Travel Decor Tips: ఇంట్లోనే విహరించేద్దాం!

ట్రావెలింగ్‌ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి?! అలాగని నచ్చిన ప్రదేశానికల్లా వెళ్లలేకపోవచ్చు.. ప్రతిసారీ ఇలాగే అనుకొని మనసుకూ సర్దిచెప్పుకోలేం..

Published : 01 Aug 2022 19:12 IST

ట్రావెలింగ్‌ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి?! అలాగని నచ్చిన ప్రదేశానికల్లా వెళ్లలేకపోవచ్చు.. ప్రతిసారీ ఇలాగే అనుకొని మనసుకూ సర్దిచెప్పుకోలేం.. అయితే ఈసారి ఈ విషయంలో రాజీపడక్కర్లేదంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు. మీరు మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లకపోయినా.. ఇంటి అలంకరణ వస్తువుల రూపంలో ఆ ప్రాంతాలనే ఇంటికి తెచ్చేసుకొని విహారయాత్ర అనుభూతిని పొందచ్చంటున్నారు. మరి, అదెలా సాధ్యమో తెలుసుకుందాం రండి..

హోటల్‌ గదిని తలపించేలా..!

ఎక్కడికి విహారానికి వెళ్లినా ముందు అడుగు పెట్టేది హోటల్‌లోనే! అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆతిథ్యం, అన్నింటికంటే ముందుగా హోటల్‌ గదిలోని ఇంటీరియర్స్‌.. మనల్ని చూపు తిప్పుకోనివ్వవు. ‘మన ఇల్లు కూడా ఇంత ఆకర్షణీయంగా ఉంటే ఎంత బావుంటుందో!’ అనుకునే వారూ లేకపోలేదు. అయితే ఇంట్లో చిన్న పాటి మార్పులతో ఇది సాధ్యమే అంటున్నారు నిపుణులు. స్లాట్‌ వాల్స్‌ (చెక్కతో గోడల్ని అలంకరించడం), మెటాలిక్‌ డెకరేటివ్‌ పీసెస్‌, సోఫా-మంచంపై వెల్వెట్‌ బెడ్‌షీట్స్‌, కుషన్‌ కవర్స్‌తో వన్నెలద్దడం.. మంచం పైభాగంలో వింటేజ్‌ షాండ్లియర్‌ వేలాడదీయడం.. ఇలా మీరు చూసిన వస్తువుల్లో నచ్చిన వాటికి ఇంట్లో చోటిచ్చేయచ్చు. తద్వారా మీ గది అందంగా కనిపించడమే కాదు.. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో గడిపిన అనుభూతినీ సొంతం చేసుకోవచ్చు.

బీచ్‌ థీమ్‌!

కాలంతో సంబంధం లేకుండా సమయం దొరికితే ఎక్కువమంది బీచ్‌లకు వెళ్లడానికే ఇష్టపడతారు. అంతటి ఆహ్లాదకర వాతావరణం అక్కడ మనకు దొరుకుతుంది. అదే మీ ఇంటి ఆవరణలోనే ఓ మినీ బీచ్‌ని ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అక్కడికెళ్లి సేదదీరచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీ గార్డెన్‌లో లేదంటే డాబాపై ఓ మినీ పూల్‌ని ఏర్పాటుచేసుకోండి. ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో దొరుకుతున్నాయి. అందులో నీళ్లు నింపుకొని.. వాటి ముందే మీ ఇంట్లో ఉండే ఉడెన్‌ లాంజ్‌ ఛెయిర్స్‌ లేదంటే ఫోల్డబుల్‌ ఛెయిర్స్‌ని వేసుకోండి.. ఆపై చుట్టుపక్కల సముద్రం, బీచ్‌తో కూడిన ఫొటోల్ని ఏర్పాటు చేసుకుంటే మరింత వాస్తవికత వస్తుంది.

గోడకు వన్నెలు..!

ఇంటి అలంకరణలో గోడలది ప్రత్యేక పాత్ర. మనం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోల దగ్గర్నుంచి.. విభిన్న వాల్‌పేపర్స్‌/వాల్‌స్టిక్కర్స్‌ దాకా.. ప్రతిదీ గోడలపై అలంకరించుకోవచ్చు.. అంతేకాదు.. కొన్ని అలంకరణ వస్తువుల్నీ గోడలకు వేలాడదీయచ్చు. ఇదే తరహాలో విహార యాత్రలకు సంబంధించిన వస్తువుల్ని గోడలపై అమర్చుకొని.. ట్రావెలింగ్‌ అనుభూతినీ పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గోడంతా కవరయ్యేలా ప్రపంచ పటం షీట్‌ని అతికించచ్చు.. లేదంటే ప్రపంచ పటం లాంటి గడియారాన్ని అమర్చుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన పర్యటక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోల్ని (ఉదాహరణకు.. ఈఫిల్‌ టవర్‌, తాజ్‌మహల్‌) తోరణంలా కట్టి గోడకు వేలాడదీయచ్చు. ఆయా ప్రదేశాలను బట్టి కొండలు-కోనలు-సముద్రంతో కూడిన అందమైన వాల్‌పేపర్‌ని అతికించడం, అక్కడి వింటేజ్‌ కార్ల నమూనాల్ని తయారుచేయించుకొని గోడలపై అలంకరించుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్లే ఉన్నాయి. ఇలా బయటి నుంచి వద్దనుకుంటే.. మీరే మీ అభిరుచికి తగ్గట్లుగా.. ఓ మంచి డిజైనర్‌ సహాయంతో ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాల్ని వేయించుకోవచ్చు.

సంస్కృతికి అద్దం పట్టేలా..!

మీకు నచ్చే పర్యటక ప్రదేశాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తగినట్లుగా కూడా ఇంటి ఫర్నిచర్‌లో మార్పులు-చేర్పులు చేసుకోవచ్చు. రొమాంటిక్‌ వాతావరణాన్ని తలపించేలా ఫ్రెంచ్‌ స్టైల్‌లో, పర్షియన్‌ స్టైల్‌లో కావాలనుకుంటే రాగి వస్తువుల్ని అమర్చుకోవడం.. ఇలా మీకు నచ్చినట్లుగా ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌, కర్టెన్లు, ఇతర డెకరేటివ్‌ పీసెస్‌లో మార్పులు చేయడం వల్ల విభిన్న అనుభూతుల్ని సొంతం చేసుకోవచ్చు.

చిన్న వస్తువులు.. గొప్ప లుక్‌!

ఇంటి అలంకరణలో భాగంగా మనం అమర్చే చిన్న చిన్న డెకరేటివ్‌ పీసెస్‌ కూడా అతిథుల మనసులు కొల్లగొడుతుంటాయి. వాటిని చూడగానే ‘ఇదెక్కడ కొన్నారు?’ అన్న ప్రశ్నే వారి నోటి నుంచి ముందుగా వినిపిస్తుంది. అలాంటి విభిన్న వస్తువుల్ని ఇంట్లో అమర్చుకొని విహార యాత్ర అనుభూతుల్ని పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో 3డీ ఎఫెక్ట్‌తో కూడిన ‘వరల్డ్‌ మ్యాప్‌ కటౌట్‌’, పెద్ద షిప్‌ బొమ్మ, మ్యాగ్నటిక్‌ గ్లోబ్‌, వింటేజ్‌ వాల్‌క్లాక్‌, ప్యారాచూట్‌ తరహా ఎయిర్‌ బెలూన్‌.. వంటివి ఇంట్లో అక్కడక్కడా అమర్చితే అందానికి అందం.. నచ్చిన ప్రదేశంలో ఉన్నామన్న ఆహ్లాదం కూడా! అలాగే పిల్లల గదిలో వాళ్లకు ఇష్టమైన ప్రదేశానికి సంబంధించిన థీమ్‌తో కూడిన డెకరేటివ్‌ పీసెస్‌ని అలంకరించడం మర్చిపోకండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని