Updated : 08/08/2022 18:43 IST

Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!

‘మాటివ్వడం, దాన్ని నిలబెట్టుకోవడం విజేతల లక్షణం’ అంటుంటారు. ఈ విషయం మరోసారి రుజువు చేసింది తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌. కామన్వెల్త్‌ క్రీడల్లో తాజాగా పసిడి కొల్లగొట్టిన ఆమె.. ఆ పతకాన్ని తన తల్లికి పుట్టిన రోజు కానుకగా అందించి మురిసిపోయింది. అంతేనా.. ఈ టోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే బంగారు పతకం గెలుచుకోవడం మరో విశేషం. ఆడపిల్లగా, ముస్లిం యువతిగా ఈ ఆటను ఎంచుకున్న దగ్గర్నుంచీ ఈ సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొని తానీ స్థాయికి చేరిందంటే అందుకు కారణం.. ఆమె పట్టుదల, కృషి, సంయమనమే అని చెప్పచ్చు. బాక్సింగ్‌లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరే యువతులకు స్ఫూర్తిగా నిలవడమే తన కల అంటోన్న ఈ పంచింగ్‌ క్వీన్‌.. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా తానెదుర్కొన్న ఆటుపోట్ల గురించి పలు సందర్భాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం..

నాన్న స్నేహితుడి ఆలోచనతో..!

నాకు చిన్నప్పట్నుంచి ఆటలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ గ్రౌండ్‌కు అథ్లెటిక్స్‌ సాధన కోసం వెళ్లేదాన్ని. ఓ రోజు మా నాన్న ఫ్రెండ్‌ నా ప్రాక్టీస్‌ను దగ్గర్నుంచి గమనించారు. ‘నిఖత్‌ను బాక్సింగ్‌ శిక్షణలో చేర్పించు.. ఏడాది తిరిగే లోగా తనను జాతీయ క్రీడాకారిణిగా తయారుచేస్తా..’ అంటూ ఆయన నాన్నతో చెప్పారు. ఇలా 2009లో (13 ఏళ్ల వయసులో) నా బాక్సింగ్‌ ప్రయాణం ప్రారంభమైంది. నిజానికి మనం ఎంచుకున్న ఏ జర్నీ కూడా అంత సాఫీగా సాగదు. నా బాక్సింగ్‌ ప్రయాణం కూడా అంతే! చాలామంది ‘బాక్సింగా? మగాళ్ల ఆట ఆడతావా?’ అంటూ నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. కొంతమంది సంప్రదాయ వాదులు ‘ముస్లిం అమ్మాయిలు పరదా చాటుకే పరిమితం కావాలి. చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం.. వాళ్లకు తెలిసిన లోకాలివే!’ అంటూ ఉచిత సలహాలిచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్న నావైపే నిలిచారు. ‘అవన్నీ పట్టించుకోకు.. నీపై నువ్వు నమ్మకముంచు! ఎందుకంటే ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు..’ అంటూ ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించారు.

చాలా మొండిదాన్ని!

అది బలమో, బలహీనతో తెలియదు కానీ.. నేను చిన్నతనం నుంచి చాలా మొండిదాన్ని. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఎక్కువ! పంచ్‌ అయినా, మాటైనా స్వీకరించడం నాకు అలవాటు లేదు. నా ప్రతిభతోనే దాన్ని తిప్పి కొట్టాలని అనుకునేదాన్ని. అయితే నేను బాక్సింగ్‌ సాధన మొదలుపెట్టిన తొలినాళ్లలో నేనొక్కదాన్నే అమ్మాయిని.. అందరూ అబ్బాయిలే ఉండేవారు. దాంతో వాళ్లతోనే పోటీ పడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే వాళ్లిచ్చిన పంచ్‌ని తిరిగిచ్చే సమయం కోసం వేచి చూసేదాన్ని. అంతేకానీ.. ఆటలో రాణించలేకపోతున్నానన్న అభద్రతా భావం ఎప్పుడూ నా దరి చేరనివ్వలేదు. ఈ పట్టుదల, పాజిటివిటీనే నన్ను ఈ స్థాయికి చేర్చాయనిపిస్తుంది.

సమయం కోసం వేచి చూశా!

