కోటలో రాణిగా కంటే.. ఈ వ్యాన్‌లోనే హ్యాపీగా ఉన్నా..!

ప్రస్తుత కాలంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే ఎక్కువ. దానివల్ల చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. ఫలితంగానే సైకాలజిస్టుల వద్దకు వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫ్లోరిడాకు చెందిన కైట్లిన్ పైల్ (36) కూడా ఈ జాబితాలో ఉంటుంది. భర్తతో సమస్యల వల్ల విడాకులు తీసుకుంది.

Published : 05 Jul 2024 12:41 IST

(Photos: Instagram)

ప్రస్తుత కాలంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే ఎక్కువ. దానివల్ల చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. ఫలితంగానే సైకాలజిస్టుల వద్దకు వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొన్ని గణాంకాల ప్రకారం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కొవిడ్‌ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. ఫ్లోరిడాకు చెందిన కైట్లిన్ పైల్ (36) కూడా ఈ జాబితాలో ఉంటుంది. భర్తతో సమస్యల వల్ల విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంది. కోట్ల ఆస్తి ఉన్నా ఆమెకు పరిష్కారం లభించలేదు. దాంతో ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సమస్యను నయం చేసుకుంది. అంతేకాకుండా నచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో ఆ వివరాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా...

ఏడు రకాల మానసిక సమస్యలు..!

మాది ఫ్లోరిడాలోని ఒర్లాండో ప్రాంతం. నేను కమ్యూనికేషన్‌ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడం ప్రారంభించాను. కొంతకాలానికే నా తప్పు లేకున్నా నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశారు. ఆ అవమానం తట్టుకోలేక మూడు వారాల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు. అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నా. ఇకముందు మరొకరు నా జీతాన్ని.. జీవితాన్ని నిర్ణయించకూడదనుకున్నా. అందుకే సొంతంగా ‘ప్రూఫ్‌రీడ్‌ ఎనీవేర్‌’ అనే బ్లాగ్‌ ప్రారంభించా. కొద్దికాలానికే దానికి మంచి ఆదరణ లభించింది. 2014లో అదే పేరుతో సంస్థను ప్రారంభించా. ప్రతి ఏడాది దాని విలువ పెరుగుతూ పోయింది. అలా వచ్చిన డబ్బుతో ఫ్లోరిడాలో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని కొనుగోలు చేశా. స్వతహాగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై మక్కువ ఉండడంతో నచ్చినట్టుగా ఇంటీరియర్‌ కూడా చేయించాను. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా సమస్యలు వచ్చాయి. నా భర్తతో విభేదాలు మొదలయ్యాయి. అవి తారస్థాయికి చేరుకోవడంతో 2019లో విడాకులు తీసుకున్నాం. దాంతో ఎనిమిదేళ్ల మా ప్రయాణం ముగిసింది. ఫలితంగా ఒక్కసారిగా ఏడు రకాల మానసిక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. సమస్యను నయం చేసుకోవడానికి పలువురు మానసిక నిపుణులను కలిశాను. అయినా ఆశించిన ఫలితం రాలేదు.

జీవన విధానంలోనే సమస్య..!

ఇలా మానసిక సమస్యలతో నలిగిపోతుంటే నాకు అరుదైన బ్లడ్‌ క్యాన్సర్‌ ఉందని డాక్టర్లు చెప్పారు. అందుకు పరిష్కారం లేదని చెప్పడంతో మరింతగా కుంగిపోయాను. జీవితాంతం మందులు వాడమని సూచించారు. ఒకవైపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఇష్టపడి కొన్న ఇల్లు భారమైంది. ఒక్కదాన్నే ఉండడంతో నిర్వహణ భారం విపరీతంగా పెరిగింది. మరోవైపు సంస్థకు సంబంధించిన పనులు కూడా చూసుకోవాల్సి వచ్చేది. అప్పుడు నా సమస్యలకు మూలం.. నా జీవిన విధానమే అన్న భావన కలిగింది. విలాసంగా ఉండాలన్న ఆలోచనలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాననిపించింది. అందుకే వీటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. మొదటగా నా సంస్థని 38 కోట్ల రూపాయలకు అమ్మేశా. ఇంటిని కూడా మంచి ధరకు అద్దెకు ఇచ్చా. అలా వచ్చిన డబ్బుతో Mercedes Sprinter వ్యాన్‌ను కొన్నా. అందులో కిచెన్‌, బాత్‌రూం, బెడ్‌ ఉండేలా మార్పులు చేయించాను. విద్యుత్‌ కోసం సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేయించా. అలా వ్యాన్లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించా..!

ఆ ఆలోచన లేదు..

2023లో నా ప్రయాణాన్ని ప్రారంభించా. ఆ వ్యాన్‌తోనే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తిరిగా. లైఫ్‌ కోచ్‌గా మారి నాలాగే ఒక దశలో జీవితం ఆగిపోయిందనుకున్న వారికి పాఠాలు చెబుతున్నా. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించా. కొత్త సాహసాలూ ప్రయత్నించాను. ఫలితంగా నా సమస్యలు మాయమయ్యాయి. బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా తగ్గుముఖం పట్టింది. ఈ ప్రయాణంలో చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకున్నా. అందులో భాగంగానే జెఫ్‌ అనే వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసి పర్వతారోహణ కూడా చేశాం. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గంటల పాటు డ్రైవింగ్‌ చేస్తా. మధ్యలో స్నేహితుల ఇళ్లు వస్తే అక్కడ పార్క్‌ చేసి వారి వైఫైని ఉపయోగించుకుని పని కూడా చేస్తాను. ఈ క్రమంలో పార్కింగ్‌ విషయంలో మంచి అనుభవం వచ్చింది. ఇలా నా ప్రయాణం మొదలై ఏడాది కావస్తోంది. కానీ, ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆలోచన మాత్రం లేదు. ఇంతకుముందు ఎంతో ఖర్చు పెట్టి వెకేషన్స్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడున్న సంతోషం అప్పుడు లభించలేదు. ప్రస్తుతం నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉంది. స్వీయ నమ్మకం కూడా పెరిగింది’ అని చెప్పుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్