Published : 09/01/2022 11:02 IST

వీటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారా..?

తీరైన శరీరాకృతిలో వక్ష సంపదది కూడా కీలకపాత్రే. అయితే వివిధ కారణాల వల్ల వాటి ఆకృతిలో, పరిమాణంలో తేడాలు చోటుచేసుకుని సాగిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. దీనివల్ల ఒక్కోసారి వయసు పైబడిన వారిగానూ కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో ఇది న్యూనతకూ దారితీస్తుంది. అయితే వక్షోజాల్లో ఇలాంటి తేడాలు ఎందుకొస్తాయి..? అని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఎందుకంటే మనం రోజూ చేసే కొన్ని కొన్ని పనులు కూడా వీటి అందం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని మహిళలంతా తమ ఎద సంపదను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి. అందుకు రోజువారీ ఆహారపుటలవాట్లే కాదు.. వ్యాయామం కూడా తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన వక్ష సంపదను పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి...

సరిగ్గా సరిపోయేలా..

స్తనాలు ఆరోగ్యంగా, అందంగా కనిపించడంలో బ్రాల పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి రొమ్ముల్ని సాగకుండా పట్టి ఉంచుతాయి. అయితే వీటిని కొనే విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. రొమ్ముల్లో సాగుదల వస్తుందేమోనని.. బిగుతుగా ఉండే బ్రాలను ఎంపిక చేసుకుంటారు. తద్వారా అసౌకర్యంగా అనిపించడం మాత్రమే కాదు.. వెన్నునొప్పి, ఆ ప్రదేశంలో చర్మంపై అలర్జీ.. వంటివి రావడం జరుగుతాయి. కాబట్టి ఎద సంపదను కాపాడే బ్రాల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. అలాగని మరీ వదులుగా ఉన్నవి ఎంచుకున్నా.. రొమ్ములు సాగిపోవచ్చు. అందుకే స్తనాల పరిమాణానికి సరిపోయేలా, సౌకర్యవంతంగా ఉండే మెటీరియల్‌తో రూపొందించిన బ్రాలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండడంతో పాటు వాటి ఆరోగ్యాన్నీ సంరక్షించుకున్నవాళ్లవుతారు.

వేగంగా తగ్గొద్దు.. పెరగొద్దు..!

బరువు చాలా తక్కువగా ఉన్న వారైనా, ఎక్కువగా ఉన్న వారైనా.. తొందరగా బరువు పెరగాలని, తగ్గాలని కోరుకోవడం సహజం. ఇందుకు ఆహార నియమాల్లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు కఠిన వ్యాయామాలకు సైతం ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. ఫలితంగా శరీరంపై, స్తనాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తద్వారా ఇతరత్రా కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు రొమ్ముల్లో నొప్పి, అవి సాగిపోవడం.. వంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఒక్కసారిగా బరువు తగ్గాలనో, పెరగాలనో ప్రయత్నించకుండా ఒక ప్రణాళిక ప్రకారం సరైన ఆహార నియమాలు పాటిస్తూ నిర్దేశిత వ్యాయామాలు చేయాలి. రోజువారీ ఆహారంలో భాగంగా ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఆలివ్ నూనె, వాల్‌నట్స్, పండ్లు.. వంటివన్నీ తీసుకోవాలి. అలాగే పుషప్స్, పుల్ఓవర్స్, క్రాస్ఓవర్స్, యోగా.. వంటి వ్యాయామాలకూ సమయం కేటాయించాలి. అప్పుడే ఎద సంపద ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది.

బోర్లా పడుకోవద్దు..

మనం ఎలా పడుకుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం.. అనే విషయాలు కూడా రొమ్ముల ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు కొంతమందికి బోర్లా పడుకోవడం, జారగిలబడి కూర్చోవడం అలవాటు. ఇలాంటి వాటి వల్ల రొమ్ముల్లో సాగుదల, సరైన ఆకృతి లేకపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే నిటారుగా కూర్చోవడం, భుజాలు వేలాడినట్లుగా కాకుండా స్టిఫ్‌గా నిలపడం, వెల్లకిలా పడుకోవడం.. వంటివి మంచి మార్గాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. పడుకునేటప్పుడు రొమ్ములపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం వల్ల వాటిలో నొప్పి రాకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

ఇవీ ముఖ్యమే..

రొమ్ముల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా.. వాటిని చక్కటి ఆకృతి, పరిమాణాల్లో మలచుకోవాలన్నా.. రోజూ కాసేపు మాయిశ్చరైజర్ సహాయంతో మసాజ్ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాగే ఈ మధ్య రొమ్ము క్యాన్సర్ ఆడవారి పట్ల పెద్ద మహమ్మారిగా తయారైంది. కాబట్టి దీని బారి నుంచి కాపాడుకోవాలంటే ముందు నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు రొమ్ముల్ని స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో ఏవైనా గడ్డల్లాగా తగిలినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్న విషయం మర్చిపోవద్దు. అలాగే నిర్ణీత వ్యవధిలో మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఎద సంపదను ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని