ముద్దుల సోదరుడికి నోరూరించే మిఠాయి..!

హాయ్.. నా పేరు శ్రావ్య. ఈ కాలం అమ్మాయినే అయినా నేను సంప్రదాయాలంటే ఆసక్తి చూపిస్తా. అందుకే ఈ రాఖీ పౌర్ణమికి మా అన్నయ్య కోసం ఓ ప్రత్యేకమైన రాఖీ తయారుచేయించా. మా ఇద్దరి ఫొటోతో రూపొందించిన పర్సనలైజ్‌డ్ రాఖీ అది. కేవలం ట్రెండీ టచ్ మాత్రమే కాదు.. ఇటు సంప్రదాయబద్ధంగానూ ఉండేలా ప్లాన్ చేశా.

Published : 21 Aug 2021 16:04 IST

హాయ్.. నా పేరు శ్రావ్య. ఈ కాలం అమ్మాయినే అయినా నేను సంప్రదాయాలంటే ఆసక్తి చూపిస్తా. అందుకే ఈ రాఖీ పౌర్ణమికి మా అన్నయ్య కోసం ఓ ప్రత్యేకమైన రాఖీ తయారుచేయించా. మా ఇద్దరి ఫొటోతో రూపొందించిన పర్సనలైజ్‌డ్ రాఖీ అది. కేవలం ట్రెండీ టచ్ మాత్రమే కాదు.. ఇటు సంప్రదాయబద్ధంగానూ ఉండేలా ప్లాన్ చేశా. అంతేకాదు.. ఈ రక్షాబంధన్‌కి మా అన్నయ్య నోరు తీపి చేయడానికి నేనే ప్రత్యేకంగా మిఠాయిలు తయారుచేసి తనపై నాకున్న ప్రేమను చాటాలనుకుంటున్నా. మరి, ఇంతా అంతా కాదు.. నాకున్న ప్రేమనంతా చాటాలంటే ఒక్క మిఠాయి సరిపోతుందా? అందుకే ఒకటి, రెండు కాదు.. చాలా రకాల స్వీట్లను స్వయంగా తయారుచేయాలనుకుంటున్నా. అవేంటో మీరూ తెలుసుకుందురు గానీ రండి..

దిల్ బహార్

కావాల్సినవి

పాలు - లీటర్

చక్కెర - ముప్పావు కప్పు

పాల పొడి - అర కప్పు

కోవా - అర కప్పు (చక్కెర కలపనిది)

పిస్తా - కొన్ని

ఫుడ్ కలర్ - చిటికెడు

నిమ్మరసం - పావు టీస్పూన్

తయారీ

ఒక ప్యాన్‌లో పాలను వేడిచేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ కలుపుకోవాలి. అందులో నిమ్మరసం వేసి, పాలను విరగ్గొట్టి పనీర్ తయారుచేసుకోవాలి. ఇందులో పాల పొడిని కలుపుకుంటూ బాగా పిసకాలి. తర్వాత దీన్ని హార్ట్ షేప్‌లో ఉండల్లా తయారుచేసుకోవాలి. మరోప్యాన్‌లో పావు కప్పు చక్కెర, మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. దీన్ని వడబోసి తిరిగి వేడిచేయాలి. ఇలా మరుగుతున్న నీటిలో పనీర్ హార్ట్స్ వేసి వాటి సైజు రెట్టింపయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వాటిని అందులోనే నాలుగు గంటల పాటు నాననివ్వాలి. ఈలోపు మరో ప్యాన్‌లో కోవా, చక్కర వేసి బాగా కలుపుకుంటూ వేడిచేయాలి. ఇది కాస్త దగ్గరపడగానే దింపేయాలి. పనీర్ హార్ట్స్ పూర్తిగా నానిన తర్వాత ట్రేలో ఉంచి, వాటిపై కోవా మిశ్రమాన్ని ఉంచాలి. దానిపై సన్నగా తరిగిన పిస్తా వేసి, అలంకరించుకోవాలి.

