Published : 19/04/2022 17:08 IST

Kalaripayattu : మంచు లక్ష్మి మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు చూశారా?

(Photo: Instagram)

మనం చేసే వ్యాయామాలు ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌నూ అందిస్తాయి. మనసులోని ప్రతికూల ఆలోచనల్ని తొలగించి.. పాజిటివిటీ వైపు అడుగులేయిస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే తాను కలరిపయట్టు యుద్ధ విద్యను తన రొటీన్‌లో భాగం చేసుకున్నానని చెబుతోంది టాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న. ప్రస్తుతం ఈ యుద్ధ కళ నేర్చుకుంటోన్న ఆమె.. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ఒక్కో రకమైన ఆసనంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలపై ఓ లుక్కేద్దాం రండి..

ఏ ఆసనంతో ఏ ప్రయోజనం?!

కలరిపయట్టు యుద్ధ విద్యలో భాగంగా ఒక్కో ఆసనం సాధన చేస్తోంది మంచు లక్ష్మి. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

* మార్జాలాసనం - శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారడానికి, మనసును అదుపులో పెట్టుకోవడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది.

* గజాసనం - కలరిపయట్టు ఆసనాల్లో ఇది చాలా అరుదైంది. కోపాన్ని అణచివేయడానికి, శారీరక దృఢత్వానికి, సమతుల్యతకు.. ఇది చక్కటి మార్గం. హార్మోన్లను సమతులం చేస్తుందీ ఆసనం.

* సింహ ఆసనం - కలరిపయట్టులోని ప్రతి ఆసనం పక్షులు లేదా జంతువుల పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంటుంది. సింహ ఆసనం కూడా అలాంటిదే! మనలోని సంసిద్ధత, వేగం, గంభీరత్వానికి ప్రతీకగా నిలుస్తుందీ ఆసనం.

* అశ్వ ఆసనం - యోగాసనాల్లో వీరభద్రాసనాన్ని పోలి ఉంటుందీ ఆసనం. తొడ వెనుక భాగం ఫ్లెక్సిబుల్‌గా మారడానికి, పిరుదుల దృఢత్వానికి, కోర్‌ కండరాల (ఉదరం, పొత్తి కడుపు, వీపు.. వంటి భాగాల్లో ఉండే కండరాలు) సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

* మయూరాసనం - అప్రమత్తతను పెంచుతుంది. తద్వారా శత్రువు దాడిని ముందే పసిగట్టి స్వీయ రక్షణ పొందచ్చు.

* ఈ యుద్ధ కళలో భాగంగా సాధన చేసే ప్రతి ఆసనం మనలోని ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసి.. పాజిటివిటీని దగ్గర చేస్తుంది. తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

గతంలో వీళ్లు కూడా!

కేరళలో పుట్టిన ఈ ప్రాచీన యుద్ధ విద్యలో నిష్ణాతులు కావాలంటే ఎంతో కష్టపడాలంటున్నారు నిపుణులు. అయితే సాధన చేస్తున్న కొద్దీ వేగం, శారీరక సత్తువను పెంపొందించుకోవచ్చంటున్నారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మితో పాటు గతంలో.. దియా మీర్జా, అసిన్‌, దీపికా పదుకొణె, శిల్పా శెట్టి, కంగనా రనౌత్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, అదితీ రావ్‌ హైదరి, శ్రద్ధా కపూర్‌.. వంటి పలువురు తారలు తమ అభిరుచులకు అనుగుణంగా/సినిమాల్లో తమ పాత్రల కోసం ఇలాంటి యుద్ధ విద్యల్ని నేర్చుకొని సత్తా చాటారు. వీరిలో కొంతమంది ఆయా మార్షల్‌ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్‌ కూడా సంపాదించారు.

ఆరోగ్యానికి.. ఫిట్‌నెస్‌కీ!

ఏదేమైనా ఈ యుద్ధ విద్యను ట్రైనర్‌ సహాయంతో దశల వారీగా నేర్చుకోవచ్చు. ముందు శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు దోహదం చేసే వ్యాయామాలతో మొదలై.. ఆపై కర్రలు, కత్తులు.. వంటి వాటితో ఈ యుద్ధ కళలో నైపుణ్యం సాధించచ్చంటున్నారు నిపుణులు. ఇటు శక్తి సామర్థ్యాలు పెంచడంతో పాటు, అటు ఆరోగ్యం-ఫిట్‌నెస్‌ పరంగానూ ఈ వ్యాయామం బోలెడన్ని ప్రయోజనాల్ని చేకూర్చుతుందని చెబుతున్నారు.

* కలరిపయట్టు యుద్ధ విద్యలో భాగంగా చేతులు, కాళ్లను కదిలించడం.. శరీరాన్ని విల్లులా వంచడం, ఎగిరి దూకడం.. వంటి పలు భంగిమల వల్ల శరీరంలోని ప్రతి అవయవానికీ చక్కటి వ్యాయామం లభిస్తుంది. తద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

* అలాగే ఈ యుద్ధ కళ సాధన చేస్తున్న క్రమంలో కండరాలకు, ఎముకలకు మంచి వ్యాయామం అందుతుంది. తద్వారా కండరాల్లో, ఎముకల్లో ఏవైనా గాయాలు, వాపు.. వంటివి ఉంటే త్వరగా మానిపోతాయంటున్నారు నిపుణులు.

* ఇందులో భాగంగా శత్రువు కదలికలను పసిగట్టి వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వేగంగా స్పందించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మన ఏకాగ్రత, వేగం పెరుగుతాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కళ ఆత్మరక్షణ విద్యగా ఉపకరిస్తుందని చెప్పచ్చు.

* కొంతమంది ఏ పని చేయాలన్నా బద్ధకిస్తుంటారు. అలాంటివారు బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఈ మార్షల్‌ ఆర్ట్‌ సరైందని సూచిస్తున్నారు నిపుణులు.

* శారీరక సత్తువను, దేహ దారుఢ్యాన్ని, ఓపికను పెంచడంలో ఈ యుద్ధకళను మించింది లేదు.

* కలరిపయట్టులో శిక్షణ పొందే క్రమంలో కొన్ని యోగాసనాలు కూడా నేర్పిస్తారు. అవి శారీరక, మానసిక ఒత్తిళ్లను మటుమాయం చేయడంలో బాగా సహకరిస్తాయి. తద్వారా సానుకూల దృక్పథం అలవడడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది.

* బరువు తగ్గడానికి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ యుద్ధ విద్యకు సాటి మరొకటి లేదు.

* ఈ రోజుల్లో మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు మీరు ముందే ఈ యుద్ధ విద్యలో నైపుణ్యం సాధించి ఉంటే మీరే ఓ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పెట్టుకొని ఇతర మహిళలకు ఇందులో శిక్షణ ఇవ్వచ్చు. ఇది మీకు మంచి ఉపాధి మార్గంగానూ ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని