చిరుజల్లుల వేళ.. ఇంట్లోనే క్యాపుచినో!

చిరుజల్లులతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఈ సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలని, తాగాలని అనిపించడం సహజం. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో వేడివేడిగా టీ/కాఫీ తాగితే అదో రిలీఫ్‌! అందులోనూ రెస్టరంట్లు, కెఫేల్లో ఎక్కువగా దొరికే స్ట్రాంగ్‌ క్యాపుచినో లాంటి కాఫీ గొంతులో పడితే ఆ మజాయే వేరు! అయితే దానికోసం అక్కడిదాకా ఎందుకు ఇంట్లోనే తయారుచేసుకుంటే పోలా?!

Published : 24 Jul 2021 18:56 IST

చిరుజల్లులతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఈ సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలని, తాగాలని అనిపించడం సహజం. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో వేడివేడిగా టీ/కాఫీ తాగితే అదో రిలీఫ్‌! అందులోనూ రెస్టరంట్లు, కెఫేల్లో ఎక్కువగా దొరికే స్ట్రాంగ్‌ క్యాపుచినో లాంటి కాఫీ గొంతులో పడితే ఆ మజాయే వేరు! అయితే దానికోసం అక్కడిదాకా ఎందుకు ఇంట్లోనే తయారుచేసుకుంటే పోలా?!

క్యాపుచినో కాఫీ

కావాల్సిన పదార్థాలు

* పాలు- ముప్పావు కప్పు

* క్రీమ్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు

* కాఫీ పౌడర్‌ - రెండున్నర టేబుల్‌ స్పూన్లు

* చక్కెర పొడి (క్యాస్టర్ షుగర్) - ఒక టీస్పూన్

* వేడి నీళ్లు - రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం

* ఒక ప్యాన్‌లో పాలు, క్రీమ్‌ వేసి కొద్దిసేపు మరిగించాలి.

* ఇప్పుడు ఒక కప్పులో కాఫీ పౌడర్‌, చక్కెర పొడి, వేడినీళ్లు పోసి బాగా మిక్స్‌ చేయాలి.

* ప్యాన్‌లోని పాలు బాగా మరగగానే స్టౌ కట్టేసి దించి.. మిల్క్‌ బీటర్‌ సహాయంతో పాలు బాగా నురగ వచ్చేలా రెండు నిమిషాల పాటు బీట్‌ చేయాలి.

* ఆపై కాఫీ పౌడర్ (ఇన్‌స్టెంట్), చక్కెర పొడి, వేడి నీళ్లు ఉన్న కప్పులో ఈ పాలు పోసి బాగా కలపాలి.

* చివరగా షుగర్‌ క్యూబ్స్‌ వేసి మరోసారి కలిపితే రుచికరమైన క్యాపుచినో సిద్ధమైనట్లే.

 

రోజుకు ఒక్క కప్పు చాలు!

ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. క్యాపుచినో కాఫీకీ ఇది వర్తిస్తుంది. రుచిగా ఉందని కప్పులకు కప్పులు లాగించకుండా రోజుకు ఒక్క కప్పు మాత్రమే తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యానికి మంచిదని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

* సులభంగా తయారుచేసుకునే ఈ కాఫీతో గుండె జబ్బులను నిరోధించవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వుల్ని కరిగిస్తాయని, ఫలితంగా గుండె జబ్బులు దూరమవుతాయని, గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలావరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఈ కాఫీని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్, డిమెన్షియా (ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం) లాంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది.

* తీవ్రమైన తలనొప్పి ఉన్న సమయంలో ఈ కాఫీ తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

* రోజూ ఒక కప్పు క్యాపుచినో కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

* చక్కెర వద్దనుకునే వారు/మధుమేహులు.. అది లేకుండా కూడా ఈ కాఫీ తయారుచేసుకోవచ్చు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్