ఈ ఉద్యోగాలతో ప్రపంచాన్ని చుట్టేయచ్చు..!
కొంతమంది కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంటారు. కానీ ఆఫీస్ వర్క్, తగినన్ని సెలవులు లభించక చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఇం కొంతమంది రోజూ డెస్క్‌లో కూర్చుని పని చేయకుండా....
(Photos: Instagram)
కొంతమంది కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంటారు. కానీ ఆఫీస్ వర్క్, తగినన్ని సెలవులు లభించక చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఇం కొంతమంది రోజూ డెస్క్‌లో కూర్చుని పని చేయకుండా వినూత్నంగా ఉండే ఉద్యోగాన్ని ఎంచుకోవాలనుకుంటారు. ఇలాంటి వారికి ట్రావెలింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు చక్కటి ఎంపిక అంటున్నారు కెరీర్ నిపుణులు. ఈ ఉద్యోగాల ద్వారా ఒకవైపు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూనే మరోవైపు ఆదాయాన్నీ సంపాదించవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో అలాంటి కొన్ని ఉద్యోగాల గురించి తెలుసుకుందామా...
అనుభవాలు పంచుకుంటూ...
ట్రావెలింగ్ చేయాలంటే ఖాళీ సమయం లభించడంతో పాటు డబ్బు కూడా కావాలి. కానీ, సామాజిక మాధ్యమాలపై పట్టుంటే ఒకవైపు వివిధ పర్యటక ప్రాంతాలకు వెళ్తూ మరోవైపు డబ్బు కూడా సంపాదించవచ్చంటున్నారు కెరీర్ నిపుణులు. వీరినే ‘ట్రావెల్ బ్లాగర్స్’గా పిలుస్తుంటారు. ట్రావెల్ బ్లాగర్స్ చేయాల్సిందేంటంటే వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్లతో పంచుకుంటూ వాటికి ఆకర్షణీయమైన క్యాప్షన్‌లను జోడించాలి. ఈ క్రమంలో ఫాలోవర్లు పెరిగే కొద్దీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అనుభవాలను బ్లాగ్ రూపంలో నెటిజన్లతో పంచుకోవడం ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తద్వారా మంచి ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు.
పర్యటక ప్రాంతాల విశిష్టతను తెలియజేస్తూ..
ప్రముఖ పర్యటక ప్రాంతాలను సందర్శించడానికి విదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. ఇలాంటి వారు ఆ ప్రాంతానికి సంబంధించిన విశిష్టతను తెలుసుకోవడానికి ‘టూర్ గైడ్’లను నియమించుకుంటారు. ట్రావెలింగ్‌పై మక్కువ ఉన్నవారికి ‘టూర్ గైడ్’ ఉద్యోగం చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఒకవైపు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ మరోవైపు డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. అయితే ‘టూర్ గైడ్’గా చేయాలంటే పలు పర్యటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, విశిష్టత, ఆహారపు అలవాట్లు వంటి విషయాలపై అవగాహన ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టుండాలి. ఒకవేళ విదేశీ భాషల్లో కూడా నైపుణ్యం ఉంటే మంచిది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు ‘టూర్ గైడ్’లను నియమించుకుంటాయి.
విమానంలో విహరిస్తూ..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాలను చూడాలనుకునే వారికి ‘ఫ్లైట్ అటెండెంట్’ ఉద్యోగం చక్కటి ఎంపిక అంటున్నారు కెరీర్ నిపుణులు. అంతేకాకుండా ‘ఫ్లైట్ అటెండెంట్’ అనేది పాపులర్ జాబ్ కూడా. ఈ ఉద్యోగంలో పని వేళల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచంలోని వివిధ నగరాలను చుట్టేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఆకర్షణీయమైన జీతాన్ని కూడా పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ ఉద్యోగం చేయాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉండడంతో పాటు ఏదైనా ఎయిర్ హోస్టెస్‌కు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ఉద్యోగ ప్రకటనలను ఎయిర్‌లైన్స్ జారీ చేస్తుంటాయి.
ఓడలో పని చేస్తూ...
విమానాల తర్వాత ప్రపంచమంతా చుట్టేసేవి క్రూయిజ్ షిప్‌లు. అందుకే ట్రావెలింగ్‌పై మక్కువ ఉన్నవారు వీటిలో పని చేయడానికి కూడా మక్కువ చూపిస్తుంటారు. క్రూయిజ్ షిప్‌లో పని చేయడం ద్వారా వివిధ దేశాలతో పాటు ఖండాలను కూడా చుట్టేయచ్చు. అలాగే ఉచిత వసతి, భోజనం వంటి సౌకర్యాలు లభించడంతో పాటు మంచి జీతాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువ రోజులు ప్రయాణం చేయడం ద్వారా వివిధ దేశాల ప్రజలను కలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. క్రూయిజ్ షిప్‌లో పలు రకాల విభాగాలు ఉంటాయి. కాబట్టి, మీ నైపుణ్యాలకు తగిన విభాగంలో ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే కొన్ని క్రూయిజ్ లైన్స్ స్వల్ప కాల వ్యవధిలో పలు కోర్సులు అందిస్తుంటాయి. వాటిని పూర్తి చేయడం ద్వారా కూడా ఉద్యోగం సంపాదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.