వేసవి తాపం తీరాలంటే..!

వేసవిలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్‌. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల తలెత్తే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. లీటర్ల కొద్దీ నీటిని తాగడంతో పాటు పండ్ల రసాలు....

Published : 13 Jun 2023 21:25 IST

వేసవిలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్‌. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల తలెత్తే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. లీటర్ల కొద్దీ నీటిని తాగడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ.. వంటివి తీసుకుంటూ శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈక్రమంలో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్ చక్కటి ఎంపిక. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఎంతో సులభంగా, త్వరగా దీనిని తయారు చేసుకోవచ్చు. మరి వేసవి తాపాన్ని తగ్గించే ఈ సమ్మర్‌ రెసిపీ తయారీ గురించి తెలుసుకుందాం రండి...

పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్

కావాల్సిన పదార్థాలు

కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్

పాలు - అర లీటరు

కండెన్స్‌డ్‌ మిల్క్‌- ఒక టేబుల్‌ స్పూన్

మామిడి పండు ముక్కలు - అరకప్పు

దానిమ్మ గింజలు - టేబుల్‌ స్పూన్

పిస్తా పప్పులు - టీస్పూన్

తయారీ

ముందుగా ఒక టేబుల్‌ స్పూన్‌ పాలను కస్టర్డ్‌ పౌడర్‌లో పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అర లీటరు పాలు తీసుకుని అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి స్టౌ మీద పెట్టి మీడియం మంటపై బాగా మరిగించాలి. ఆపై కస్టర్డ్ పౌడర్‌-పాల మిశ్రమాన్ని దీనికి జతచేయాలి. గిన్నెలోని పాలు చిక్కబడేంత వరకు స్పూన్‌తో కలుపుతూ మరిగించాలి. ఆ తర్వాత స్టౌ కట్టేసి గిన్నెను కిందకు దించాలి. ఈ పాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మామిడి పండు ముక్కలు, పిస్తా పప్పులు, దానిమ్మ గింజలు వేసి కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని దానిపై అవసరమైతే కొన్ని దానిమ్మ గింజలు, పిస్తా పప్పులతో గార్నిష్‌ చేసుకుంటే రుచికరమైన పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్‌ రడీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని