Updated : 24/12/2021 20:08 IST

Winter care: ఇంట్లోనే స్పా చికిత్సలు!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

చాక్లెట్ మసాజ్..

చర్మం ప్రకాశవంతంగా మెరవాలన్నా, నిర్జీవమైపోయిన చర్మాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలన్నా అది శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడం వల్లనే సాధ్యమవుతుంది. అందుకు చాక్లెట్ మసాజ్ చక్కగా తోడ్పడుతుంది. స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా చేసే ఈ మసాజ్‌లో డార్క్ చాక్లెట్‌తో పాటు ఏదో ఒక అత్యవసర నూనెని కూడా కలుపుతారు. ఈ మిశ్రమంతో శరీరమంతా మర్దన చేయడం ద్వారా శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాదు.. చాక్లెట్‌లోని కొకోవా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల చేస్తుంది. అవి చర్మం కింద దాగున్న కొవ్వుల్ని కరిగించడంలో సహకరిస్తాయి. పొడిబారిపోయి నిర్జీవమైన శరీరాన్ని తిరిగి పునరుత్తేజితం చేయడానికి, కండరాల నొప్పుల్ని తగ్గించడానికి కూడా ఈ మసాజ్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా మసాజ్ చేసే క్రమంలో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది.

మలినాల్ని తొలగించడానికి..

వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మపు రంధ్రాల్లో చేరిపోయి మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతుంటాయి. మనం ఎంతగా రుద్ది ముఖం కడుక్కున్నా వాటి అవశేషాలు ఇంకా ఆ రంధ్రాల్లోనే ఉండిపోతాయి. మరి, వాటిని తొలగించాలంటే అందుకు అత్యవసర నూనెలతో మసాజ్ చేయించుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల చర్మపు రంధ్రాల్లో ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి అవశేషాలు మెత్తబడి త్వరగా వదిలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఈ ట్రీట్‌మెంట్ వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా మటుమాయమవుతాయి. మర్దన చేసే క్రమంలో శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది. మనసుకూ హాయిగా ఉంటుంది.

స్క్రబ్ చేసేయండిలా..!

చలి వల్ల గరుకుగా మారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకునేందుకు చాలామంది ఆశ్రయించే పద్ధతి స్క్రబ్బింగ్. చలికాలపు స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా దాల్చినచెక్క, తేనె.. ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని చర్మాన్ని స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల శరీరానికి పోషణ అందడంతో పాటు చర్మంపై మృతకణాలు కూడా తొలగిపోతాయి. అలాగే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పుట్టించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఈ స్క్రబ్బింగ్ పద్ధతిని ఇంట్లోనూ ప్రయత్నించవచ్చు.

మెడపై సుతారంగా..

చలికాలంలో అటు వెచ్చదనాన్ని పంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చే సహజసిద్ధమైన పదార్థాలు కొన్నుంటాయి. అలాంటి వాటిలో గుమ్మడి కూడా ఒకటి. దీని గుజ్జుతో ముఖం, మెడపై సుతారంగా మసాజ్ చేయడం వల్ల పొడిబారిపోయిన చర్మం మృదువుగా మారుతుంది. ఇందులోని ఎంజైమ్స్, బీటా కెరోటిన్, మినరల్ సాల్ట్స్.. వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణం. అందుకే దీన్ని నేరుగా ఉపయోగించడంతో పాటు పలు స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా కూడా ఉపయోగిస్తుంటారు.

జుట్టుకు బటర్..

చలికాలంలో చర్మమే కాదు.. జుట్టు కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అలాగని దాన్ని నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలిపోవడం, చుండ్రు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి చలికాలం ప్రారంభంలోనే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టడం మంచిది. అందుకు ఇంట్లో లభించే బటర్ చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందుకు మనం చేయాల్సిందల్లా బటర్‌ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు షవర్ క్యాప్ పెట్టి అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే బటర్ వల్ల కుదుళ్లకు పట్టుకున్న జిడ్డుదనం వదిలిపోతుంది. ఈ హెయిర్‌మాస్క్ వల్ల కుదుళ్లకు తేమ అందడంతో పాటు ఆ భాగంలో సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తవుతాయి. తద్వారా కుదుళ్లు, జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.

చలికాలంలో అందంతో పాటు వెచ్చదనాన్ని కూడా అందించే కొన్ని స్పా ట్రీట్‌మెంట్లేంటో తెలుసుకున్నారు కదా! అయితే వీటికోసం స్పా సెంటర్ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వీలైతే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకొని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. తద్వారా చక్కటి ఫలితాల్ని పొందచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రొసీడ్ అయిపోండి. అయితే ఒక్క విషయం.. వీటిలో వాడినవి అన్నీ సహజసిద్ధమైన పదార్థాలే అయినప్పటికీ అందరి చర్మ తత్వాలకు కొన్ని సరిపోకపోవచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత వాటిని ఉపయోగించడం వల్ల సమస్య పెద్దది కాకుండా కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని