ఇమ్యూనిటీని పెంచే ‘పసుపు-క్యారట్‌ సూప్‌’!

కరోనా రాకతో ఆరోగ్య విషయంలో అందరికీ శ్రద్ధ పెరిగింది. ప్రధానంగా ఆహారం విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. రుచి కంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈక్రమంలో వివిధ రకాల ఇమ్యూనిటీ ఫుడ్స్‌ కోసం చాలామంది ఇంటర్నెట్‌లో శోధిస్తూనే ఉన్నారు.

Updated : 03 Jul 2021 21:21 IST

కరోనా రాకతో ఆరోగ్య విషయంలో అందరికీ శ్రద్ధ పెరిగింది. ప్రధానంగా ఆహారం విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. రుచి కంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈక్రమంలో వివిధ రకాల ఇమ్యూనిటీ ఫుడ్స్‌ కోసం చాలామంది ఇంటర్నెట్‌లో శోధిస్తూనే ఉన్నారు.

ఇక దీంతో పాటు వర్షాకాలంలో వేడివేడిగా సూప్స్‌ తాగాలనిపించడం సహజం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం నిండి ఉన్న ఈ సూప్స్‌లో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అలాంటి ఓ రుచికరమైన ఇమ్యూనిటీ సూప్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు-క్యారట్‌ సూప్‌

కావాల్సినవి

* నెయ్యి- ఒక టీస్పూన్‌

* ఉల్లిపాయ- ఒకటి (సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి)

* తరిగిన వెల్లుల్లి- ఒక టీస్పూన్‌

* పసుపు - 2 టీస్పూన్లు

* తురిమిన అల్లం- ఒకటిన్నర టీస్పూన్‌

* క్యారట్లు - 3 (చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి)

* వెజిటబుల్ స్టాక్‌ (కాయగూరలు ఉడికించిన నీళ్లు) - 4 కప్పులు

* నిమ్మకాయ – ఒకటి

తయారీ విధానం

ప్యాన్‌లో నెయ్యి పోసి వేడిచేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పసుపు, అల్లం కూడా జత చేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆపై క్యారట్‌ ముక్కలు, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు ఉడికించాలి. క్యారట్లు బాగా ఉడికి మిశ్రమం చిక్కగా మారేంత వరకు గరిటె సహాయంతో కలుపుతూనే ఉండాలి. చివరగా నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్‌ చేస్తే దీని రుచి అదిరిపోతుంది! ఈ చిరుజల్లుల్లో సాయంత్రం వేళ లేదంటే డిన్నర్‌కు ముందు కానీ ఈ సూప్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్నెన్నో ప్రయోజనాలు!

* పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహకరిస్తాయి.

* ఇందులో కర్క్యుమిన్‌ అనే రసాయనిక సమ్మేళనంతో పాటు యాంటీ సెప్టిక్‌ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి మంట, నొప్పిని తట్టుకునేలా శరీరాన్ని తయారుచేస్తాయి. కాబట్టి ఇటీవల వ్యాక్సిన్‌ తీసుకొని శారీరక నొప్పులతో బాధపడుతోన్న వారికి ఇది మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు.

* క్యారట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తాయి. దీంతో పాటు ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

* అల్లం, వెల్లుల్లిలోనూ రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగానే ఉంటాయంటున్నారు నిపుణులు.

* కాయగూరలు ఉడికించిన నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడానికి తోడ్పడతాయి.

* ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్‌.. వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో తోడ్పడతాయి.

* క్యాన్సర్‌తో పోరాడే సమ్మేళనాలు ఉల్లిపాయలో బోలెడన్ని ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ ఇవి సహకరిస్తాయి.

* నెయ్యి తీసుకుంటే లావవుతామేమో అనుకుంటారు.. కానీ శరీరంలో పేరుకుపోయిన అనారోగ్యకరమైన కొవ్వుల్ని తొలగించడంలో నెయ్యిని మించింది లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్