వర్షాకాలంలో ప్రయాణమా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రలకు ఇది అనువైన సమయం.  ఈ కాలంలో వాతావరణం పూర్తి వేడిగానూ ఉండదు.. చలిగానూ ఉండదు. అందుకే ఈ సమయంలో చాలామంది వివిధ ప్రాంతాలను చుట్టేయడానికి వెళుతుంటారు. అయితే ఇదే సమయంలో వర్షాలు ఎక్కువగా....

Published : 05 Sep 2023 12:31 IST

వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రలకు ఇది అనువైన సమయం.  ఈ కాలంలో వాతావరణం పూర్తి వేడిగానూ ఉండదు.. చలిగానూ ఉండదు. అందుకే ఈ సమయంలో చాలామంది వివిధ ప్రాంతాలను చుట్టేయడానికి వెళుతుంటారు. అయితే ఇదే సమయంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. కాబట్టి, ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే వర్షాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో అవేంటో తెలుసుకుందామా...

వర్షం ఎప్పుడు వస్తుందో...?

మీరు ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో ముందుగా అక్కడి వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మన దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంటుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి, మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితి గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది.

దుస్తుల విషయంలో...

వర్షాకాలంలో తేమ వాతావరణం ఉంటుంది. కాబట్టి, దుస్తుల ఎంపిక విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు తొందరగా ఆరిపోయే దుస్తులను ఎంపిక చేసుకోవాలి. గొడుగు, రెయిన్‌కోట్‌, వాటర్‌ ప్రూఫ్‌ జాకెట్.. వంటి వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీనివల్ల ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బంది ఎదురుకాకుండా ఉంటుంది. అలాగే చెప్పులు లేదా షూలు కూడా వాటర్‌ ప్రూఫ్ రకాలను ఎంపిక చేసుకుంటే మరీ మంచిది.

వస్తువులు తడవకుండా...

ఈ కాలంలో వాతావరణ వివరాల గురించి ఎంత ముందుగానే తెలుసుకున్నా కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అప్పటికప్పుడు వర్షం వస్తుంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బ్యాగులు తడవకుండా ఉండేందుకు వాటర్‌ప్రూఫ్ కవర్లు తీసుకెళ్లడం మంచిది.

ఆ వ్యాధులు రాకుండా...

వర్షాకాలంలో శరీరం డీహైడ్రేట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అయితే ఈ కాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడూ వెంట ఒక వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

ఈ కిట్‌ ఉండాల్సిందే..!

ప్రయాణాల విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కొన్ని సందర్భాల్లో మధ్యలోనే  ఆగిపోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వస్తువులను వెంట తీసుకెళ్లడం మంచిది. ఇందులో భాగంగా ఫోన్ ఛార్జర్‌, పవర్‌ బ్యాంక్‌ వంటివి వెంట తీసుకెళ్లాలి. అలాగే జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి.. వంటి సమస్యలకు సంబంధించి కొన్ని రకాల మాత్రలను వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే ఇతరత్రా మీరు వాడే మందులు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్లడం మర్చిపోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని