Published : 29/01/2023 13:47 IST

ఏ మరక.. ఎలా తొలగించాలి?

తినేటప్పుడైనా లేదంటే ఏదైనా పనిచేసేటప్పుడైనా దుస్తులపై వివిధ రకాల మరకలు పడడం సహజం. అయితే వీటిలో కొన్ని రకాల మరకలు సులభంగా వదిలిపోతే.. మరికొన్నింటిని తొలగించడం మాత్రం కష్టం. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏ మరక ఎలా తొలగించుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

రంగు మరకలు

రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడు లేదంటే వాషింగ్‌ మెషీన్‌లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకోవడం సహజమే! ముఖ్యంగా తెలుపు రంగు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు. ఇలాంటప్పుడు ఒక చిన్న తెల్ల గుడ్డ ముక్క తీసుకొని.. దానిపై హెయిర్‌ స్ప్రే, రబ్బింగ్‌ ఆల్కహాల్‌ లేదంటే 90 శాతం ఆల్కహాల్‌ ఉన్న ఏదైనా ద్రావణం పోసి.. దాంతో మరక పడ్డ చోట పదే పదే తుడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మరక వదిలిపోతుంది. ఆపై దీన్ని సాధారణంగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.

పాల మరకలు

పాలిచ్చే తల్లులకు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తవడం వల్ల అవి లీకై దుస్తులపై మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించడానికి.. ముందుగా బ్రష్‌తో ఆ మరకపై రుద్దాలి. ఆపై డిటర్జెంట్‌ వేసిన చల్లటి నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. తద్వారా ఫలితం ఉంటుంది. ఇదనే కాదు.. సాధారణ పాల మరకలు, కోడిగుడ్డు సొన మరకలు వదిలించుకోవడానికి కూడా ఈ చిట్కాను పాటించచ్చు.

రక్తపు మరకలు

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువైనా.. ఏదైనా గాయం తగిలినా.. ఆ మరకలు దుస్తులపై పడుతుంటాయి. ఇక ఇవి ఎంత రుద్దిగా పూర్తిగా పోవు. అలాంటప్పుడు వీటిని డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపిన నీటిలో అరగంట పాటు నానబెట్టి.. సాధ్యమైనంత వరకు చేత్తో్ రుద్దాలి. ఇక ఇలా వదలట్లేదు అనుకున్నప్పుడు.. దానిపై Enzymatic Stain Remover (ఇది మార్కెట్లో దొరుకుతుంది) వేసి కాసేపు అలా వదిలేయాలి. ఆపై రుద్దుతూ ఉతికేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇలా చేసినా మరక వదలకపోతే మాత్రం.. దానిపై ఒకట్రెండు చుక్కల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఉతికితే ఫలితం ఉంటుంది. అయితే దీనివల్ల కొన్ని రకాల దుస్తులు రంగు వెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మంచిది. అది కూడా చాలా తక్కువ మొత్తంలో ఉపయోగించాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

నూనె మరకలు

వంట చేసే క్రమంలో దుస్తులపై నూనె మరకలు పడడం సహజమే! అయితే వీటిని వదిలించడం అంత తేలిక కాదు. ఇందుకోసం ముందుగా దుస్తుల్ని చల్లటి నీళ్లలో ముంచి తీయాలి. ఆపై మరక ఉన్న చోట డిష్‌వాషింగ్‌ సబ్బు/లిక్విడ్‌ని వేసి బాగా రుద్దాలి. ఇలా మరక పూర్తిగా తొలగిపోయే వరకు రుద్దాలి. లేదంటే బేకింగ్‌ సోడాను మరకపై చల్లి.. అరగంట తర్వాత బ్రష్‌తో రుద్దాలి. ఇప్పుడు వెనిగర్‌, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేసి కాసేపటి తర్వాత ఉతికేస్తే మరక వదిలిపోతుంది.

వీటిని ఇలా తొలగించచ్చు!

సిరా మరకలు పడిన చోట పేపర్‌ టవల్‌తో అద్దాలి. ఆ తర్వాత దానిపై హెయిర్‌ స్ప్రే  స్ప్రే చేసి కొన్ని నిమిషాల తర్వాత ఉతికేస్తే సరిపోతుంది.

వెనిగర్‌, నీళ్లు కలిపిన మిశ్రమంతో మట్టి మరకలు, పచ్చగడ్డి వల్ల దుస్తులపై పడిన మరకల్ని సైతం వదిలించచ్చు.

అధిక చెమట కారణంగా చంకల కింద మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించాలంటే.. కప్పు వెనిగర్‌ని రెండు కప్పుల గోరువెచ్చటి నీటిలో కలిపి.. ఈ మిశ్రమంలో ఆ దుస్తుల్ని అరగంట పాటు నానబెట్టి ఉతికితే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని