Published : 25/06/2022 18:47 IST

దోమల బెడదను తగ్గించే చిట్కాలివే!

ఈ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రిపెల్లెంట్‌, మస్కిటో మ్యాట్‌.. వంటివి ఉపయోగిస్తుంటాం. నిజానికి ఇవి దోమల్ని చంపడమేమో గానీ, మన ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మరి, వాటి అవసరం లేకుండా సహజసిద్ధంగా దోమల బెడదను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..!

వాటికి బదులు ఇవి!

* నిత్యం మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు.. కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే.. ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు నిపుణులు. ఒకవేళ వేప ఆకులు లేనట్త్లెతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుంది.

* ఆవాల పొడి, వేప ఆకుల పొడి, సముద్రపు ఉప్పు.. ఈ మూడూ సమాన మోతాదులో తీసుకోవాలి. తర్వాత నాలుగు బొగ్గులను వేడి చేసుకొని ఒక మట్టిపాత్రలో వేసుకోవాలి. ఇంటి డోర్లన్నీ మూసి పొడిని కొంచెం కొంచెంగా బొగ్గులపై చల్లుకుంటూ వచ్చే పొగను ఇల్లంతా విస్తరించనివ్వాలి. ఇది కూడా దోమల్ని తరిమికొడుతుంది.

* బొగ్గులు అందుబాటులో లేని వారు అరోమాల్యాంప్స్‌లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, తేయాకు నూనె, లావెండర్ నూనె.. వీటిలో ఏదైనా ఒక్కటి వేసి పెట్టుకుంటే సువాసనకి సువాసనతో పాటు దోమల బెడద కూడా ఉండదు.

* నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకొని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట!

* వేప నూనెకి అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకొని పడుకుంటే ఎనిమిది గంటల వరకూ దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చట!

* మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్‌ని ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేసినా దోమ కాటు నుంచి కాపాడుకోవచ్చు.

* ఇంట్లో, ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఉంటే.. ఆ నీటిపై, దోమలున్న ప్రాంతంలో తులసి రసాన్ని చల్లితే ప్రయోజనం ఉంటుంది.

ఈ మొక్కలను తప్పక పెంచండి !

ఇంటి చుట్టూ తులసి, వేప, యూకలిప్టస్.. వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుంది. ఒక కుండీలో కలబంద మొక్క పెంచుకుంటే దోమ కాటుకి ఔషధంలా పని చేస్తుంది. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులు లేదంటే వేప ఆకుల పేస్ట్‌ని రాసినా ఆ ప్రాంతంలో దద్దుర్లు, దురద.. వంటివి లేకుండా జాగ్రత్తపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని