వేసవిలో డీహైడ్రేషన్‌కి ఇలా చెక్ పెట్టండి..!
ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వంటి సమస్యలు తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం....
ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వంటి సమస్యలు తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం. కానీ ఆ మంచినీటినే మరింత శక్తిమంతంగా తయారుచేసుకుంటే డీహైడ్రేషన్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మరి అదెలా అంటారా..? ఇదిగో ఇలా..
కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు నీటిలో వేయడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజాలు నీటిని మరింత శక్తిమంతంగా తయారుచేస్తాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా శరీరంలోని మలినాలనూ తొలగిస్తాయి.
⚛ సన్నగా గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొన్ని పుదీనా లేదా తులసి ఆకులు నీటిలో వేయాలి. మంచినీటికి బదులుగా వీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ దరిచేరదు. అంతేకాదు.. నిమ్మకాయలోని ఎలక్ట్రొలైట్లు శరీరానికి శక్తినిచ్చి రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి.
⚛ గుప్పెడు వట్టి వేరును శుభ్రంచేసి, ఒక నెట్‌క్లాత్‌లో వదులుగా కట్టి మంచినీటిలో వేయాలి. లేదా నేరుగా నీటిలో వేసి, వట్టి వేరు నీటి అడుగుకు చేరగానే పైన తేరిన నీటిని మంచినీళ్ల బదులుగా తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇది మంచి స్ట్రెస్ బస్టర్‌గానూ ఉపయోగపడుతుంది.
⚛ లీటరు నీటికి అర కప్పు చొప్పున పుచ్చకాయ ముక్కలు వేయాలి. వీలుంటే ఇందులో నాలుగు కీరా ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు చేర్చాలి. మండే ఎండల్లో సైతం ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.
⚛ ముక్కలుగా చేసిన స్ట్రాబెర్రీ, గుండ్రంగా తరిగిన నారింజ నీళ్లలో వేసి మంచినీటికి బదులుగా తాగితే డీహైడ్రేషన్ తగ్గడమే కాకుండా శరీరానికి పుష్కలంగా సి విటమిన్ లభిస్తుంది. రక్తంలోని మలినాలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా తయారవు తుంది.
⚛ గులాబీ రేకులను నీటిలో వేసి మంచి నీళ్లకు బదులుగా వీటిని తాగితే శరీరంలోని అధిక వేడిమి అదుపులోకి వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇలా రోజుకో కొత్త పద్ధతిలో రుచికరంగా నీటిని తయారుచేసుకుని ఈ వేసవిని చల్లగా గడిపేయండి మరి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.