొన్ని స్నాక్‌ ఐటమ్స్ బూజు పడతాయి కూడా! కాబట్టి స్నాక్స్‌ ఇంట్లో చేసినా, బయటి నుంచి తెచ్చుకున్నా గాలి చొరబడని గాజు జార్లలో నిల్వ చేయడం మంచిది.

వంటింట్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండడం, తడిదనం వల్ల ఆ వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. తద్వారా క్రిములు, ఫంగస్‌.. వంటివి వృద్ధి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి నిల్వ చేసే పదార్థాలు, నిత్యావసర సరుకుల్ని తేమ లేని చోట భద్రపరచాలి. అలాగే తేమ చేరకుండా మధ్యమధ్యలో, కప్‌బోర్డ్‌ మూలల్లో సిలికాజెల్ ప్యాకెట్లను ఉంచాలి.

తేమకు ఉప్పు, చక్కెర.. వంటివి గడ్డ కడతాయి. కాబట్టి ఈ రెండూ కలగలిసిన స్నాక్స్‌ని ఒకే జార్‌లో నిల్వ చేయకుండా విడివిడిగా భద్రపరచడం వల్ల రుచి కోల్పోకుండా, మెత్తబడకుండా జాగ్రత్తపడచ్చు.

పప్పులు, ధాన్యాలు, మసాలాలు.. వంటి ఫుడ్‌ ఐటమ్స్‌ని ఇంటికి తెచ్చాక బాగా ఆరబెట్టి లేదంటే ఎండలో పెట్టి నిల్వ చేయడం కొంతమందికి అలవాటు! అయితే ఈ సీజన్‌లో వాతావరణంలోని తేమ ఆ పదార్థాల పైకి చేరి అవి మరింత మెత్తబడే అవకాశం ఉంటుంది. ఫలితంగా అవి త్వరగా పాడవుతాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా వాటిని బాగా వేయించడం, అవెన్‌లో వేడి చేసి చల్లారాక గాలి చొరబడని గాజు జార్లలో భద్రపరచడం మంచిది.

తినగా మిగిలిన చపాతీలు, వేపుళ్లను అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్‌ చేసి నిల్వ చేయడం వల్ల వాటి రుచి కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.

గోధుమ పిండి, శెనగపిండి.. వంటివి తేమ తగిలితే పాడవుతాయి. కాబట్టి వాటిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిచి.. అందులో కొన్ని బిరియానీ ఆకుల్ని వేయాలి. తద్వారా ఈ ఆకులు ఏమాత్రం తేమ ఉన్నా పీల్చేసుకుంటాయి.

బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాల్ని కూడా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిలో కొన్ని వేపాకులు వేయడం వల్ల తేమ చేరకుండా ఉండడంతో పాటు పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

డ్రైఫ్రూట్స్‌, నట్స్ని గాలి చొరబడని, పొడిగా ఉండే గాజు జార్లలో నిల్వ చేయాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాలనుకునే వారు జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌కి దగ్గరగా అమర్చచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని