Upasana: ప్రేమలో పడితే సరిపోదు.. దాన్ని రోజురోజుకీ పెంచుకోవాలి!

పెళ్లై ఏడాది కాగానే ప్రతి జంటకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?’ అని! సామాన్యులకే కాదు.. కెమెరా ముందు సెలబ్రిటీలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే సమాజం ఒత్తిళ్లకు తలొగ్గకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ నిర్ణయం....

Updated : 15 Apr 2024 12:37 IST

(Photos: Instagram)

పెళ్లై ఏడాది కాగానే ప్రతి జంటకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?’ అని! సామాన్యులకే కాదు.. కెమెరా ముందు సెలబ్రిటీలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే సమాజం ఒత్తిళ్లకు తలొగ్గకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు రామ్‌చరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన. తమ పదేళ్ల వైవాహిక జీవితంలో పలుమార్లు ఇదే ప్రశ్నను ఎదుర్కొన్న ఆమె.. పిల్లల విషయంలో ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి కారణమేంటో ఇటీవలే ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అయిన ఉపాసన.. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా.. తాము కోరుకున్నప్పుడు తల్లిదండ్రులమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇదనే కాదు.. ప్రతి విషయంలో ఒకరినొకరు జడ్జ్‌ చేసుకునే సమాజంలో జీవిస్తోన్న మనకు.. సొంత ఆలోచనలు, నిర్ణయాలు ఉండాలంటున్నారు. తాజాగా ఉపాసన సీమంతాన్ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో మిసెస్‌ చెర్రీ తన ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే..!

అభిరుచులు కలిశాయి!

నేను, రామ్‌ కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలుసుకున్నాం. మేమిద్దరం ప్రాక్టికల్‌ వ్యక్తులం. ప్రతిదీ ప్రయోగాత్మకంగా ఆలోచిస్తుంటాం. ప్రతి రోజూ తన గురించి నేను, నా గురించి తను ఓ కొత్త విషయం తెలుసుకుంటాం. వివిధ రకాలుగా ఒకరినొకరు ప్రశంసించుకుంటాం. అనుబంధాన్ని దృఢం చేసుకోవాలంటే కొన్నిసార్లు రాజీ పడకా తప్పదు. ఇక ఇద్దరి అభిరుచులు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇద్దరికీ సఫారీ అంటే ఇష్టం. వన్యప్రాణి సంరక్షణపై ఆసక్తి చూపుతాం. కలిసి సరదా పనులు చేయడానికి ఇష్టపడతాం. పని విషయంలోనే కాదు.. ఆలోచనల్లోనూ ఒకరికొకరం సవాళ్లు విసురుకుంటాం. ప్రతిదీ సానుకూలంగా ఆలోచిస్తాం. ‘ప్రేమలో పడితే సరిపోదు.. దాన్ని రోజురోజుకీ పెంచుకుంటూ పోవాలి..’ మా రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ ఇదే! ఇటీవలే బేబీమూన్‌ కోసం వేల్స్‌ వెళ్లొచ్చాం. ఇక రామ్‌కు సెలబ్రేషన్స్‌ అంటే నచ్చవు.. చాలా సింపుల్‌గా ఉంటాడు. తనలో ఆ సింప్లిసిటీనే ప్రతిసారీ నన్ను కట్టిపడేస్తుంటుంది.

సక్సెస్‌ సీక్రెట్‌ అదే!

ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా భార్యాభర్తలిద్దరి సక్సెస్‌ వెనుక ఒకరి తోడు మరొకరికి అవసరం. ప్రతి విషయంలో మేమిద్దరం ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం.. ప్రతి క్షణం ఒకరికొకరం తోడుగా నిలుస్తుంటాం. ఉక్రెయిన్‌లో నాటు-నాటు షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నేను రామ్‌తో పాటు సెట్స్‌లో ఉన్నాను. నిజానికి ఆ సమయంలో తన ఒత్తిడిని దూరం చేయడానికి తన వెంటే నిలిచా. అలాగే నా ప్రతి సక్సెస్‌లో తన పాత్రా కీలకమే! ఒక్కమాటలో చెప్పాలంటే.. చెర్రీ నా గైడ్‌. తనతో గడిపిన ప్రతి సందర్భం నాకు ప్రత్యేకమే!

అది మా ఇద్దరి నిర్ణయం!

మనకు సంబంధించిన విషయాల్లో మనకంటే ఎక్కువ ఆతృత ఈ సమాజానికే ఉంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు.. లేదంటే మరేదైనా వ్యక్తిగత విషయం కావచ్చు. అన్నీ తమకు నచ్చినట్లుగా, తాము కోరుకున్నట్లుగా జరగాలనుకునే వారు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. కానీ నాకు అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే.. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా.. మేము కోరుకున్నప్పుడు తల్లిదండ్రులమవుతున్నందుకు నేను, చెర్రీ చాలా ఆనందంగా ఉన్నాం. ఇద్దరం కలిసి తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటి. మా పదేళ్ల వైవాహిక జీవితంలో పిల్లల్ని ఆహ్వానించడానికి ఇదే సరైన సమయమనిపించింది. ఎందుకంటే ఇద్దరం మా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నాం. ఆర్థికంగానూ ఎదిగాం.. కాబట్టి మాకు పుట్టబోయే పిల్లల్ని బాగా చూసుకుంటామన్న పూర్తి నమ్మకం కలిగాకే ఈ నిర్ణయం తీసుకున్నాం.

అందంగా లేనన్నారు!

ఈ సమాజంలో ఒకరిని మరొకరు జడ్జ్‌ చేయడం కామన్‌. శరీరాకృతి విషయంలో కావచ్చు, కుటుంబ నేపథ్యపరంగా కావచ్చు, సౌందర్యం విషయంలో కావచ్చు.. ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకర్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. అలాంటి విమర్శల్ని నేనూ ఎదుర్కొన్నా. నా పెళ్లి సమయంలో.. నేను అందంగా లేనని, బొద్దుగా ఉన్నానని, డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని.. అన్న వారూ లేకపోలేదు. అలాగని నేను వాళ్లని నిందించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్లకు నా గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఈ పదేళ్లలో వాళ్లు నన్ను బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఇక ఇప్పుడు అలాంటి విమర్శలు విన్నా పట్టించుకోవడం మానేశా.

మనకేం కావాలో ముఖ్యం!

సమాజాన్ని, కుటుంబాన్ని చక్కదిద్దే మహిళలు తమకేం కావాలో తెలుసుకోవడంపై అంతగా దృష్టి పెట్టరు. కానీ మన అవసరాలు తెలుసుకుంటూ, ఆలోచనలపై దృష్టి పెట్టడమూ ముఖ్యమే! వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చాలామంది మహిళలకు కష్టతరమే! కానీ మనకంటూ కొన్ని లక్ష్యాల్ని ఏర్పరచుకొని, ప్రాధాన్యతల్ని బట్టి ముందుకు సాగితే ఈ సమతుల్యత సాధించడం కష్టమేమీ కాదన్నది నా భావన. అలాగే మనం పెరిగిన వాతావరణం ప్రభావం కూడా దీనిపై ఉంటుంది. నేను మా గ్రాండ్‌పేరెంట్స్‌ ఇంట్లో పెరిగాను. వ్యక్తిగతంగా, కెరీర్‌ విషయంలో వాళ్ల ప్రభావం నాపై చాలానే ఉంది. అలాగే ప్రతి మహిళకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం. డబ్బు సంపాదించడమే కాదు.. దానిని మేనేజ్‌ చేయడమూ తెలిసుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్