రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అయినా దాని ముందు నేను ఓడిపోను!

జీవితమంటేనే కష్టసుఖాల సంగమం. సుఖాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలకూ అంతే సానుకూలంగా స్పందించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం అంటోంది టాలీవుడ్‌ బ్యూటీ హంసానందిని. తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం చెప్పి అందరినీ విస్మయానికి గురిచేసింది

Updated : 20 Dec 2021 17:15 IST

జీవితమంటేనే కష్టసుఖాల సంగమం. సుఖాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలకూ అంతే సానుకూలంగా స్పందించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం అంటోంది టాలీవుడ్‌ బ్యూటీ హంసానందిని. తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం చెప్పి అందరినీ విస్మయానికి గురిచేసింది. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రస్తుతం దీన్ని జయించేందుకు శాయశక్తులూ ఒడ్డుతున్నానంటూ తాజాగా తన క్యాన్సర్‌ జర్నీ గురించి ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌ చూసి చాలామంది సెలబ్రిటీలు, నెటిజన్లు ‘త్వరగా కోలుకోవాలంటూ’ హంసకు సందేశాలు పంపుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడే క్రమంలో ఆమె చూపిస్తోన్న తెగువను ప్రశంసిస్తున్నారు.

నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా తెలుగు తెరపై మంచి పేరు తెచ్చుకుంది హంసా నందిని. పలు ప్రత్యేక గీతాలతో, కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించింది. అయితే 2018 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఆపై తన యూట్యూబ్‌ ఛానల్‌తో అందరికీ దగ్గరైంది. ఇక తాజాగా తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, దీన్ని జయించి త్వరలోనే అందరి ముందుకు వస్తానంటూ తన క్యాన్సర్‌ ప్రయాణాన్ని ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చిందీ టాలీవుడ్‌ అందం.

ఆ భయంతోనే ఇన్నాళ్లూ..!

ప్రస్తుతం కీమోథెరపీ చేయించుకుంటోన్న హంస.. ఈ క్రమంలో గుండుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

‘జీవితం నాకు ఎన్ని సవాళ్లు విసిరినా, అది నా పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా.. నేను దానికి బాధితురాలిని కాదల్చుకోలేదు. అనుక్షణం భయంతో, నిరాశతో, ప్రతికూల భావనలతో కుంగిపోవాలనుకోవట్లేదు. ప్రేమతో, ధైర్యంతో ఈ గడ్డు దశను దాటి ముందుకు వెళ్లాలనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. ఇన్నాళ్లూ ఆ ప్రతికూలతల్లోనే బతికాను. నాలుగు నెలల క్రితం నా రొమ్ములో గడ్డ తగలగానే మనసులో ఏదో తెలియని భయం ఆవహించింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆ క్షణం నాకు అర్థమైంది.

ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది!

సమస్యను నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకున్నా. నా భయమే నిజమైంది. ‘Grade 3 Invasive Carcinoma (Breast Cancer)’ ఉందని తేలింది. కొన్ని పరీక్షలు, స్కాన్ల అనంతరం నా రొమ్ములోని కణితిని ఆపరేషన్‌ ద్వారా తొలగించారు వైద్యులు. ఇది భవిష్యత్తులో తిరిగి వ్యాప్తి చెందదని తేల్చి చెప్పారు. త్వరగా గుర్తించడం వల్లే ముప్పు తప్పిందని సంతోషపడ్డా. కానీ నా ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఎందుకంటే BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్‌) పరీక్షలో నాకు పాజిటివ్‌ అని తేలింది. అంటే.. దీని జన్యు పరివర్తన కారణంగా నాకు భవిష్యత్తులో.. 70 శాతం రొమ్ము క్యాన్సర్‌, 45 శాతం అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని చెప్పారు వైద్యులు. అయితే ఈ ముప్పును తగ్గించడానికి కొన్ని విస్తృత రోగనిరోధక శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాకు 9 సార్లు కీమోథెరపీ చికిత్సలు పూర్తయ్యాయి. మరో 7 సార్లు చేయించుకోవాల్సి ఉంది.

అందుకే ఈ ప్రమాణాలు!

అయితే ఈ వ్యాధిని జయించే క్రమంలో నాకు నేను కొన్ని ప్రమాణాలు చేసుకున్నా.

* ముందుగా ఈ మహమ్మారికి నన్ను జయించే అవకాశం, నా జీవితాన్ని శాసించే అధికారం ఇవ్వాలనుకోవట్లేదు. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఈ యుద్ధాన్ని గెలవాలనుకుంటున్నా.

* త్వరలోనే కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి తెరపైకి రావాలనుకుంటున్నా.

* జీవితం చాలా విలువైంది. దాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటున్నా.

* ఇలాంటి మహమ్మారులతో పోరాటం చేస్తోన్న బాధితుల్లో స్ఫూర్తి నింపడానికే నా కథను పంచుకుంటున్నా.

ఈ ప్రయాణంలో నా క్షేమం కోరుతూ, అండగా నిలుస్తోన్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!

ప్రేమతో,

మీ హంస..’ అంటూ తన క్యాన్సర్‌ కథను పంచుకుందీ బ్రేవ్‌ బ్యూటీ.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు లక్ష్మి, ప్రియమణి, సురభి తదితర తారలతో పాటు పలువురు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మహమ్మారిని జయించే క్రమంలో తాను ప్రదర్శిస్తోన్న ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు.

ముందే గుర్తిస్తే ముప్పు తగ్గుతుంది!

గతంలో మరికొంతమంది సెలబ్రిటీలూ రొమ్ము క్యాన్సర్‌కు ఎదురొడ్డి పోరాడారు. ఈ మహమ్మారిని జయించి, తిరిగి సంతోషంగా జీవిస్తున్నారు. వారిలో బాలీవుడ్‌ దర్శకురాలు, రచయిత్రి తాహిరా కశ్యప్‌ ఒకరు. 2018లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డ ఆమె.. పలు చికిత్సల అనంతరం కోలుకుంది. ఆపై సందర్భం వచ్చినప్పుడల్లా తన క్యాన్సర్ కథను పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. అయితే ఎవరికి వారు ఎప్పటికప్పుడు రొమ్ముల్ని పరీక్షించుకుంటూ తొలి దశలోనే క్యాన్సర్‌ని గుర్తించగలిగితే.. వ్యాధి మీరకుండా జాగ్రత్తపడచ్చంటోందీ బోల్డ్‌ డైరెక్టర్‌.

‘స్వీయ పరీక్షల వల్ల వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడచ్చు. లేదంటే చిన్న వయసైనా పరిస్థితులు చేయిదాటి పోవచ్చు. ఆరోగ్యం విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే అనుమానించి పరీక్షలు చేయించుకోవడంలో తప్పు లేదు. ఈ సమయపాలనే మన జీవితాన్ని నిలబెట్టే సాధనం కావచ్చు. కాబట్టి ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోకండి!’ అని చెబుతోంది తాహిరా.

 

ధైర్యమే దానికి మందు!

35 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ బారిన పడి.. దాన్ని జయించింది తమిళ నటి గౌతమి. ప్రస్తుతం ఇదే మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ‘Life Again Foundation (LAF)’ అనే సంస్థను నెలకొల్పిందామె. ‘రొమ్ములో కణితిని గుర్తించిన నేను దాన్ని నిర్లక్ష్యం చేయాలనుకోలేదు. అది రొమ్ము క్యాన్సర్‌ వల్లే అని తేలిన తర్వాత కొన్నేళ్ల పాటు గడ్డు జీవితాన్ని అనుభవించా. అయితే తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం మంచిదైంది. లంపెక్టమీ, కీమోథెరపీ చికిత్సలు చేయించుకున్నా. వీటితో పాటు ధైర్యం, ఓపిక, ఆత్మవిశ్వాసం, నమ్మకం.. ఇలా నా మనసులో అన్నీ సానుకూల ఆలోచనలే నింపుకొన్నా. ఇవే నన్ను ఈ మహమ్మారి నుంచి బయటపడేలా చేశాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని హ్యాపీగా ఉన్నా..’ అంటోందీ అలనాటి అందాల తార.

 

పోరాడి గెలిచారు!

(Photo: Facebook)

* ఇండియన్‌ అమెరికన్‌ నటి నమ్రతా సింగ్‌ గుజ్రాల్‌ కూడా తొలి దశ రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. ఆ తర్వాత Burkitt’s Lymphoma అనే మరో క్యాన్సర్‌ పైనా పోరాటం చేసింది. ఇలా రెండు క్యాన్సర్లను గెలిచి తన ధైర్యాన్ని చాటిన ఈ అలనాటి నటి 2013లో ‘1 a Minute’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. రొమ్ము క్యాన్సర్‌ నేపథ్యంలో తీసిన ఈ లఘుచిత్రం సుమారు 600లకు పైగా థియేటర్లలో విడుదలైంది. క్యాన్సర్‌ నేపథ్యంలో తీసిన ఓ చిత్రం ఇంత పెద్ద ఎత్తున విడుదలవడం అప్పట్లో ఓ విశేషం.

(Photo: Twitter)

* 1960-70ల్లో బాలీవుడ్‌ను ఓ వూపు వూపిన ముంతాజ్ తన 54వ ఏట రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. రొమ్ముల్లో ప్రాణాంతకర కణితి ఉండడంతో దాన్ని క్యాన్సర్‌గా గుర్తించిన వైద్యులు.. వెంటనే ఆమెకు చికిత్సనందించారు. దీంతో ఆమె ఆ వ్యాధి బారి నుంచి బయటపడింది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యుల అండ ఎంతగానో ఉందని చెబుతుందీ అందాల నటి.

* హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలీ తన 37వ ఏట రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొంది. తనకు దాదాపు 87 శాతం రొమ్ము క్యాన్సర్ సోకిందని నిర్ధరణ అయిన తర్వాత డబుల్ మాస్టెక్టమీ పద్ధతి ద్వారా తన రెండు రొమ్ముల్ని తొలగించుకుందీ బ్యూటీ. తనకు బీఆర్‌సీఏ1 జన్యువు వల్ల ఈ వ్యాధి సోకినట్లు పరీక్షల అనంతరం ఆమె తెలియజేసింది. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ఈ సుందరి.. మొదటి దశలోనే ఈ వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యవంతమైన జీవన విధానాల్ని పాటించడం మంచిదని చెబుతోంది. రొమ్ము క్యాన్సర్ బారి నుంచి బయటపడిన రెండేళ్లకే అండాశయ క్యాన్సర్‌ను కూడా ఎదుర్కొందామె. ఏంజెలినా తల్లి కూడా రొమ్ము క్యాన్సర్ బాధితురాలేనట.

* ఒకప్పుడు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన అమెరికన్ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సైతం రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొన్న ప్రముఖుల్లో ఒకరు. తొలి దశ రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించిన ఆమె.. దాదాపు ఆరు వారాల పాటు రేడియేషన్ పద్ధతి ద్వారా చికిత్స తీసుకుంది.

వీరితో పాటు అంతర్జాతీయ సెలబ్రిటీలు కైల్‌ మినోగ్‌, బార్బరా మోరీ, మెలిస్సా ఈతరిడ్జ్‌.. తదితరులు కూడా రొమ్ము క్యాన్సర్‌ను ధైర్యంగా జయించిన వారే! అందుకే ఈ బ్రేవ్‌ బ్యూటీస్‌ని ఆదర్శంగా తీసుకుందాం..! తరచూ స్వీయ పరీక్షలతో ఈ మహమ్మారికి దూరంగా ఉందాం..! దురదృష్టవశాత్తూ ఈ వ్యాధి సోకినా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గెలుద్దాం..! బీ పాజిటివ్‌!!

అలాగే ఇలాంటి మహమ్మారుల్ని ఎనలేని ఆత్మవిశ్వాసంతో జయించి ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తోన్న వారు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. అలాంటి వారు క్యాన్సర్ పైన మీ పోరాటాన్ని, మీ క్యాన్సర్‌ కథను contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి! తద్వారా ఎంతోమందిలో స్ఫూర్తి నింపండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని