Published : 14/06/2021 18:48 IST

రుచికరమైన ఈ పోహా కట్లెట్‌తో ఆరోగ్యమూ సొంతం!

పోహా... పేరుకు ఉత్తరాది వంటకమైనా అన్ని రాష్ట్రాల ప్రజలు దీనిని ఇష్టంగా తింటారు. రుచితో పాటు తేలికగా జీర్ణం కావడం, పోషకాలు పుష్కలంగా ఉండడంతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అటుకుల వంటకాలపై ఆసక్తి చూపుతారు. పైగా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా అతి తక్కువ సమయంలోనే ఈ వంటకాలను తయారుచేసుకోవచ్చు. అటుకులు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మంచివి. 
అటుకుల ఉప్మా, పోహా ఇడ్లీ, పోహా దోశ, అటుకుల పాయసం, పోహా బ్రెడ్‌ రోల్స్‌... ఇలా పోహా కాంబినేషన్‌లో ఎన్నో రుచికరమైన వంటకాలు వండుకోవచ్చు. ఈ క్రమంలో- మరింత రుచికరంగా, ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారు పోహా కట్లెట్‌ను కూడా ప్రయత్నించవచ్చు.
పోహా కట్లెట్
కావాల్సిన పదార్థాలు
* అటుకులు (పోహా) - అర కప్పు
* తరిగిన ఉల్లిపాయలు -అర కప్పు
* ఉడికించిన బంగాళాదుంప- ఒకటి
* కొత్తిమీర – 2 టేబుల్‌స్పూన్లు
* శనగ పిండి - 2 టేబుల్‌ స్పూన్లు
* మొక్కజొన్న పిండి- ఒక టేబుల్‌ స్పూన్
* గరం మసాలా- ఒక టేబుల్‌ స్పూన్
* పసుపు- పావు కప్పు
* నల్ల మిరియాల పొడి- పావు కప్పు
* అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూన్
* తరిగిన పచ్చి మిరపకాయలు - 2
* కారం - అర టీస్పూన్
* జీలకర్ర పొడి- అర టీస్పూన్
* నిమ్మరసం- ఒక టీస్పూన్
* ధనియాల పొడి- ఒక టీస్పూన్
* ఉప్పు- రుచికి సరిపడినంత
తయారీ విధానం
ముందుగానే నీటిలో నానబెట్టుకున్న అటుకులు, ఉడకబెట్టిన బంగాళా దుంపను ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఫోర్క్‌ లేదా పొటాటో మ్యాషర్‌ సహాయంతో ఈ రెండింటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి పసుపు, గరం మసాలా, నల్లమిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శనగ పిండి, మొక్కజొన్న పిండి కూడా జత చేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నూనె రాసిన ప్లేటుపై ఈ మిశ్రమాన్ని పరచి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని కట్లెట్ల మాదిరిగా కట్‌ చేసుకోవాలి. చివరిగా ప్యాన్‌లో నూనె వేసి ఈ కట్‌లెట్లను వేయించాలి. అతి తక్కువ మంట మీద బంగారు గోధుమ వర్ణంలోకి మారేంతవరకు వీటిని వేడి చేయాలి. ఆ తర్వాత కిందకు దించి ఏదైనా కెచప్‌తో కలిపి తీసుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన పోహా కట్లెట్‌ను ఆస్వాదించవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు
* పోహాలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్యలున్న వారికి ఇది మంచి ఆహారం.
* ఇందులో ఫైబర్‌ సమృద్ధిగా ఉండడంతో తేలికగా జీర్ణమవుతుంది. పైగా దీనిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* అటుకుల్లో గ్లూకోజ్‌, క్యాలరీలు, కొవ్వుల్లాంటి బరువు పెంచే పదార్థాలు అసలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వెంటనే దీనిని తమ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
* గ్లూటెన్‌ కూడా ఉండదు కాబట్టి మధుమేహ రోగులు కూడా పోహా వంటకాలను తినచ్చు. పైగా దీనిని తరచుగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి.
* ఇందులోని ఎ, బి, సి, కె-విటమిన్లు, ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* పోహాలో యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా ఉంటాయి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
* 76.9 శాతం ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లతో అటుకులు నిండి ఉంటాయి. అందువల్లే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు చాలామంది దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు.
* అలాగే ఈ కట్లెట్ తయారీలో ఉపయోగించే మిగిలిన పదార్థాలన్నీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.
రుచికరమైన పోహా కట్లెట్‌ను ఎలా తయారుచేయాలో తెలుసుకున్నారుగా..! మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అటుకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్