Celebrity Yoga: అందుకే ఎంత బిజీగా ఉన్నా యోగ సాధన మాత్రం ఆపం..!

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మన అందాల తారలు తమ అందం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహార, వ్యాయామ నియమాలతో పాటు యోగాకూ తమ జీవనశైలిలో చోటిచ్చారు కొందరు ముద్దుగుమ్మలు.

Updated : 21 Jun 2024 21:31 IST

(Photos: Instagram)

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మన అందాల తారలు తమ అందం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహార, వ్యాయామ నియమాలతో పాటు యోగాకూ తమ జీవనశైలిలో చోటిచ్చారు కొందరు ముద్దుగుమ్మలు. తమ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అందరిలో స్ఫూర్తి నింపే వీరు యోగాతో తమకున్న అనుబంధాన్నీ పలు సందర్భాల్లో పంచుకున్నారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా కొందరు తారల యోగా అనుభవాలు మీకోసం..!

బిజీగా ఉన్నా యోగా ఆపను! - మృణాల్‌ ఠాకూర్

నా జీవితంలో ఫిట్‌నెస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని అప్పటికప్పుడే సొంతం చేసుకోవడం కుదరదు. అందుకే ముందు నుంచే దీనిపై దృష్టి సారించాలి. నేనూ ఇండస్ట్రీకి రాకముందు నుంచే వ్యాయామాల్ని నా రోజువారీ రొటీన్‌లో చేర్చుకోవడం మొదలుపెట్టా. సమతులాహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు రోజూ సాధన చేస్తుంటా. అందులో యోగా తప్పనిసరిగా ఉంటుంది. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా యోగాసనాలు వేయడం మాత్రం ఆపను.. ప్రత్యేకంగా దీనికంటూ కాస్త సమయం కేటాయించుకుంటా. కొంతమంది బరువు తగ్గాలని, ఫిట్‌గా మారాలని సప్లిమెంట్స్‌ వాడుతుంటారు. నాకు వీటిపై నమ్మకం లేదు. ఆహారమైనా, వ్యాయామాలైనా సహజసిద్ధమైన పద్ధతుల్నే పాటిస్తా. కొన్ని రకాల యోగాసనాలు నేర్చుకోవడానికి నాకు కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పుడు వాటిని మరింత సమర్థంగా, సులభంగా చేస్తున్నా.


ఆ ఆసనాలంటే ఇష్టం! - రష్మిక

శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకోవడానికీ యోగాను మించింది మరొకటి లేదు. ఇది శరీరం ఫ్లెక్సిబిలిటీని, దృఢత్వాన్ని, బ్యాలన్స్‌ను పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే యోగా అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అధో ముఖ స్వనాసనం, వీరభద్రాసనం, వృక్షాసనం.. వంటి యోగాసనాలు తప్పకుండా సాధన చేస్తా.


నా యోగా పార్ట్‌నర్‌ అదే! - కీర్తి సురేష్

ఉదయం లేవగానే నేను చేసే మొదటి పని యోగా. నా పెట్‌ డాగ్‌ నైక్‌తో కలిసి యోగాసనాలు వేస్తుంటా. త్రిపద అధో ముఖ స్వనాసనం, వృక్షాసనం, నటరాజాసనం, ఉథిత హస్త పదంగుష్టాసనం, వీరభద్రాసనం.. వంటి యోగాసనాలు నా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా, బ్యాలన్స్‌డ్‌గా ఉంచుతున్నాయి. ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతున్నాయి. యోగాతో పాటు 150 సూర్యనమస్కారాలూ రోజూ సాధన చేస్తాను. చాలామంది యోగాసనాలు ఇంట్లో చేయడానికి ఇష్టపడతారు. కానీ నాకు మాత్రం డాబాపై యోగా చేయడమంటేనే ఇష్టం. ఇలా విశాలమైన ప్రదేశంలో, పరిశుభ్రమైన గాలిలో చేసే యోగాసనాలు మరింత మెరుగైన ఫలితాలనిస్తాయనేది నా భావన!


