Published : 30/03/2023 12:57 IST

నవమికి కొత్త రుచుల నైవేద్యాలు!

ఈ శ్రీరామనవమికి వడపప్పు, పానకంతో పాటు సరికొత్త పాయసాలు, పిండివంటలూ చేయాలనుకుంటున్నారా..? అయితే మన తెలుగు రాష్ట్రాల వంటలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక స్పెషల్ రుచులనూ తెలుసుకుందాం. నైవేద్యంతో శ్రీరాముడినీ, ఆ తర్వాత భోజనంతో ఆత్మారాముణ్ణీ సంతృప్తిపరచాలంటే చదవండి మరి..!

మఖనేకీ ఖీర్

కావల్సినవి

⚛ మఖనా (తామర విత్తనాలు)- ఒక కప్పు

⚛ నెయ్యి - రెండు టీస్పూన్లు

⚛ పాలు - నాలుగున్నర కప్పులు

⚛ చక్కెర - అర కప్పు

⚛ జాజికాయ పొడి - పావు టీస్పూను

⚛ సన్నగా కట్‌చేసిన డ్రైఫ్రూట్స్ - గార్నిష్‌కి

తయారీ

⚛ ఒక బాణలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి మఖనాలను దోరగా కరకరలాడేలా వేయించాలి.

⚛ వేగిన మఖనాలను బరకగా మిక్సీ పట్టుకోవాలి.

⚛ బాణలిలో పాలు పోసి మరుగుతుండగా చక్కెర వేసి కరిగేవరకూ కలపాలి. జాజికాయ పొడి, పొడి చేసుకున్న మఖనాలను ఇందులో వేసి కలుపుతూ నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి.

⚛ నాలుగు నిమిషాల తర్వాత స్టౌ మీద నుంచి దించి, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే మరాఠీ స్పెషల్ మఖనేకీ ఖీర్ రడీ..!


తర్బూజా పుడ్డింగ్

కావల్సినవి

⚛ పాలు- నాలుగు కప్పులు

⚛ సన్నగా తరిగిన తర్బూజా ముక్కలు - ఒక కప్పు

⚛ కోవా - రెండు కప్పులు

⚛ చక్కెర పొడి -ఒక కప్పు

⚛ తురిమిన కొబ్బరి - పావు కప్పు

⚛ యాలకుల పొడి - అర టీస్పూను

⚛ నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు

⚛ జీడిపప్పు- రుచికి తగినన్ని

⚛ ఎండుద్రాక్ష - రుచికి తగినన్ని

తయారీ

⚛ బాణలిలో నెయ్యి వేసి జీడి పప్పు, ద్రాక్ష దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు అందులోనే తర్బూజా ముక్కలు మెత్తబడే వరకు మగ్గనిచ్చి తీయాలి.

⚛ తర్బూజా ముక్కలు తీసిన తర్వాత పాలు పోసి మరగనివ్వాలి.

⚛ పాలు మరుగుతున్నప్పుడు చక్కెర పొడి, కోవా వేసి కలపాలి. పాలు పూర్తిగా ఇగిరిపోయి కోవా దగ్గరపడ్డ తర్వాత, మగ్గిన తర్బూజా ముక్కలు, యాలకుల పొడి వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచి స్టౌ ఆపాలి.

⚛ చివరగా వేయించిన జీడిపప్పు, ద్రాక్షతో గార్నిష్ చేస్తే తర్బూజా పుడ్డింగ్ రడీ.!


హుళి అవళక్కి

కావల్సినవి

⚛ లావు అటుకులు- ఒకటిన్నర కప్పు

⚛ చింతపండు గుజ్జు- మూడు టేబుల్‌స్పూన్లు

⚛ బెల్లం - ఒక టేబుల్ స్పూను

⚛ ఆవపిండి - ఒక టేబుల్ స్పూను

⚛ పల్లీపొడి - ఒక టేబుల్ స్పూను

⚛ ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను

⚛ కారం- రెండు టీస్పూన్లు

⚛ పచ్చి మిర్చి- రెండు

⚛ పసుపు - ఒక టీస్పూను

⚛ ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

⚛ నూనె

⚛ ఆవాలు

⚛ శెనగ పప్పు

⚛ మినప పప్పు

⚛ ఎండు మిర్చి

⚛ కరివేపాకు

⚛ తురిమిన పచ్చి కొబ్బరి - అర కప్పు

⚛ కొత్తిమీర - గార్నిష్‌కి సరిపడా

తయారీ

⚛ బాణలిలో చింతపండు గుజ్జు, బెల్లం, ఆవపిండి, పల్లీ పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఓ కప్పు నీరు కలిపి ఉంచాలి.

⚛ లావు అటుకులను బరకగా మిక్సీ పట్టుకోవాలి.

⚛ ఈ అటుకుల పొడిని చింతపండు గుజ్జు మిశ్రమంలో కలపాలి.

⚛ పదినిమిషాల తర్వాత చింతపండు మిశ్రమాన్ని అటుకుల పొడి పూర్తిగా పీల్చుకున్న తర్వాత ఉండలు లేకుండా కలపాలి.

⚛ బాణలిలో నూనె వేడి చేసుకుని ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు,ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇందులో పచ్చి మిర్చి తురుము వేసి కాసేపు వేయించాలి. దీనికి అటుకుల మిశ్రమాన్ని కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలపాటు సన్నని మంటపై ఉంచాలి.

⚛ చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే.. కర్ణాటక స్పెషల్ హుళి అవళక్కి రడీ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని