సీమంతం వేడుకల్లో మెరిసి మురిసిన చందమామ!

రెండేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు నడిచింది పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.  గర్భం ధరించాక సినిమాలకు కాస్త విరామమిచ్చిన ఈ అందాల తార.. ఇటీవలే దుబాయ్‌లో బేబీమూన్‌ని ఆస్వాదించింది...

Published : 21 Feb 2022 17:23 IST

(Photos: Instagram)

రెండేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు నడిచింది పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.  గర్భం ధరించాక సినిమాలకు కాస్త విరామమిచ్చిన ఈ అందాల తార.. ఇటీవలే దుబాయ్‌లో బేబీమూన్‌ని ఆస్వాదించింది. ఈ నేపథ్యంలో- తాజాగా సీమంతం వేడుకలు జరిగాయి. సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో కాజల్ ఎరుపు రంగు చీరలో మెరిసి మురిసిపోయింది. 

తన సీమంతం తాలూకు మధురమైన జ్ఞాపకాలను ఈ ముద్దుగుమ్మ  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఆ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం!

అమ్మయ్యే క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, తద్వారా చర్మంపై ఏర్పడే స్ట్రెచ్‌ మార్క్స్‌, వక్షోజాల్లో పెరుగుదల.. ఇలా మన శరీరం రాబోయే పాపాయికి పాలివ్వడానికి అనువుగా సిద్ధమవుతుంది. అయితే ఒక దశలో ఈ మార్పులన్నీ కాస్త అసౌకర్యానికి గురిచేసినా.. అమ్మవుతున్నానన్న ఆనందం ముందు ఇవి నిలవలేవు. ఇలాంటి ప్రాథమిక విషయాల్ని కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో గర్భం ధరించిన మహిళల్ని విమర్శిస్తుంటారని ఇటీవలే ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేసింది కాజల్. త్వరలో అమ్మ కాబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. తానూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ వాటిని పట్టించుకొని ఈ విలువైన సమయాన్ని వృథా చేసుకోదల్చుకోలేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. అంతేనా.. ఓ గర్భిణిగా తాను పాటిస్తోన్న కొన్ని చిట్కాలు, జాగ్రత్తల్నీ పంచుకుంటూ ఎంతోమంది కాబోయే అమ్మల్లో స్ఫూర్తి నింపింది కాజల్.

‘గర్భం ధరించినప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పుల వల్ల బరువు పెరుగుతాం.. వక్షోజాల్లో పెరుగుదల కనిపిస్తుంది.. శరీరంపై స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి.. అలాగే నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట కూడా క్రమంగా పెరుగుతుంది. ఇలా బిడ్డ పుట్టే సమయానికి మన శరీరం పాపాయికి పాలివ్వడానికి సన్నద్ధమవుతుంది. కొన్ని సమయాల్లో మొటిమల సమస్య తలెత్తి అందం తగ్గుతున్నట్లుగా అనిపించచ్చు.. అలసట, మానసిక ప్రశాంతతను కోల్పోయిన భావన కలుగుతుంది. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మన ఆరోగ్యం, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే ప్రసవం తర్వాత తిరిగి పూర్వపు స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టచ్చు.. కానీ పూర్తిగా మునుపటి దశకు చేరుకోవచ్చు.. చేరుకోకపోవచ్చు. అయితే అమ్మయ్యే క్రమంలో ఈ మార్పులన్నీ సహజమే అయినప్పుడు.. మన జీవితాల్లోకి ఓ బుజ్జాయిని ఆహ్వానించడానికి మనం ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు వీటిని అసాధారణంగా భావించాల్సిన పనిలేదు. అలాగే ఇతరుల మాటలు పట్టించుకొని ఇంత అందమైన ప్రయాణాన్ని అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అమ్మతనం ఓ వేడుక లాంటిది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం..’ అంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందీ కాబోయే అమ్మ.

ఇక సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించిన ‘హే సినామిక’ చిత్రం మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్