Published : 06/03/2023 00:15 IST

మహిళలకే జ్ఞాపకశక్తి ఎక్కువట

నా కళ్లద్దాలెక్కడున్నాయ్‌ అంటూ భర్త అరుపు, అమ్మా నా హోంవర్క్‌ పుస్తకం ఎక్కడుంది అని చింటూ కేకలు. పొయ్యిపై వంట చేస్తూనే ఇంట్లో అందరి అవసరాలు, వస్తువులనూ గుర్తుపెట్టుకొని మరీ అందిస్తుంది మహిళ. ఒకేసారి నాలుగైదు పనులను బాధ్యతగా పూర్తిచేయగల సామర్థ్యమూ మనదే అని చాలా అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. తాజా సర్వేలో జ్ఞాపకశక్తిలోనూ మగవారికన్నా మహిళలే ముందని తేలింది.

పురుషులకన్నా ఆడవారే ఎక్కువ పదాలను గుర్తు పెట్టుకుంటారట. బెర్జెన్‌ నార్వే విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘మెటా- అనాలిసిస్‌’ పేరుతో అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 3,50,000 మంది శాస్త్రవేత్తల పీహెచ్‌డీ, మాస్టర్‌ థీసిస్‌, సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయనాలను విశ్లేషించారు. ఈ మెటా- అనాలిసిస్‌లో దాదాపు 500 రకాల కొలమానాలను తీసుకొని పరిశీలించగా మగవారి నివేదికల్లో కన్నా మహిళా శాస్త్రవేత్తల థీసిస్‌ నివేదికల్లో ఎక్కువ మహిళా ప్రయోజనాలను తీసుకొని పరిశోధన చేపట్టి వాటి గురించి పొందుపరచడం గుర్తించారు. మేధో సంబంధిత నైపుణ్యాలు, పనితీరును గమనిస్తే మగవారికి, మహిళలకు మధ్య గణనీయమైన తేడా కనిపించింది. కొన్నిరకాల అంశాల్లో చేసిన పరిశోధనలను పరిశీలించగా ఇరువురిలో మహిళా శాస్త్రవేత్తలు ఎక్కువ ఛాలెంజ్‌గా పనిచేసినట్లు తేలింది. ఎక్కువ అంశాలు, పదాలు గుర్తించడంలోనే కాకుండా, వాటిని మరవకుండా పొందుపరచడంలోనూ.. మెరుగైన జ్ఞాపకశక్తి ప్రదర్శించడంలోనూ మహిళలే ముందు ఉన్నట్లు ఈ సర్వే తేల్చి చెప్పింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని