First Period: మీరు భయపడద్దు.. వారిని భయపెట్టద్దు!
నెలసరి.. వయసులో కొంచెం పెద్దవాళ్లే ఈ నొప్పిని, అసౌకర్యాన్ని భరించలేకపోతారు. అలాంటిది పిరియడ్ వచ్చిన తొలిసారి అమ్మాయిలు గాబరా పడడం, ఆందోళన చెందడం మామూలే! అలాగని వారిని వదిలేయకుండా.. తల్లులు వారిలో ఉన్న ఈ భయాన్ని, అపోహల్ని...
నెలసరి.. వయసులో కొంచెం పెద్దవాళ్లే ఈ నొప్పిని, అసౌకర్యాన్ని భరించలేకపోతారు. అలాంటిది పిరియడ్ వచ్చిన తొలిసారి అమ్మాయిలు గాబరా పడడం, ఆందోళన చెందడం మామూలే! అలాగని వారిని వదిలేయకుండా.. తల్లులు వారిలో ఉన్న ఈ భయాన్ని, అపోహల్ని తొలగించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వారికి పిరియడ్స్‌పై పూర్తి అవగాహన ఏర్పడుతుందని, నెలనెలా దీన్నో భారంలా కాకుండా శరీర ధర్మంలా స్వీకరించే అవకాశం ఉంటుందంటున్నారు. మరి, తొలిసారి నెలసరి పలకరించినప్పుడు తల్లులు అమ్మాయిల్ని ఎలా అలర్ట్ చేయాలి? ఈ పరిస్థితిలో వారిలో సానుకూల దృక్పథం నింపాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
అపోహలు తొలగించండి!
రుతుక్రమం అనేది మన శరీర ధర్మం. ఈ విషయం తెలిసినా ఇప్పటికీ చాలామంది దీనిపై వివిధ రకాల అపోహలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ సమయంలో వంట గదిలోకి రాకూడదని, మొక్కలు-ఇతర వస్తువుల్ని తాకకూడదని, నెలసరి రోజుల్లో వ్యాయామం చేస్తే రక్తస్రావం ఎక్కువవుతుందని, వేడి పుట్టించే పదార్థాలు తిన్నా ఈ సమస్య తలెత్తుతుందని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో భావనతో ఉంటారు. అయితే నెలసరి ప్రారంభమైన సమయంలో ఇలాంటి అపోహలకు అమ్మాయిల్ని దూరంగా ఉంచాలంటున్నారు నిపుణులు. అప్పటికే వారికి కాస్తో కూస్తో దీనిపై అవగాహన ఉన్నప్పటికీ.. తొలిసారి నెలసరి వచ్చిన సమయంలో ఆందోళన చెందడం సహజమే! పైగా స్కూల్లో తోటి స్నేహితుల ద్వారా ఇలాంటి అపోహలు, సందేహాల గురించి విని భయపడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే వారిని ఈ విషయాల్లో అలర్ట్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. నెలసరికి, ఆ సమయంలో వివిధ పనులు చేయడానికి, ఆహార నియమాలకు.. ఇలా ఒకదాంతో మరొకదానికి సంబంధం లేదని, అవన్నీ నిజాలు కావన్న విషయం వారు ప్రశాంతంగా ఉన్న సమయంలో అర్థమయ్యేలా వివరించాలి. అప్పుడే వారు నెలనెలా ఇబ్బంది పడకుండా, అసౌకర్యానికి గురికాకుండా ఉంటారు.
మీపై ఆధారపడకుండా..!
