నూనెల్ని పూర్తిగా మానక్కర్లేదు!

ఏమాత్రం నూనె వాడకుండా వంటలు రుచికరంగా ఉండాలంటే అది అన్నిటి విషయంలో సాధ్యం కాదు. అయితే నూనెల్లో ఉండే కొవ్వుల్లో మన శరీరానికి మంచివి, హాని చేసేవి.. రెండూ ఉంటాయి. ఈ క్రమంలో శరీరానికి కొవ్వులు కూడా కొంతవరకు అవసరమే. అయితే ఒక్కో నూనెలో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కోదాని నుంచి ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది.

Updated : 11 Mar 2022 20:49 IST

ఏమాత్రం నూనె వాడకుండా వంటలు రుచికరంగా ఉండాలంటే అది అన్నిటి విషయంలో సాధ్యం కాదు. అయితే నూనెల్లో ఉండే కొవ్వుల్లో మన శరీరానికి మంచివి, హాని చేసేవి.. రెండూ ఉంటాయి. ఈ క్రమంలో శరీరానికి కొవ్వులు కూడా కొంతవరకు అవసరమే. అయితే ఒక్కో నూనెలో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కోదాని నుంచి ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది.

కొవ్వులు కూడా అవసరమే...

నూనెల్లో పూర్తిగా కొవ్వులే ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం పూర్తిగా మానేయాలనుకోవడం కూడా సరికాదు. మన జీవక్రియల్లో కొవ్వుల పాత్ర కూడా చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, కె వంటివి ఒంటికి పట్టాలంటే కొవ్వులే కీలకం. రోగ నిరోధక శక్తి పెంచేలా చేయడంలోనూ కొవ్వుల పాత్ర ఎంతో. వీటిని తీసుకోకపోతే ఆ శక్తి మందగిస్తుంది. అంతేకాదు శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అది తొందరగా తగ్గడంలో కొవ్వులే క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి అవసరమైనంత మేర కొవ్వులు తీసుకోవడం తప్పనిసరి.

ఏ నూనెలో ఏముంటాయి..?

వేరుశనగ, ఆలివ్ నూనెలు: మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు

సఫోలా, పొద్దుతిరుగుడు (సన్ ఫ్లవర్): పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు

నెయ్యి, డాల్డా, కొబ్బరి, పామోలివ్ నూనె : శాచురేటెడ్ ఫ్యాట్

చేపనూనె, సోయాబీన్ నూనె, ఆవ నూనె: ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు

ఎలా వాడాలి?

ప్రత్యేకించి ఫలానా నూనె మాత్రమే మన శరీరానికి మేలు చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే బాడీకి అన్ని రకాల కొవ్వులూ అవసరమే. ఇవన్నీ కలిసి ఒకే నూనెలో లభ్యం కావు. కాబట్టి మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు.. ఈ రెండూ శరీరానికి అందేలా ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ నూనె, వేరుశనగ (పల్లీ) నూనె, ఆవు నెయ్యి.. మొదలైనవి ఎంచుకోవచ్చు. వీటిని పూటకొకటి చొప్పున వాడుకోవాలి. లేదంటే ఒక నెల ఒక రకం, మరో నెల మరొకటి చొప్పున వాడుకున్నా మంచిదే. ఇలా చేయడం వల్ల అవసరమైన అన్ని రకాల కొవ్వులూ శరీరానికి అందుతాయి. కొంతమంది రెండు నూనెలూ చెరిసగం కలిపి వాడుతారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక్కో నూనెకు మరుగు ఉష్ణోగ్రత ఒక్కోలా ఉంటుంది. కాబట్టి విడిగానే వాడుకోవాలి.

ఎంత మోతాదులో?

రోజుకు సుమారు ఐదు టీ స్పూన్ల వరకు నూనెను వినియోగించవచ్చు. కాకపోతే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు వాటి నుంచి కూడా కొవ్వులు అందుతాయి. అలాగే కొన్ని గింజల్లో కూడా కొవ్వులు ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకునేవాళ్లు నూనెల వాడకాన్ని తగ్గించాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ల కోసం చేపలు ఎక్కువగా తీసుకోవాలి. శాకాహారులైతే సోయాబీన్ నూనె లేదా ఆవ నూనె వాడాలి. నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు ఆహారంలో పరిమితం చేసుకోవాలి.

ఇలా చేయండి...

* వేపుళ్లు, చిప్స్, మాంసాహారం లాంటివి వీలైనంతవరకు తగ్గించండి. వీటి బదులు పళ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజ్ తిన్నప్పుడు తగు మోతాదులో కాయగూరలు, పళ్లు తీసుకుంటే బ్యాలన్స్ అవుతుంది. వీటిలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల కొవ్వు చేరకుండా కొంతవరకు నివారించవచ్చు.

* ఫ్రై చేయడానికి ఆలివ్ ఆయిల్ వాడొద్దు. ఎందుకంటే దీని మరుగు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి నూనెలోని రసాయన బంధాలు తేలికగా విడిపోతాయి.

* పకోడీ, గారెలు.. లాంటివి వేయించడానికి ఉపయోగించిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగించొద్దు. బాగా మరగడం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు వాటినుంచి వెలువడే ప్రమాదం ఉంది. గ్యాస్ సిమ్‌లో ఉంచి ఇలాంటివి చేసుకోవడం తెలివైన పని.

* నూనెలో బాగా వేయించడం వల్ల ఆహార పదార్థాల్లోని పోషకాలు నశిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు డీప్ ఫ్రై చేయడాన్ని పరిమితం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్