 

మలాయి ఛంఛం

కావాల్సినవి

ఛంఛం కోసం..

పాలు - ఎనిమిది కప్పులు

ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు

వెనిగర్ - అరకప్పు(ఇందులో మరో అరకప్పు నీటిని కలపాలి)

చక్కెర - నాలుగు కప్పులు

నీళ్లు - పది కప్పులు

మలాయి కోసం..

పాలు - కప్పు

క్రీమ్ -కప్పు

చక్కెర - రెండు టీస్పూన్లు

తయారీ

ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు వేడి చేయాలి. అందులో ఫుడ్ కలర్ వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో వెనిగర్‌ని కలపాలి. దీంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక సన్నని గుడ్డ సాయంతో వడకట్టాలి. ఆ తర్వాత మిగిలిన పనీర్‌ని ఓసారి కుళాయి కింద పెట్టి నీళ్లు వడబోసి, గట్టిగా పిండేయాలి. దీంతో పనీర్‌లో ఎక్కడైనా పులుపుదనం ఉంటే అది పోతుంది. ఇప్పుడు గుడ్డలో ఉన్న పనీర్‌ని ఓ నాలుగైదు గంటల పాటు వేలాడదీయాలి. ఆ తర్వాత ఈ పనీర్‌ని కాస్త మెదుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని చేతుల మధ్య ఉంచి వత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి ప్యాన్‌లో చక్కెర, నీళ్లు తీసుకొని మరిగించాలి. అది మరుగుతుండగా ఈ పనీర్ ఉండల్ని అందులో వేసి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఉడికిన తర్వాత అవి బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు వాటిని తీసి చల్లారనివ్వాలి. ఆపై ప్లేట్‌లో సర్ది కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈలోపు మలాయి తయారుచేసుకోవాలి. దీనికోసం ఒక మందపాటి గిన్నెలో పాలు, క్రీమ్, చక్కెర వేసి తక్కువ మంటపై వేడిచేయాలి. మధ్యమధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది రాన్రానూ దగ్గరపడుతుంది. పాలు మొత్తం మరిగిపోయి.. ఒక క్రీమ్‌లాంటి పదార్థం వచ్చేవరకూ దీన్ని వేడిచేయాలి. ఆపై స్టవ్ ఆపేసి, దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రిజ్ నుంచి ఛంఛంలను తీసి వాటిపై చాకు లేదా పేస్ట్రీ బ్యాగ్ సాయంతో ఈ మలాయిని నింపి మరో ఛంఛంని ఉంచాలి. చూడ్డానికి క్రీమ్ బిస్కెట్‌లా అనిపించేలా వీటిని అమర్చుకోవాలి. అంతే.. చల్లచల్లని మలాయి ఛంఛంలు రడీ..

 