వారానికి మూడు రోజులు.. - కాజల్‌ అగర్వాల్

నాకు చిన్నప్పట్నుంచి ఆటలంటే ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలోనే వ్యాయామాలకూ దూరంగా ఉండేదాన్ని. కానీ కాలేజీ రోజుల్లో ఫిట్‌నెస్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాక.. ఈ అయిష్టత క్రమంగా దూరమైంది. ఆపై ఫిట్‌నెస్‌ రొటీన్‌ను నా రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం మొదలుపెట్టా. ఏరోబిక్స్‌తో మొదలుపెట్టి.. జిమ్‌లో పలు వ్యాయామాలు నేర్చుకున్నా.. ఆపై యోగ సాధన ప్రారంభించా. నేనో పెద్ద ఫుడీని. కొన్నిసార్లు ఆహారం విషయంలో కన్విన్స్‌ కాకపోయినా.. ఇలా శరీరంలోకి  అదనంగా చేరిన క్యాలరీల్ని యోగా సులభంగా కరిగిస్తుందనేది నా నమ్మకం! వారానికి మూడు రోజులు.. మొత్తంగా రెండున్నర గంటల పాటు యోగ సాధన చేస్తున్నా. గర్భిణిగా ఉన్నప్పుడు తొలి త్రైమాసికంలో, నీల్‌ పుట్టాకా పలు యోగాసనాలు సాధన చేశాను. అలాగే రోజుకు 150 సూర్య నమస్కారాలు చేస్తాను.


ఆరు కిలోలు తగ్గా! - రాశీ ఖన్నా

టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచే యోగాతో నా ప్రయాణం మొదలైంది. 16 ఏళ్ల ప్రాయంలో ప్రారంభించిన యోగ సాధనను నేటికీ కొనసాగిస్తున్నా. యోగాలో అన్నింటికంటే ముఖ్యంగా సూర్యనమస్కారాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆసనాలు కండరాల్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో దోహదం చేస్తాయి. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను సొంతం చేస్తాయి. ఒక్కోసారి షూటింగ్స్‌ కోసం రోజుకు 12-13 గంటలు సెట్స్‌లోనే గడపాల్సి వస్తుంది. అయినా అలసిపోనంటే యోగా చేయడం వల్లే! గతంలో నేను ఆరు కిలోలు తగ్గడంలోనూ యోగాదే కీలక పాత్ర!


అమ్మే స్ఫూర్తి! - అదా శర్మ

మా అమ్మ శీల యోగా శిక్షకురాలు. చిన్నతనం నుంచి ఆమెకు యోగా చేయడం అలవాటు. ఈ అలవాటే నాకూ నేర్పింది. అమ్మను చూశాక నాకూ యోగాపై ఇష్టం పెరిగింది. అయితే మొదటిసారి చేసినప్పుడు కొన్ని ఆసనాలు కష్టంగా అనిపించేవి. వాటినీ సులభంగా ఎలా వేయాలో అమ్మే నాకు నేర్పింది. సూర్యనమస్కారాలంటే నాకు చాలా ఇష్టం. అలాగే ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలూ సాధన చేస్తాను. ఇవన్నీ ఏకాగ్రతను పెంచడంలో, స్వయంగా నిర్ణయాలు తీసుకొనే నేర్పును సొంతం చేయడంలో దోహదం చేస్తున్నాయి.


నా బ్యూటీ సీక్రెట్‌ అదే! - సంజనా గల్రానీ

నా అందానికి, ఫిట్‌నెస్కు యోగానే కారణమన్నది నా అభిప్రాయం. ఇదే కాదు.. యోగాతో సానుకూల దృక్పథం, సమస్యల్ని ఎదుర్కొనే తత్వం నాకు అలవడ్డాయి. ఏకాగ్రత పెరిగింది. ఇలా నేను నేర్చుకున్న యోగా మెలకువల్ని మరింతమందికి పంచాలనిపించింది. ఈ ఆలోచనతోనే బెంగళూరులో ఓ యోగా అకాడమీని ప్రారంభించా. ఆపై అక్కడే బ్రాంచీలు తెరిచి.. ఎంతోమందికి యోగా, ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తున్నా. కొంతమందికి ఉచితంగానే యోగా తరగతులు నిర్వహిస్తున్నా.

ఇక వీరితో పాటు సమంత, జాన్వీ కపూర్‌.. తదితర అందాల తారలకు సైతం యోగ సాధన వారి జీవన శైలిలో ఓ భాగం. అందుకే తమ అందానికి, ఆరోగ్యానికి యోగానే కారణమంటారు వీరు. మీరూ ఈ జాబితాలో చేరాలంటే ఇప్పటికైనా యోగా మొదలుపెట్టేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్