అండర్ ఆర్మ్స్.. వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పవు!

బయటికి కనిపించే శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ.. దుస్తుల్లోపల దాగుండే భాగాలపై పెట్టం. చంకల విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే చేస్తుంటారు చాలామంది. దీంతో ఆ భాగంలో నల్లగా, గరుకుగా తయారవుతుంది. వేసవిలో చెమట కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతుంది. తద్వారా అక్కడ పీహెచ్‌ స్థాయులు లోపించి.. పలు రకాల ఇన్ఫెక్షన్లు...

Published : 06 Apr 2023 16:53 IST

బయటికి కనిపించే శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ.. దుస్తుల్లోపల దాగుండే భాగాలపై పెట్టం. చంకల విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే చేస్తుంటారు చాలామంది. దీంతో ఆ భాగంలో నల్లగా, గరుకుగా తయారవుతుంది. వేసవిలో చెమట కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతుంది. తద్వారా అక్కడ పీహెచ్‌ స్థాయులు లోపించి.. పలు రకాల ఇన్ఫెక్షన్లు, దుర్వాసనకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ కాలంలో చంకల విషయంలో మరింత జాగ్రత్త వహించాలంటున్నారు. మరి, వేసవి వేడిని తట్టుకుంటూ ఆ భాగం తాజాగా, మృదువుగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

సాధారణంగా చర్మంలో పీహెచ్‌ స్థాయులు 5.4-5.9 మధ్యలో ఉండాలి. కానీ చంకల కింద ఈ స్థాయులు 6.5గా ఉంటాయి. దీన్ని అదుపు చేసుకోవాలంటే.. ఆ ప్రదేశంలో తరచూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆ భాగం తేమగా, మృదువుగానూ మారుతుంది.

చంకల కింద అవాంఛిత రోమాల్ని ఎప్పటిప్పుడు తొలగించుకోవడం మంచిది. తద్వారా ఆ భాగంలో బ్యాక్టీరియా పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే వెంట్రుకలు పెరిగిన దిశలోనే షేవ్‌ చేసుకోవడం మర్చిపోవద్దు.

సాధారణంగా చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి మర్దన చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని రకాల రోలర్స్‌ ఉపయోగిస్తుంటాం. చంకల కింద కూడా ఇదే పద్ధతిని పాటించచ్చంటున్నారు నిపుణులు. తద్వారా ఆ భాగంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగి.. మృదువుగా మారుతుందంటున్నారు.

చంకల కింద భాగం నిర్లక్ష్యం చేయడం వల్ల.. అక్కడ మృతకణాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిని తొలగించుకోవాలంటే లూఫా చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో స్నానం చేసేటప్పుడు చర్మాన్ని లూఫాతో ఎలాగైతే రుద్దుకుంటామో.. అదే విధంగా చంకల్నీ రోజూ శుభ్రం చేసుకోవడం మంచిది.

మన సాధారణ చర్మ ఛాయతో పోల్చితే చంకల కింద చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకొని ఆ భాగాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చాలంటే.. పాలు-శెనగపిండి, చక్కెర-నిమ్మరసం, కలబంద గుజ్జు.. వంటి పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్స్‌ని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది.

ఈ వేసవిలో చెమట వల్ల కూడా ఆ భాగంలో పలు చర్మ సమస్యలు తలెత్తుంటాయి. కాబట్టి విపరీతమైన చెమట సమస్య ఉన్న వారు.. వాడి పడేసే ‘అండర్‌ ఆర్మ్‌ స్వెట్‌ ప్యాడ్స్‌’ని ఉపయోగించడం మంచిది. ఇవి చెమటను పీల్చుకొని ఆ భాగాన్ని పొడిగా ఉంచుతాయి.

ఈ కాలంలో చెమట వాసన రాకుండా ఉండడానికి చంకల కింద పెర్‌ఫ్యూమ్స్‌ స్ప్రే చేసుకోవడం తెలిసిందే! అయితే కొంతమంది మరీ ఎక్కువగా వీటిని వాడుతుంటారు. తద్వారా వాటిలోని రసాయనాలు అక్కడి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి తక్కువ మొత్తంలో.. అది కూడా పారాబెన్స్‌, థాలేట్స్‌, సల్ఫేట్స్‌.. వంటి రసాయనాలు లేనివి ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

సాధారణ చర్మంపై చేరిన మలినాల్ని తొలగించుకోవడానికి ప్యాక్స్‌/మాస్కులు ఎలాగైతే వాడుతుంటామో.. చంకల్నీ అదే విధంగా వారానికోసారి డీటాక్స్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టి, రెండు టీస్పూన్ల నీళ్లు, ఒక టీస్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌.. ఈ మూడు పదార్థాలు కలిపి తయారుచేసిన మాస్క్‌ని ఆ భాగంలో అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా చంకల కింద చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని