6 రోజులు.. 680 కిలోమీటర్లు!

ఒక్కోసారి మన అలవాట్లు, అభిరుచులే మనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గురుగ్రామ్‌కు చెందిన మీనల్‌ కోటక్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఆరోగ్యం, ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని తాను ప్రారంభించిన పరుగే ఇప్పుడు ఆమెను ప్రపంచంలోనే ది బెస్ట్‌ అల్ట్రారన్నర్‌గా నిలబెట్టింది.

Published : 26 Jun 2024 12:22 IST

(Photos: Twitter)

ఒక్కోసారి మన అలవాట్లు, అభిరుచులే మనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గురుగ్రామ్‌కు చెందిన మీనల్‌ కోటక్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఆరోగ్యం, ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని తాను ప్రారంభించిన పరుగే ఇప్పుడు ఆమెను ప్రపంచంలోనే ది బెస్ట్‌ అల్ట్రారన్నర్‌గా నిలబెట్టింది. దశాబ్ద కాలంగా దేశ, విదేశాల్లో నిర్వహించే విభిన్న పరుగు పందేల్లో పాల్గొంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న ఆమె.. ఇటీవలే అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన డోమ్‌ రన్నింగ్‌ ఈవెంట్లో పాల్గొని మరోమారు సత్తా చాటింది. ఆరు రోజుల పాటు నిర్వహించిన ఈ పరుగు పందెంలో సుమారు 680 కిలోమీటర్లు పరిగెత్తిందామె. ఇలా ఒక భారతీయ మహిళా రన్నర్‌ ఆరు రోజుల పాటు పరిగెత్తడం, అందులోనూ ఎక్కువ కిలోమీటర్లు రన్నింగ్‌ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాదు.. ఈ క్రమంలో భారత పురుషుల రికార్డునూ బద్దలుకొట్టిందామె. చక్కటి ప్రణాళికతోనే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చంటోన్న మీనల్‌ మారథాన్‌ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

గురుగ్రామ్‌కు చెందిన మీనల్‌ ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఆమె ఫ్యామిలీలో అందరూ ఛార్టర్డ్‌ అకౌంటెంట్సే! వాళ్లను చూస్తూ పెరిగిన తానూ.. ఇదే కోర్సు చదవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దిల్లీలోని జీసస్‌ మేరీ కాలేజీలో కామర్స్‌ (ఆనర్స్‌) విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. తన సీఏ లక్ష్యంపై దృష్టి పెట్టింది. 2004లో సీఏ కోర్సు పూర్తిచేశాక సిటీ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరింది.

అందుకే జిమ్‌లో చేరా!

ఉన్నతోద్యోగం, మంచి జీతం.. ఇక పెళ్లి చేయడమే తరువాయి అనుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆమె కోసం సీఏ చదివిన వరుడినే తీసుకురావాలనుకున్నారు. అలా సీఏ సచిన్‌తో 2007లో ఏడడుగులు నడిచింది మీనల్‌. ఆ తర్వాత  ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం భర్త జర్మనీ వెడుతుంటే.. అతనితో పాటు అక్కడికి వెళ్లింది. ఇక అప్పటిదాకా ఉద్యోగం చేసి.. ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే ఎవరికైనా విసుగే! అందుకే టైంపాస్‌ కోసం జర్మన్‌ నేర్చుకోవడం, బైక్‌ నడపడం, సల్సా డ్యాన్స్‌ నేర్చుకోవడం.. వంటి తనకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టింది మీనల్‌. ఇక భర్త ప్రోత్సాహంతో అక్కడే ఎంబీఏ కూడా పూర్తిచేసిన ఆమె.. కొన్నేళ్ల తర్వాత భారత్‌కు తిరిగొచ్చింది. అయితే అప్పటికే 85 కిలోల అధిక బరువుకు తోడు హైపర్‌థైరాయిడిజం, ఆస్తమా.. వంటి సమస్యలతో ఇబ్బంది పడుతోందామె. ఎలాగైనా బరువు తగ్గి.. ఏకకాలంలో తన ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవాలని భావించిన మీనల్‌.. ఈ ఆలోచనతోనే జిమ్‌లో చేరింది. అక్కడ ట్రెడ్‌మిల్‌పై రోజూ 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తేదామె. ఇలా వ్యాయామం చేస్తున్న కొద్దీ బరువు తగ్గి.. తన అనారోగ్యాలూ ఒక్కొక్కటిగా దూరమవడం గమనించిన ఆమెకు క్రమంగా పరుగుపై ఆసక్తి పెరిగింది.

అదే టర్నింగ్‌ పాయింట్‌!

ఇలా పరుగుపై మీనల్‌కు ఉన్న ఇష్టాన్ని గుర్తించిన ఆమె ఫ్రెండ్‌ ఒకరు ‘ఎయిర్‌టెల్‌ దిల్లీ హాఫ్‌ మారథాన్‌’లో ఆమె పేరు నమోదు చేయించారు. ఇదే తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అంటోంది మీనల్‌.

‘జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో పరుగు పందేల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. కానీ నేను తొలిసారి పాల్గొన్న ఈ హాఫ్‌ మారథాన్‌ నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఈ ఈవెంట్‌ నాకు సవాలు విసరడమే కాదు.. మానసిక ఒత్తిడినీ అధిగమించేలా చేసింది. ఇలా దిల్లీ హాఫ్‌ మారథాన్‌ ముగిశాక.. జైపూర్‌లో నిర్వహించిన మరో హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నా. గంటా 49 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని టాప్-3లో చోటు దక్కించుకున్నా..’ అంటూ తన మారథాన్‌ జర్నీ ప్రారంభించిన తీరును వివరించిందీ మహిళా రన్నర్‌.

నేనే స్ఫూర్తి కావాలనుకున్నా..!

అయితే ఇలా తన మారథాన్‌ కెరీర్‌ ఊపందుకుంటోందన్న తరుణంలోనే మోకాలి చిప్ప గాయంతో ఇబ్బంది పడింది మీనల్‌. డాక్టర్‌ వద్దని సూచించినా.. తన సాధనను మాత్రం ఆపలేదు. అంతేకాదు.. ఇదే సమయంలో హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ఫుల్‌ మారథాన్‌లోనూ పాల్గొంది.

‘నా చుట్టూ ఎంతోమంది మారథాన్‌ రన్నర్స్‌ ఉన్నా.. అందులో మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఈ గణాంకాల్ని మార్చాలనిపించింది. ఈ దిశగా నేనే మరికొంతమంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. ఈ ఆలోచనతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నిర్వహించే అల్ట్రా మారథాన్‌ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించా. మోకాలి చిప్ప గాయం వేధించినా.. వేగం కంటే దూరానికే ప్రాధాన్యమిస్తూ సాధన చేసేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చింది మీనల్‌. ఆపై ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రోత్సాహంతో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌, బెల్‌ఫాస్ట్‌లో నిర్వహించిన మరో మారథాన్‌ పోటీలో పాల్గొన్న ఆమె.. ఉత్తమ ప్రదర్శనతో సత్తా చాటింది.

చిన్న బరువూ ఎత్తలేకపోయా!

ఇలా తన మారథాన్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలోనే ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌’కు కొన్ని రోజుల ముందు మరో తీవ్ర గాయంతో ఇబ్బంది పడిందామె. ఇది తనను శారీరకంగానే కాదు.. మానసికంగానూ దెబ్బతీసిందంటోంది మీనల్‌.

‘మరో శారీరక గాయంతో ఏడెనిమిది నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో చిన్న బరువు కూడా ఎత్తలేకపోయా. ఇక దాన్నుంచి కాస్త కోలుకున్నాక తిరిగి పరుగుపై దృష్టి పెట్టా. చిన్న చిన్న లక్ష్యాల్ని ఏర్పరచుకుంటూ నా ఫిట్‌నెస్‌ను పెంచుకుంటూ పోయా. మొదట్లో ఐదు కిలోమీటర్ల నడకతో తిరిగి సాధనను ప్రారంభించిన నేను.. క్రమంగా 12 గంటలు ఏకధాటిగా పరిగెత్తేలా నా ఫిట్‌నెస్‌ను పెంచుకున్నా. ఈ సాధనతోనే 24 గంటలు పరిగెత్తేలా నా శరీరాన్ని సిద్ధం చేసుకున్నా. గాయానికి పూర్వం 24 గంటల పరుగు విభాగంలో పలు ప్రముఖ మారథాన్‌ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నప్పటికీ.. గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ కొత్తగా పోటీల్లో పాల్గొన్నట్లనిపించేది..’ అంటూ తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల్ని గుర్తు చేసుకుందామె.

మావారి ప్రోత్సాహం ఎంతో!

జీవితంలోని కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే మానసిక బలం ఎంత ముఖ్యమో.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో తన భర్త సచిన్‌ తనకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారని చెబుతోంది మీనల్‌.

‘నా మారథాన్‌ కెరీర్‌ విజయవంతంగా ముందుకు సాగుతోందంటే అందుకు మావారు సచిన్‌ ప్రోత్సాహం ఎంతో! ఆయన తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా నా ప్రతి ఈవెంట్లోనూ నాకు తోడుంటారు. నేను తీసుకునే ఆహారం, ఫిట్‌నెస్‌ విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకుంటారు.. గాయం నుంచి కోలుకునే క్రమంలోనూ నా వెన్నుతట్టారు..’ అంటోన్న ఈ మహిళా మారథానర్‌.. గతేడాది చండీగఢ్ వేదికగా నిర్వహించిన 24 గంటల మారథాన్‌ ఈవెంట్లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలో 24 గంటల్లో 187 కిలోమీటర్లు పరిగెత్తి.. 2017లో తన పూర్వ రికార్డు (24 గంటల్లో 175.6 కిలోమీటర్లు)ను బద్దలుకొట్టింది. తద్వారా తన అల్ట్రా మారథాన్‌ కెరీర్‌లో మరోసారి అత్యుత్తమ గణాంకాల్ని నమోదుచేసింది మీనల్‌.


6 రోజులు.. 680 కిలోమీటర్లు!

పరుగు పోటీల్లో ఎప్పుడెప్పుడు పాల్గొందామా? అని ఎదురుచూసే మీనల్‌కు ఇటీవలే అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన డోమ్‌ రన్నింగ్‌ ఈవెంట్లో పాల్గొనే అవకాశమొచ్చింది. ఏటా ఆరు రోజుల పాటు ఈ పరుగు పందెం నిర్వహిస్తారు. ఇండోర్‌లో జరిగే ఈ రన్నింగ్‌ ఈవెంట్లో ఆరు రోజులు/143 గంటల 57 నిమిషాల 27 సెకన్లు పరిగెత్తి.. మొత్తంగా 680.2 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసింది మీనల్‌. ఇలా ఆరు రోజుల పరుగును దిగ్విజయంగా పూర్తిచేసిన తొలి భారతీయ మహిళా రన్నర్‌గా కీర్తి గడించిం ది. అంతేకాదు.. గతంలో పురుషుల పేరిట ఉన్న (ఆరు రోజుల్లో 574.5 కిలోమీటర్ల) రికార్డునూ అధిగమించి.. సుమారు వంద కిలోమీటర్లు అధికంగానే పరిగెత్తింది మీనల్‌. తద్వారా ఆరు రోజుల ఈ అల్ట్రారన్నింగ్‌ ఈవెంట్లో పాల్గొని సత్తా చాటిన టాప్‌-12 మహిళా అల్ట్రా రన్నర్స్‌ సరసన చేరింది మీనల్‌.

‘ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఈ ఆరు రోజులు ఎంతగానో శ్రమించా. చలిని తట్టుకొని మొండి పట్టుదలతోనే లక్ష్యాన్ని చేరుకోగలిగా. కాస్త కష్టమే అయినా ఈ అరుదైన ఘనత నా శరీరానికి, మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది.. ఏ విషయంలోనైనా నేను ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతా. నా జీవితంలో నాకు ఎదురైన సవాళ్లు, ఎత్తుపల్లాలనూ.. ఇదే ప్రణాళిక, క్రమశిక్షణతోనే జయించాను. ఈ ఆరు రోజుల రేస్‌ కోసం కూడా ముందు నుంచే ప్లాన్‌ ప్రకారం సిద్ధమయ్యా. ఇలా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాల్ని తప్పకుండా చేరుకోగలం..’ అంటూ తన గెలుపు సీక్రెట్‌ని పంచుకుంటూ ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ మారథానర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్