అమెరికన్‌ బాక్సర్‌ ముహమ్మద్‌ అలీ నా స్ఫూర్తి. మేరీకోమ్‌నూ అంతగానే ఆరాధించా. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆమె ఒలింపిక్‌ పతకం గెలిచాకే మన దేశంలో మహిళల బాక్సింగ్‌కు ఆదరణ పెరిగిందని చెప్పచ్చు. అయితే ఒకానొక దశలో పలు వివాదాలు నా ఏకాగ్రతకు కాస్త భంగం కలిగించే ప్రయత్నం చేశాయి. నాలో ప్రతిభ ఉన్నా ఆ సమయంలో రిఫరీలు, జడ్జిలు, సెలక్టర్లు.. నాకు మొండిచేయి చూపించారు. అయినా సమయం కాదని మిన్నకుండిపోయా. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని, నా సత్తా ఏంటో నిరూపించేలా చేస్తుందని సమయం కోసం వేచి చూశా. ఒక్కోసారి ఆలోచిస్తే.. ఈ వివాదాలన్నీ నా మంచికే జరిగాయేమో అనిపిస్తుంది. వీటి మూలంగానే నేను మానసికంగా మరింత దృఢమయ్యా. ఆటపై మరింత పట్టు బిగించా.

ఒలింపిక్‌ పతకం.. పోలీసు ఉద్యోగం!

నాన్న నన్ను ఈ క్రీడలో ఎంతగా వెన్నుతట్టారో.. నా భవిష్యత్తు గురించి అమ్మ అంతకంటే ఎక్కువగా ఆందోళన పడింది. అందరూ అనే మాటలు విని నన్నెవరూ పెళ్లి చేసుకోరేమోనని భయపడేది. అప్పుడు అమ్మకు నేనే సర్ది చెప్పేదాన్ని. ‘ఒక్కసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలవనివ్వు.. అబ్బాయిలే నా వెనకాల క్యూ కడతారు!’ అంటూ అమ్మ కళ్లలో ఆనందం నింపేదాన్ని. నిజానికి పెళ్లి నా జీవితాశయం కాదు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గడమే నా చిరకాల కోరిక. ఎలాగైనా దాన్ని సాధించి తీరతా. బాక్సింగ్‌ కాకుండా ఇంకే లక్ష్యాలు లేవా అని అడిగితే.. ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నా. తద్వారా మా జిల్లాలో బాక్సింగ్‌ని మరింత ప్రోత్సహించాలనుకుంటున్నా.

అమ్మా.. పతకంతో వచ్చేస్తున్నా!

ఈ ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టా. అందులో పసిడి పతకం గెలిచి పుట్టినరోజు కానుకగా ఇస్తానని అమ్మకు మాటిచ్చా. అనుకున్నట్లుగానే మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరోవైపు భారతీయులూ నాపై పసిడి ఆశలు పెట్టుకొని ఉంటారు.. వాళ్ల కోరిక తీర్చినందుకు గర్వంగా ఉంది. విజయానంతరం జాతీయ గీతాలాపన చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌ అయ్యా. ఇక ఎప్పుడెప్పుడు ప్రధాని మోదీని కలుస్తానా అన్న ఆతృత ఉంది.. ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచినప్పుడు నా టీషర్ట్‌పై మోదీజీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా.. ఇప్పుడు బాక్సింగ్‌ గ్లోవ్స్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నా. ఇక ఈ టోర్నీ కోసం రెండు కిలోలు తగ్గిన నేను.. ఈ క్రమంలో నాకిష్టమైన ఐస్‌క్రీమ్‌ కూడా పక్కనపెట్టా.. ఇప్పుడు దాని రుచిని ఆస్వాదిస్తా.

స్వీయ నమ్మకంతో ఏదైనా సాధించచ్చు!

‘మహిళలే సాటి మహిళల్ని చైతన్యవంతుల్ని చేయగలరు’ అంటుంటారు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. ఈ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్న అనుభవంతో ఒక్క మాట చెప్తాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని పసిగట్టడమే కాదు.. స్వీయ నమ్మకంతో ముందుకు సాగాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. నన్నడిగితే.. ప్రతి మహిళా బాక్సింగ్‌ నేర్చుకోవడం అవసరమని చెప్తా. ఎందుకంటే అది క్రీడ మాత్రమే కాదు.. ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆయుధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని