Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?

రక్షా బంధన్‌ అంటే.. రక్షణనిచ్చే అనుబంధం అని అర్థం! సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్ష కడుతుంది. అదేవిధంగా సోదరికి నిరంతరం రక్షగా ఉంటానని సోదరుడు బాసటగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండగ రోజున ఎటు చూసినా వాళ్ల హడావిడే కనిపిస్తుంది.

Published : 30 Aug 2023 15:31 IST

రక్షా బంధన్‌ అంటే.. రక్షణనిచ్చే అనుబంధం అని అర్థం! సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్ష కడుతుంది. అదేవిధంగా సోదరికి నిరంతరం రక్షగా ఉంటానని సోదరుడు బాసటగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండగ రోజున ఎటు చూసినా వాళ్ల హడావిడే కనిపిస్తుంది. అయితే ఇదే రాఖీ పౌర్ణమి రోజున సోదరుడిని పక్కన పెట్టి.. ఇతర కుటుంబ సభ్యులకు రాఖీ కట్టే సంప్రదాయం కూడా మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం! మరి, ఇంతకీ అదెక్కడ? అక్కచెల్లెళ్లు సోదరుడిని కాదని ఇంకెవరికి రాఖీ కడతారు? ఎందుకిలా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

వదినమ్మకు ‘రక్షా’బంధనం!

అన్నా వదినలంటే తల్లిదండ్రులతో సమానంగా భావిస్తుంటారు అక్కచెల్లెళ్లు. తాము తీసుకునే నిర్ణయంలో, వేసే ప్రతి అడుగులోనూ వాళ్ల సలహా తీసుకుంటారు. ముఖ్యంగా అన్న అర్ధాంగిగా తమ ఇంట్లో అడుగుపెట్టిన వదినకు ఇంటి పెత్తనమంతా అప్పగిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ ఇంటి గృహలక్ష్మి అయిన వదినమ్మకు అత్యంత ప్రాధాన్యమిస్తుంటారు రాజస్థాన్‌ సోదరీమణులు. అందుకే రక్షా బంధన్‌ పర్వదినాన తమ వదిన చేతికి రక్ష కడతారు. ఈ క్రమంలో తమతో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని, ఇంటిని క్షేమంగా, సురక్షితంగా చూసుకోవాలని కోరతారు. ఇందుకోసం ‘లుంబా రాఖీ’ పేరుతో తయారైన ప్రత్యేకమైన రాఖీల్ని కొనుగోలు చేస్తారు. వీటిని కూడా మణికట్టుకు కాకుండా.. గాజులకు వేలాడేలా ‘కలిరా’ మాదిరిగా రక్ష కడతారు. ఇక ఈ కాలపు అక్కచెల్లెళ్ల అభిరుచులకు తగినట్లుగా ఈ లుంబా రాఖీల్లోనూ.. ఆకర్షణీయమైన రంగులు, మెరుపులు, సీక్విన్, రాళ్లు, బ్రేస్‌లెట్, బీడెడ్, జుంకా స్టైల్, కుందన్‌ స్టైల్.. ఇలా విభిన్న రకాల్లో లభిస్తున్నాయి. వాటిలో నచ్చినవి ఎంచుకొని వదినమ్మ మనసు దోచుకుంటున్నారు రాజస్థాన్‌ ఆడపడచులు.

శ్రీవారికి ప్రేమతో.. ‘బంధనం’!

పెళ్లయ్యాక అమ్మాయిలు భర్త, అత్తింటివారితో అనుబంధం పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే పండగలప్పుడు ఆడపడుచులు పుట్టింటికి రావడం, ముఖ్యంగా రక్షా బంధన్‌ రోజున తమ అన్నదమ్ములకు రాఖీ కట్టడం మన ఇళ్లలో సర్వసాధారణమే! అయితే కొన్ని రాష్ట్రాల్లో సోదరుడితో పాటు తమ భర్తకూ రాఖీ కట్టే ఆచారం ఉందట! మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది మహిళలు తమ శ్రీవారికి కూడా రాఖీ కట్టడం మనం చూస్తుంటాం. అయితే అసలు రాఖీ పండగ ప్రారంభమైందే భార్యాభర్తలతో అన్న విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో దేవతల రాజు ఇంద్రుడు ఓడిపోతాడు. ఓటమి భయంతో ఉన్న దేవేంద్రుడికి తన భార్య శచీదేవి పూజలో ఉంచిన రక్ష కట్టి తన విజయాన్ని కాంక్షిస్తుంది. ఆపై తిరిగి యుద్ధానికి వెళ్లి విజయం సాధించి.. ముల్లోకాలనూ ఏలుతాడు ఇంద్రుడు. ఇలా ఇంద్రుడు-శచీదేవితో ప్రారంభమైన ఈ పండగ క్రమంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ప్రత్యేకంగా మారిపోయింది.

ఇదే ఆచారాన్ని పాటిస్తూ.. కొందరు మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షించి రక్ష కడితే.. భర్తలు తమ భార్యలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటామని బాస చేయడమే ఈ సంప్రదాయంలోని పరమార్థం.

‘జంగిల్‌’ రక్షా బంధన్!

సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీ పండగ రోజున మన అన్నదమ్ములకు, ఇతర కుటుంబ సభ్యులకే కాదు.. పచ్చని ప్రకృతికీ రక్ష కట్టే సంప్రదాయం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉంది. మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ పచ్చని తల్లిని సురక్షితంగా ఉంచుకోవడం మన కనీస ధర్మం. ఈ ఆలోచనతోనే అక్కడి ప్రజలు రాఖీ పౌర్ణమి రోజున దగ్గర్లోని అడవి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి.. చెట్లు, మహావృక్షాల కొమ్మలు, కాండాలకు రక్ష కడుతుంటారు. దీన్ని ‘జంగిల్‌ రక్షా బంధన్‌’గా పిలుస్తారు. ఈ ఆచారం 2004 నుంచే ప్రారంభమైందని, పర్యావరణ పరిరక్షణను తాము పాటించడంతో పాటు దీని ప్రాముఖ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకూ చాటిచెప్పాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ పండగను ఏటా జరుపుకొంటున్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు.

ఇవనే కాదు.. చాలాచోట్ల అక్కచెల్లెళ్లు, తల్లీకూతుళ్లు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్లు, తండ్రీకొడుకులు.. కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఏదేమైనా.. రాఖీ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకే పరిమితం కాకుండా.. ప్రతి అనుబంధంలోని ప్రేమానురాగాల్ని, ఆప్యాయతల్ని చాటే అందాల లోగిలి అని చెప్పడంలో సందేహం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని