ఐఐటీలో చదివి.. ఆర్మీలో చేరి..!

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. అపారమైన ఖనిజ సంపద ఈ దేశం సొంతం. అయినా భయంకరమైన పేదరికాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిరంతరం జరిగే రాజకీయ అవినీతి, పరిమితమైన ఆర్థిక అవకాశాలు, నిత్యం అల్లర్లతో అట్టుడికిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు.

Published : 01 Jun 2024 12:40 IST

(Photos: Instagram)

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. అపారమైన ఖనిజ సంపద ఈ దేశం సొంతం. అయినా భయంకరమైన పేదరికాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిరంతరం జరిగే రాజకీయ అవినీతి, పరిమితమైన ఆర్థిక అవకాశాలు, నిత్యం అల్లర్లతో అట్టుడికిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి.. ఆ దేశంలో శాంతిభద్రతల్ని పెంపొందించే బాధ్యతను గతేడాది మార్చిలో భుజాలకెత్తుకున్నారు ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్‌ రాధికా సేన్‌. సుమారు 13 నెలల పాటు ఆ దేశంలో విధులు నిర్వర్తించి.. అక్కడ శాంతి భద్రతల్ని పరిరక్షించేందుకు తన వంతుగా కృషి చేసిన ఆమె.. తాజాగా ‘ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2023’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ శాంతి దూత గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

ప్రత్యేక మిషన్‌లో భాగమై..!

ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలు, దేశాల మధ్య పరస్పర చెలిమిని పెంపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తోంది ఐక్యరాజ్య సమితి. ఈ క్రమంలోనే వివిధ కారణాల రీత్యా శాంతి కరువైన దేశాల్లో.. తిరిగి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా దేశాల్లో శాంతిని పరిరక్షించేందుకు ప్రత్యేకమైన మిషన్లు/ఆపరేషన్లూ నిర్వహిస్తుంటుంది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గతేడాది ప్రారంభించిన ఈ తరహా ప్రత్యేకమైన శాంతి పరిరక్షణ మిషన్‌లో భారత ఆర్మీకి చెందిన మేజర్‌ రాధికా సేన్‌ కూడా భాగమయ్యారు. ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌’తో కలిసి పనిచేస్తూ ఆ దేశంలో శాంతిని పరిరక్షించేందుకు తన శాయశక్తులూ ఒడ్డారు. ముఖ్యంగా అక్కడి రాజకీయ అవినీతి, అల్లర్లకు చరమగీతం పాడి.. ప్రజలకు ఆర్థిక అవకాశాల్ని పెంపొందించేందుకు తన బృందంతో కలిసి కృషి చేశారామె. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఆ దేశ ఉత్తర కివు ప్రావిన్స్‌లో ‘ఎంగేజ్‌మెంట్‌ ప్లాటూన్‌ కమాండర్‌’గా విధులు నిర్వర్తించారు రాధిక.

ఓవైపు భద్రత.. మరోవైపు అవగాహన!

ఈ 13 నెలల కాలంలో.. ఉత్తర కివులోని మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించడంతో పాటు ఇతర భద్రతా చర్యలు తీసుకున్నారు రాధిక. అంతేకాకుండా.. కమ్యూనిటీ అలర్ట్‌ నెట్‌వర్క్స్‌ ఏర్పాటుచేసి.. అక్కడి కమ్యూనిటీ నాయకులు, మహిళలు, యువత.. తమ భద్రత, మానవ హక్కుల సమస్యలపై ధైర్యంగా గళమెత్తే అవకాశాన్ని వారికి కల్పించారామె. ఇలా భద్రత పరంగానే కాకుండా.. అక్కడి చిన్నారులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేసి ఆంగ్ల విద్య బోధించడం, యువతకు వృత్తినైపుణ్యాల్లో శిక్షణ అందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం.. వంటివీ చేశారు రాధిక. ఒక అధికారిగా కాకుండా.. ఒక స్నేహితురాలిగా, కుటుంబంలోని వ్యక్తిగా అక్కడి వారితో కలిసిపోయిన ఈ మేజర్‌.. వాళ్ల సమస్యల్ని వినడంతో పాటు వారికి తమ హక్కులపై అవగాహన కూడా కల్పించారు.

ఇదెంతో ప్రత్యేకం!

ఇలా ఆ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు తన వంతుగా కృషి చేసిన మేజర్‌ రాధికకు ఐక్యరాజ్య సమితి ‘మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2023’ పురస్కారాన్ని ఇటీవలే ప్రదానం చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న రెండో భారతీయ మేజర్‌గా రాధిక నిలిచారు. 2019లో సౌత్‌ సూడాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన మేజర్‌ సుమన్‌ గవానీకి తొలిసారి ఈ పురస్కారం దక్కింది. ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌ చేతుల మీదుగా రాధిక ఈ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో ‘రాధిక అసలు సిసలైన నాయకురాలు’ అంటూ ఆయన ఈ మేజర్‌ సేవల్ని కొనియాడారు.

‘ఈ అవార్డు నా కెరీర్‌లోనే ప్రత్యేకమైంది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో వంటి అనునిత్యం సవాళ్లతో కూడుకున్న ప్రాంతాల్లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు శాంతి పరిరక్షకులు పడే కష్టానికి ఈ అవార్డు ప్రతిఫలంగా, గుర్తింపుగా నిలుస్తుంది. శాంతి పరిరక్షణ మనందరి బాధ్యత! కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు శాంతియుతంగా మెలిగినప్పుడే ఈ ప్రపంచం అందమైన ప్రదేశంగా మారుతుంది..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు రాధిక. ప్రస్తుతం భారత సైన్యం తరఫున ఐక్యరాజ్యసమితిలో 124 మంది మహిళలు శాంతి పరిరక్షకులుగా ఉన్నారు. ఫలితంగా అత్యధిక సంఖ్యలో శాంతిదూతల్ని అందించిన దేశాల్లో భారత్‌ పదకొండో స్థానంలో కొనసాగుతోంది.

ఐఐటీలో చదువుకొని..!

హిమాచల్‌ప్రదేశ్‌లో 1993లో జన్మించారు రాధిక. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక.. ఐఐటీ బాంబేలో మాస్టర్స్‌ డిగ్రీ చదివారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో తన కెరీర్‌ దిశను మార్చుకున్న ఆమె.. 2016లో భారత రక్షణ రంగంలో చేరారు. ఇండియన్‌ ఆర్మీలో విశేష సేవలందించిన రాధిక.. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఐరాస శాంతి పరిరక్షకురాలిగా కాంగోలో సేవలందించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్