మోడల్‌గా లిటిల్‌ తెందూల్కర్‌!

తల్లిదండ్రుల పేరుప్రఖ్యాతులతో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలని ఆరాటపడుతుంటారు కొందరు సెలబ్రిటీ కిడ్స్‌. తమకు ఆసక్తి ఉన్న రంగంలో

Updated : 10 Dec 2021 20:17 IST


(Photo: instagram)

తల్లిదండ్రుల పేరుప్రఖ్యాతులతో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలని ఆరాటపడుతుంటారు కొందరు సెలబ్రిటీ కిడ్స్‌. తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించి అందరి మెప్పూ పొందుతారు.. ఇటు పేరెంట్స్‌ గర్వపడేలా చేస్తారు. ప్రస్తుతం మన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ముద్దుల కూతురు సారా తెందూల్కర్‌ కూడా ఇదే చేసింది. అందం, అంతకుమించిన క్యూట్‌ స్మైల్‌తో కుర్రకారును కట్టిపడేసే ఈ బ్యూటీ.. ఒక్కసారిగా మోడల్‌గా దర్శనమిచ్చేసరికి ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. అవును.. తాజాగా సారా తెందూల్కర్‌ ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌కి మోడల్‌గా వ్యవహరించి ఈ రంగంలోకి కాలుమోపింది. దీంతో బాలీవుడ్‌లోకి రావడానికి తను ఇలా సంకేతమిచ్చిందని ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. మరి, ఇంతకీ బాలీవుడ్‌పై సారాకు ఆసక్తి ఉందా? అసలు తను భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటోంది? ఈ లిటిల్‌ తెందూల్కర్‌ లైఫ్‌స్టైల్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూతురు సారా తెందూల్కర్‌ గురించి తెలియని వారుండరు. తన అందం, క్యూట్‌ స్మైల్‌, చక్కటి డ్రస్సింగ్‌ సెన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఫిదా చేసే ఈ సెలబ్రిటీ కిడ్‌.. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటుంది. తల్లిదండ్రులు, తమ్ముడితో దిగిన ఫొటోలు, ఫ్రెండ్స్‌తో చేసిన సందడిని ఇన్‌స్టా ద్వారా తరచూ పంచుకుంటుంటుంది. నిజానికి కెమెరాకు చాలా దూరంలో ఉండే ఆమె.. ఉన్నట్లుండి మోడల్‌గా ప్రత్యక్షమయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తిని ఇలా బయటపెట్టిందేమో అనుకుంటున్నారు.

గ్రీకు దేవత!

‘అజియో లక్సే’ అనేది అంతర్జాతీయ క్లాతింగ్‌ బ్రాండ్‌. ఇది ఇండియాలో ఈ-కామర్స్‌ వేదికగా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. దీని ప్రమోషన్‌లో భాగంగా నటి బాంటియా సంధు, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్‌ తానియా ష్రాఫ్‌తో కలిసి మోడల్‌గా దర్శనమిచ్చింది సారా. ఇక ఈ ఫొటోషూట్‌ (Self-Portrait Ad) కోసం క్యామెల్‌ రంగుతో రూపొందించిన Crepe Dress ధరించి మోడళ్లనే తలదన్నేంత అందంగా కనిపించిందీ ప్రిన్సెస్‌. ఇలా సారాను మోడల్‌గా చూసిన అభిమానులు ‘అచ్చం గ్రీకు దేవత’లా ఉందంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కెరీర్‌లో మరింతగా రాణించాలని ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతున్నారు.


‘సారా’ పేరు అలా!

సచిన్‌కు క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో ఆయన ట్రాక్‌ రికార్డు చూస్తే అర్థమవుతుంది. ఇదే ప్రేమను తన ముద్దుల కూతురికి సారా అని పేరు పెట్టే విషయంలోనూ కనపరిచాడీ క్రికెట్‌ గాడ్‌. 1997లో సచిన్‌ సారథ్యంలో ఇండియా ‘సహారా కప్‌’ గెలుచుకుంది. అప్పుడు తను జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే అదే ఏడాది తన కూతురు కూడా పుట్టడంతో.. సహారా పేరు మీదుగా ఆమెకు సారా అని పేరు పెట్టుకున్నాడట సచిన్‌.


చదువుల తల్లి..!

సాధారణంగా డబ్బెక్కువగా ఉన్న వాళ్లు, సెలబ్రిటీల పిల్లలు చదువులో వెనకబడి ఉంటారనేది చాలామంది అభిప్రాయం. కానీ సారా ఇందుకు భిన్నం. చదువు, క్రమశిక్షణ వంటి అంశాల్లో ఆమె తన తండ్రినే మించిపోయిందని సన్నిహితులు చెబుతుంటారు.


నటిని కాను.. కానీ!

మోడల్‌గా సారా కెమెరా ముందుకొచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు.. తను బాలీవుడ్‌లోకి రావడానికి ఇలా సంకేతమిచ్చిందేమో అనుకున్నారు. ఇలా ఇప్పుడే కాదు.. గతంలోనూ ఈ బ్యూటీ షాహిద్‌తో కలిసి ఓ సినిమా చేయబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటన్నింటికీ తెర దించుతూ.. తనకు వెండితెరపై అడుగుపెట్టేందుకు ఆసక్తి లేదంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. కెరీర్‌ విషయంలో తనకు తన తల్లే స్ఫూర్తి అని, ఆమెలాగే డాక్టర్‌ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నానంటోంది సారా. ప్రస్తుతం లండన్‌ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తోందీ క్యూటీ.


షాంపెయిన్‌ బాటిల్‌ స్టోరీ తెలుసా?

అందరమ్మాయిల్లాగే సారా కూడా నాన్న కూచేనట! తన తండ్రితో కలిసి గడిపిన క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే అంటోందీ బ్యూటీ. ఇక తమ మధ్య ఉన్న అనుబంధానికి షాంపెయిన్‌ బాటిల్‌ కథే నిదర్శనం అంటాడు సచిన్‌. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..
సచిన్‌ క్రికెట్‌ కెరీర్‌లోకి అడుగుపెట్టే సమయంలో తెలిసిన వారు తనకు బహుమతి కింద ఓ షాంపెయిన్‌ బాటిల్‌ ఇచ్చారట! అయితే తనకు 18 ఏళ్లు నిండని కారణంగా ఆ బాటిల్‌ని ఓపెన్‌ చేయలేదట సచిన్‌. ఇక దాన్ని అలాగే పోస్ట్‌పోన్‌ చేస్తూ చేస్తూ.. సారాకు 18 ఏళ్లు నిండినప్పుడు ఆ బాటిల్‌ని ఓపెన్‌ చేసినట్లు ఓ సందర్భంలో సరదాగా చెప్పుకొచ్చాడీ గ్రేట్‌ క్రికెటర్‌. తన వ్యక్తిగత జీవితంలోని అద్భుతమైన క్షణాల్లో ఇదీ ఒకటని అంటాడీ సూపర్‌ డ్యాడ్‌.
'


తనే నా క్రష్‌!

ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరిపై క్రష్‌ ఉండడం సహజం. మరి, ఈ ప్రశ్న సారాకు వేస్తే వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రణ్‌వీర్‌ సింగ్‌. ఈ హ్యాండ్‌సమ్‌కు సారా వీరాభిమానట! రణ్‌వీర్‌ సినిమాల్ని ఒక్కటీ మిస్సవకుండా.. అదీ థియేటర్‌లోనే చూస్తానంటోందీ లిటిల్‌ తెందూల్కర్‌. ఇక రణ్‌వీర్‌ సినిమాల్లో ‘బాజీరావ్‌ మస్తానీ’ తన ఫేవరెట్‌ మూవీనట!


జిమ్‌ గర్ల్‌!

చిన్నతనం నుంచీ చక్కటి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరిగానని, ఇదే తనకు ఉత్తమ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసిందని చెబుతుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే రోజూ వర్కవుట్లు చేయడం అస్సలు మాననంటోంది. వీటికి సంబంధించిన ఫొటోల్ని సైతం ఇన్‌స్టాలో పంచుకుంటుంటుంది.


అందం-అణకువ!

ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లడమన్నా, అందంగా ముస్తాబవడమన్నా, విహారయాత్రల్ని ఆస్వాదించడమన్నా ఈ లిటిల్‌ ప్రిన్సెస్‌కు విపరీతమైన మక్కువట! అయితే ఎక్కడికెళ్లినా చక్కటి డ్రస్సింగ్‌ సెన్స్‌తో ఆకట్టుకుంటుంది సారా.


తను లేని నేను లేను!

సారాకు తన తమ్ముడు అర్జున్‌ అంటే ప్రాణం. అర్జునే తన సగ ప్రాణమని, అతడు లేని తను అసంపూర్ణమని.. ఇలా సోదరుడిపై ఉన్న ప్రేమను ఇన్‌స్టా పోస్ట్‌ల రూపంలో పంచుకుంటుందీ బ్యూటిఫుల్‌ సిస్టర్‌.


అమ్మమ్మతో అనుబంధం!

సారాకు వాళ్ల అమ్మమ్మతో ఎంతటి ప్రత్యేకమైన అనుబంధం ఉందో ఆమె పెట్టే పోస్టులే నిరూపిస్తాయి. అందుకే ఆమెను Partner in crime గా పేర్కొంటుందీ లిటిల్‌ బ్యూటీ.
మరి, సారా తను అనుకున్న రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్‌ సాధించాలని మనమూ మనసారా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ లిటిల్‌ తెందూల్కర్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్