ఇలాంటి ప్రేమలూ ఉంటాయి.. జాగ్రత్త!

ప్రేమ, డేటింగ్‌.. పేరేదైనా నచ్చిన వ్యక్తి గురించి మరింత లోతుగా తెలుసుకోవడమే ఇందులోని అంతరార్థం. ఈ క్రమంలో భాగస్వామి వ్యక్తిత్వం నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే అక్కడితో ఆ బంధానికి స్వస్తి పలకడం మామూలే! అయితే డేట్‌ చేసే భాగస్వామి ప్రవర్తన ద్వారా వారు వంద శాతం పర్‌ఫెక్ట్‌ అని ఫిక్సయిపోవచ్చా అంటే.. కాదనే అంటున్నారు నిపుణులు.

Published : 31 May 2024 12:38 IST

ప్రేమ, డేటింగ్‌.. పేరేదైనా నచ్చిన వ్యక్తి గురించి మరింత లోతుగా తెలుసుకోవడమే ఇందులోని అంతరార్థం. ఈ క్రమంలో భాగస్వామి వ్యక్తిత్వం నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే అక్కడితో ఆ బంధానికి స్వస్తి పలకడం మామూలే! అయితే డేట్‌ చేసే భాగస్వామి ప్రవర్తన ద్వారా వారు వంద శాతం పర్‌ఫెక్ట్‌ అని ఫిక్సయిపోవచ్చా అంటే.. కాదనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది బయటికి ప్రేమగానే కనిపించినా.. అంతర్గతంగా మోసపూరితమైన ప్రేమను ప్రదర్శించే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఇలాంటి అనుబంధాలకు మధ్యలోనే తెరపడుతుంది. తద్వారా నిజంగానే మనసిచ్చిన వారు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఇలాంటి విషపూరిత డేటింగ్‌ పద్ధతుల్ని ముందే పసిగట్టి మసలుకుంటే.. భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం రాదు. మరి, అలాంటి కొన్ని ప్రమాదకర డేటింగ్‌ ట్రెండ్స్‌ గురించి తెలుసుకుందాం..!

పగటి కలలు కంటున్నారా?

జీవితంలాగే ప్రేమ ప్రయాణం సుదీర్ఘమైనది. ఈ క్రమంలో అనుభవాలతో, అనుభూతులతో జంటలు తమ అనుబంధాన్ని దృఢం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది.. ఇలా నచ్చిన భాగస్వామి తమ జీవితంలోకి రాగానే.. అలా భవిష్యత్తు గురించి కలలు కనడం మొదలుపెడుతుంటారు. ప్రేమ, ప్రపోజల్‌, పెళ్లి, పిల్లలు.. అంటూ ఆ క్షణమే తమ భవిష్యత్తును ఊహించేసుకుంటారు. ఇలా తమ ఊహల్ని భాగస్వామితో పంచుకునే వారూ మరికొందరుంటారు. అయితే ఇందులో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగచ్చు.. జరక్కపోవచ్చు. అలాగని ప్రణాళిక ప్రకారం ప్లాన్‌ చేసుకుంటే ఒక దాని తర్వాత మరో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ ఎలాంటి ప్లానింగ్‌ లేకుండా ఊహల్లోనే జీవించే ప్రేమలు మధ్యలోనే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. దీన్నే ‘డెల్యూజన్‌షిప్‌ డేటింగ్‌’గా పిలుస్తున్నారు. కాబట్టి భాగస్వామి ఇలా పరిచయం కాగానే, అలా పగటి కలలు కనడం మొదలుపెడితే మాత్రం వారిని అనుమానించడంలో తప్పు లేదంటున్నారు.

రెండోసారీ మాట కలిపితే..!

విడిపోయిన భాగస్వామితోనే రెండోసారి ప్రేమలో పడుతుంటారు కొందరు. అది కూడా మనస్ఫూర్తిగా కాదు.. మరోసారి మోసం చేయడానికే ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంటారు. తొలిసారి చేసిన పొరపాట్లకు క్షమాపణ కోరుతూ, కొత్త వాగ్దానాలతో భాగస్వామి జీవితంలోకి వస్తుంటారు.. కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నమ్మిస్తుంటారు. ఇదిగో ఈ తరహా మోసపూరిత ప్రేమనే ‘ఈవిల్‌ డెడ్‌ రైజ్‌’ డేటింగ్‌ ట్రెండ్‌గా పిలుస్తున్నారు నిపుణులు. అక్కడితో ఆగిపోకుండా.. గత జ్ఞాపకాల్ని తిరగదోడుతూ.. భాగస్వామిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి వారి వలలో పడకుండా అమ్మాయిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వారు చెప్పే మాటలకు పడిపోకుండా.. వారిని పూర్తిగా దూరం పెట్టకుండా.. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు. ఈ ఓపికే ఏదో ఒక సందర్భంలో వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. తద్వారా మోసపోకుండా జాగ్రత్తపడచ్చు.

మనిషిని బట్టి మారిపోతారట!

నిజమైన ప్రేమంటే భాగస్వామిలో మార్పు కోరుకోవడం కాదు.. వారిని వారిలా స్వీకరించడం. ఇదే విధంగా అవతలి వారూ మిమ్మల్ని మీరుగా స్వీకరించడానికే ఇష్టపడడం. ఇలాంటి ప్రేమలు చాలావరకు సక్సెసవుతాయి. అయితే కొంతమంది భాగస్వామిని బట్టి తమ ఇష్టాయిష్టాలు, ఆసక్తులు, ప్రవర్తనను మార్చుకుంటుంటారు. ఇది కేవలం భాగస్వామిని ఇంప్రెస్‌ చేయడానికే! ఒకవేళ అవతలి వారు ఇంప్రెస్‌ కాకపోయినా, ఈ అతి ప్రవర్తన వారికి నచ్చకపోయినా.. అనుబంధానికి అక్కడితో స్వస్తి పలికి వేరే భాగస్వామిని వెతుక్కుంటుంటారు. ఇలాంటి అవసరాల ప్రేమనే అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లితనంగా పిలుస్తారు. కాబట్టి ఇలాంటి అతి ప్రవర్తన ప్రదర్శించే భాగస్వామితో జాగ్రత్తగా మసలుకోవడం, వారిని పూర్తిగా నమ్మకుండా దూరం పెడుతూ వారి ప్రవర్తనను గమనిస్తుండడం వల్ల మోసపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

సడన్‌గా దూరమైతే..!

ప్రేమలో పడడం సులువే కావచ్చు.. కానీ బ్రేకప్‌ అయితే తట్టుకోలేం. వారి జ్ఞాపకాలు, వారితో గడిపిన క్షణాలు అంత సులభంగా మర్చిపోలేం. కానీ కొందరు అవతలి వారితో ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే సడన్‌గా విడిపోతారట! ఈ తరహా డేటింగ్‌నే ‘ఘోస్టింగ్‌’ అంటున్నారు నిపుణులు. భాగస్వామితో అప్పటివరకు ప్రేమగా మాట్లాడినా.. సడన్‌గా మనసు మార్చుకోవడం, వారితో కాల్స్‌-సందేశాలు ఆపేయడం, కనీసం ఎందుకు విడిపోవాలనుకున్నారో కూడా చెప్పకుండా తెగతెంపులు చేసుకుంటారట! ఇలాంటి సందర్భాల్లో వారిని వదులుకోలేక, అవతలి వారు ఇలా ఎందుకు చేశారో అర్థం కాక.. బుర్ర బద్దలవుతుంటుంది. అందుకే ప్రేమలో ఉన్న జంటలు భాగస్వామిని మరీ అంతలా నమ్మకుండా.. వారిపై ఎక్కువగా ఆధారపడకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఇలా సడన్‌గా విడిపోవాల్సి వచ్చినా.. అవతలి వారి గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఉండదు.

డబ్బు చూసి ప్రేమిస్తే..!

నిజమైన ప్రేమ ఆస్తులు, అంతస్తులు కోరుకోదంటారు. కానీ కొంతమంది ఏరికోరి డబ్బు, పలుకుబడి ఉన్న వారినే ఎంచుకుంటుంటారు. ఏవేవో మాయ మాటలు, అబద్ధాలు చెప్పి వారిని నమ్మిస్తుంటారు. ఇదంతా తమ స్టేటస్‌ని పెంచుకోవడానికే! ఈ తరహా ప్రేమనే ‘త్రోనింగ్‌’ అంటారు. కొంతమంది విషయంలో ఇది వివాహేతర సంబంధాలకు కూడా కారణమవుతుంది. ఇలాంటి ప్రేమలు, సంబంధాలు మధ్యలోనే అంతమవుతాయి. అనుకున్నట్లుగానే తమకు డబ్బు, పలుకుబడి రాగానే.. వాళ్లను మోసం చేసి, మరొకరి వెంటపడతారు. ఇలాంటి వారి విషయంలోనూ జాగ్రత్తపడడం, అవతలి వారి ప్రవర్తన నమ్మశక్యంగా లేకపోతే వారిని దూరం పెట్టడం వల్ల వారి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

పబ్లిసిటీ పిచ్చోళ్లు!

ప్రేమికులైనా, దంపతులైనా.. కొన్ని విషయాలు వారిద్దరి మధ్య ఉంటేనే అందం. అయితే అందరూ అలాంటి ప్రైవసీ మెయింటెయిన్ చేయరు. కొందరు తమ ప్రేమ, భాగస్వామికి సంబంధించిన కొన్ని విషయాలను సన్నిహితులతో మాత్రమే పంచుకుంటే.. మరికొందరు తమ ప్రేమబంధాన్ని పూర్తిగా బయటపెడుతుంటారు. ఇక ఈ రోజుల్లోనైతే సామాజిక మాధ్యమాలు ఇందుకు వేదికగా మారాయి. జంటగా దిగిన ఫొటోలు, వీడియోలు, ఒకరికొకరు ప్రశంసించుకున్న/కానుకలిచ్చుకున్న సందర్భాలు.. ఇలా ప్రతిదీ అందులో పోస్ట్‌ చేస్తుంటారు. అక్కడితో ఆగకుండా.. భాగస్వామితో గొడవైనా, విడిపోయినా.. ఏ ఒక్కటీ దాచుకోకుండా బహిర్గతం చేస్తుంటారు. ఇలాంటి బంధాలూ ఎక్కువ కాలం కొనసాగవంటున్నారు నిపుణులు. ఒక సంబంధంలో ఈ రకమైన ధోరణిని ప్రదర్శించే వారిని ‘ఇన్‌స్టా గేటర్స్‌’గా పిలుస్తున్నారు నిపుణులు. అందుకే ఈ తరహా ప్రవర్తన ఉన్న భాగస్వామిని ఆదిలోనే పసిగట్టి దూరం పెట్టడం వల్ల.. నలుగురిలో నవ్వులపాలు కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్