సాధారణంగా అమ్మాయిల శరీరతత్వాన్ని బట్టి 9-15 ఏళ్ల వయసులో నెలసరి ప్రారంభమవుతుంది. ఇక అంతకంటే రెండేళ్ల ముందు నుంచే అమ్మాయిల శరీరంలో మార్పులు మొదలవుతాయి. వక్షోజాల్లో పెరుగుదల, మూడ్‌స్వింగ్స్, ముఖంపై మొటిమలు రావడం.. వంటి మార్పులు కనిపిస్తాయి. ఇలాంటివి సహజమేనంటూ వారికి వివరించి చెప్పడంతో పాటు.. నెలసరి సమయంలో మీపై ఆధారపడకుండా ఉండాలంటే.. శ్యానిటరీ న్యాప్‌కిన్స్/మెన్‌స్ట్రువల్ కప్స్.. వంటివి వారికి అందుబాటులో ఉండేలా చూడాలి. వాటి వాడకం, పడేయడం; ఈ సమయంలో పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత.. మొదలైన అంశాలకు సంబంధించిన జాగ్రత్తల గురించి తెలియజేయాలి. అప్పుడే ఆయా భాగాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడచ్చు.
గ్యాడ్జెట్స్.. చాక్లెట్స్!
పిరియడ్స్ రావడం ఎంత సహజమో.. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు తలెత్తడమూ అంతే సహజం! ముఖ్యంగా.. కడుపునొప్పి, నడుంనొప్పి, ఉన్నట్లుండి మూడ్ మారిపోవడం, ఒత్తిడి-చిరాకు.. వంటివి ఒకేసారి దాడి చేస్తుంటాయి. మరి, వీటి నుంచి బయటపడడానికీ పలు గ్యాడ్జెట్స్, ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు.. హీటింగ్ ప్యాడ్, భావోద్వేగాల్ని అదుపుచేసేందుకు చాక్లెట్స్.. వంటివి ఎప్పుడూ తల్లులు తమ కూతుళ్లకు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒకవేళ వారు స్కూల్‌కి వెళ్లినా సరే.. బ్యాగ్‌లో వారితో పాటే వెంట తీసుకెళ్లే ఏర్పాటుచేయాలి. తద్వారా వారెక్కడున్నా మీరూ వెంటే ఉన్నారన్న భరోసా వారికి ఉంటుంది.. మీకూ వారి గురించి ఆందోళన ఉండదు. ఇలాంటి సౌకర్యాలు సమకూర్చడం వల్ల మీ అమ్మాయికి నెలసరి సమయంలో సౌకర్యాన్ని అందించినవారవుతారు.
కోరికలు.. అదుపులో..!
నెలసరి ప్రారంభమైనప్పుడు శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు తలెత్తుతాయి. ఫలితంగా ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి తగ్గి.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఇది లైంగిక హార్మోన్. కాబట్టి ఈ సమయంలో లైంగిక కోరికలు, వీటికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడే వారు తప్పుదోవ పట్టకుండా తల్లులు జాగ్రత్తపడాలంటున్నారు. ఈ క్రమంలో ఈ విషయాల గురించి కలిగే సందేహాలను భయపడకుండా నివృత్తి చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. అలాగే మీరూ ఎలాంటి సంకోచాలు లేకుండా సున్నితంగానే వారికి సమాధానాలివ్వాలి. అప్పుడే ఈ సమయంలో కోరికల్ని ఎలా అదుపుచేసుకోవాలి? ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాల గురించి వారికి ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా మూడో వ్యక్తి ద్వారా ఇలాంటి విషయాల గురించి తెలుసుకొని తప్పటడుగు వేయకుండా జాగ్రత్త పడచ్చు.
ప్రశ్నలడగనివ్వండి..!
అలాగే పిరియడ్స్ గురించి ముందస్తుగా ఎంత అవగాహన కల్పించినప్పటికీ.. తీరా సమయం వచ్చాక చాలామంది అమ్మాయిల్లో పలు విషయాల్లో సందేహాలు తలెత్తుంటాయి. వాటి గురించి అడిగే స్వేచ్ఛ వారికి తల్లులు అందించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సిల్లీ ప్రశ్నలు అడుగుతున్నారనో, ఇది కూడా తెలియదా అనో.. విసుక్కోకుండా.. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. అప్పుడే వారు తమ మనసులోని సందేహాల్ని బయటపెట్టగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.