సోహన్ హల్వా

కావాల్సినవి

చక్కెర - అరకేజీ

మైదా లేదా కార్న్‌ఫ్లోర్ - అరకేజీ

బాదం పప్పు - పావు కేజీ

పిస్తా - వంద గ్రాములు

యాలకులు - యాభై గ్రాములు

నెయ్యి - అరకేజీ

నీళ్లు - రెండు లీటర్లు

కుంకుమ పువ్వు - టీస్పూన్

తయారీ

ముందుగా ఒక లీటర్ నీటిని తీసుకొని బాగా మరిగించాలి. అవి మరుగుతుండగా.. అందులో చక్కెర వేసి మరో ఐదు నిమిషాలు వేడిచేయాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు పాలు పోసి మరికొద్దిసేపు మరిగించాలి. దీన్ని వడకట్టి మిగిలిన నీటిని కూడా దీనికి కలుపుకోవాలి. ఆ తర్వాత వేడినీళ్లలో ముంచిన కుంకుమపువ్వును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని కొన్ని చల్లని నీటిలో కలుపుకోవాలి. తర్వాత దీన్ని చక్కెర పాకానికి చేర్చి తక్కువ మంటపై ఉడికించాలి. ఇది గట్టిపడుతుండగానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కలపాలి. మరికాసేపాగి మరో టేబుల్‌స్పూన్ నెయ్యి కలపాలి. ఇలా పిండి ఉడుకుతూ, దగ్గరపడుతూ ఉండగా.. అది గిన్నెకు అంటుకోకుండా ఉండడానికి నెయ్యిని చేర్చుతూ, కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా ఉడికి నెయ్యి తేలుతున్నట్లు కనిపిస్తుంటే స్వీట్ పూర్తిగా ఉడికినట్లే. ఇప్పుడు దీనికి వేయించి సన్నగా తరిగిన బాదం పప్పు, పిస్తా, యాలకుల పొడి కలుపుకోవాలి. ఒక ట్రే లేదా ప్యాన్‌ని తీసుకొని దానికి దట్టంగా నెయ్యి రాసుకోవాలి. ఈ హల్వాను అందులో వేసి సమానంగా పరుచుకోవాలి. అది కాస్త చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. అంతే సోహన్ హల్వా రడీ..

 

ఖీర్ ఖాదమ్

కావాల్సినవి

మినీ రసగుల్లా - 16

కోవా - మూడు కప్పులు

పాలు - రెండు టేబుల్ స్పూన్లు

చక్కెర - నాలుగు టేబుల్ స్పూన్లు

రోజ్ ఎసెన్స్ - ఒకటిన్నర టీస్పూన్లు

తయారీ

మినీ రసగుల్లాలు తీసుకొని వాటిని కాస్త వత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల కోవా తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. అందులో చక్కెర చేర్చుకొని బాగా కలుపుకోవాలి. దీనికి కొద్దిగా పాలు కలుపుతూ పిండిలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పెద్దమంటపై రెండు, మూడు నిమిషాలు బాగా వేడిచేయాలి. దీన్ని తిరిగి చల్లార్చి రోజ్ ఎసెన్స్ కలపాలి. ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని పదహారు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెండు అరచేతుల మధ్య ఉంచి కొద్దిగా వత్తుకోవాలి. ఇప్పుడు అందులో మినీ రసగుల్లాను ఉంచి అది బయటకు కనిపించకుండా మూసేయాలి. దీన్ని తిరిగి గుండ్రని ఉండలా తయారుచేయాలి. ఆ తర్వాత మరో కప్పు కోవా తీసుకొని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ ఉండలను కోవా పొడిలో దొర్లించి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాసేపు చల్లారాక బయటకు తీసి వడ్డిస్తే సరి..

 

సొరకాయ బర్ఫీ

కావాల్సినవి

సొరకాయ తురుము - రెండు కప్పులు

కోవా - ఒకటిన్నర కప్పులు

నెయ్యి - కొద్దిగా

పాలు - రెండు కప్పులు

డ్రైఫ్రూట్స్ - అరకప్పు(అన్నీ కలిపి)

చక్కెర - అరకప్పు

యాలకుల పొడి - టీస్పూన్

తయారీ

ఒక అల్యూమినియం ట్రే తీసుకొని నెయ్యి పూయాలి. ఇప్పుడు ఒక నాన్‌స్టిక్ ప్యాన్‌లో పాలు పోసి వేడిచేయాలి. దీనికి కొద్దికొద్దిగా సొరకాయ తురుమును కలపాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత కోవా, చక్కెర, డ్రైఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. దీన్ని మధ్యమధ్యలో బాగా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత దీన్ని ఇంతకుముందు నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో వేసి సమానంగా పరచాలి. దీనిపై యాలకుల పొడి వేసి, మిగిలిన డ్రైఫ్రూట్స్ కూడా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టాలి. నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరి..

చూశారుగా.. సోదరుడిపై మీకున్న ప్రేమను చాటుకునేందుకు వీలుగా.. సులువుగా తయారు చేయగలిగే ఈ స్వీట్లు.. మీరూ వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి మరి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్