Published : 25/09/2021 19:58 IST

ఇష్టంతో చదివాం.. ర్యాంకులు కొల్లగొట్టాం!

ఐపీఎస్‌... ఐఏఎస్‌... ఐఎఫ్‌ఎస్‌ వంటి దేశ అత్యున్నత ఉద్యోగాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలని యువతలో చాలామందికి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాల కోసం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభమేమీ కాదు.  తమ కలలు నెరవేర్చుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడి మరీ సన్నద్ధమవుతుంటారు. ఈ క్రమంలో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2020 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. వాటిలో అమ్మాయిలు తమ సత్తాచాటారు. ఆలిండియా రెండు, మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన కొంతమంది అమ్మాయిల గురించి తెలుసుకుందాం రండి.

టాప్‌-20లో 10మంది!

ఎప్పటిలాగే సివిల్‌ సర్వీసెస్‌-2020 ఫలితాల్లోనూ అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు ఆలిండియా ర్యాంకులు సాధించారు. ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌ పూర్తి చేసిన శుభం కుమార్‌ ఆలిండియా మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా, భోపాల్‌ నిట్‌ నుంచి ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్ పూర్తిచేసిన జాగృతి అవస్థి రెండో స్థానం సొంతం చేసుకుంది. ఆగ్రాకు చెందిన అంకితా జైన్‌ మూడు, దిల్లీకి చెందిన మమతా యాదవ్‌ ఐదో ర్యాంకులు దక్కించుకున్నారు. వీరితో పాటు టాప్‌ -20 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం.

‘భెల్‌’లో ఉద్యోగం వదిలేసి!

ఈ ఫలితాల్లో భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఆలిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. అదేవిధంగా మహిళల విభాగంలో ఆలిండియా మొదటి ర్యాంకును దక్కించుకుంది. జాగృతి 2017లో భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఆ వెంటనే ‘భెల్‌’లో ఉద్యోగంలో చేరింది. రెండేళ్ల పాటు జాబ్‌ చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమైంది. కానీ 2019లో మొదటిసారి ప్రయత్నించినప్పుడు సఫలం కాలేకపోయింది. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి ప్రిపరేషన్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది.

10-12 గంటలు చదివాను!

‘మొదటిసారి పరీక్ష రాసినప్పుడు ప్రిలిమ్స్‌ను కూడా దాటలేకపోయాను. దీంతో నిరుత్సాహానికి గురయ్యాను. అయితే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ప్రిపరేషన్‌కు మరింత సమయం కేటాయించాలనుకున్నాను. అందుకే భెల్‌లో ఉద్యోగాన్ని వదిలేశాను. అయితే అంత మంచి ఉద్యోగం వదులుకుని రిస్క్‌ చేస్తున్నావని చాలామంది నాతో అన్నారు. కానీ కలెక్టర్‌ అవ్వాలన్నది నా చిన్ననాటి కల. అందుకే రిస్క్‌ అనిపించినా నా మనసు మాటే విన్నాను. 2019లో ఉద్యోగం వదిలేసిన తర్వాత దిల్లీకి వెళ్లి ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరాను. కానీ కరోనా రావడంతో మూడు నెలలకే ఇంటికొచ్చేశాను. ఇక అప్పటి నుంచే ఇంటి దగ్గరే ప్రిపేర్‌ అయ్యాను. మొదట్లో రోజూ 8-10 గంటలు చదివాను. పరీక్షలకు రెండు నెలల ముందు ప్రిపరేషన్‌ సమయాన్ని 10-12గంటలకు పొడిగించాను. నెలకు ముందు 12-14 గంటలు చదివాను.’

నాలుగేళ్లుగా టీవీ చూడలేదు!

‘మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న (సురేష్‌ చంద్‌ అవస్థి) ఓ హోమియోపతి కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రిపరేషన్‌కు సంబంధించి ఆయన నాకెన్నో విలువైన సలహాలు, సూచనలు అందించారు. ఇక టీచర్‌గా పనిచేస్తున్న మా అమ్మ మా కోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుంది. ప్రిపరేషన్‌ సమయంలో ఫోన్‌ను పూర్తిగా దూరం పెట్టాను. ఏదైనా సమాచారం కావాలంటే తప్ప సోషల్‌ మీడియాను వినియోగించలేదు. ఇక నాలుగేళ్లుగా ఇంట్లో ఎవరూ టీవీ చూడడం లేదు. నాతో పాటు నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నా సోదరుడికి ఇబ్బంది కలగకూడదని మా పేరెంట్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా నా విజయంలో అమ్మానాన్నల పాత్ర ఎంతో ఉంది.’

2, 3 సార్లు నంబర్‌ సరిచూసుకున్నా!

‘ఫలితాలు వచ్చినప్పటి నుంచి నా ఫోన్‌ మోగుతూనే ఉంది. బంధువులు, స్నేహితులు, సన్నిహితులందరూ శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఆలిండియా రెండో ర్యాంకు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అందుకే ఫలితాలు వెలువడ్డాక నా నంబర్‌ 2, 3 సార్లు సరిచూసుకున్నాను. మొత్తానికి కలెక్టర్‌ కావాలన్న నా కల నెరవేరింది. బాధ్యత గల ఓ ప్రభుత్వ అధికారిణిగా గ్రామీణ ప్రాంత మహిళల్లో నైపుణ్యం పెంచడానికి నా వంతు కృషి చేస్తాను.’ అని అంటోంది అవస్థి.


ఉద్యోగం చేస్తూ 6 గంటలు చదివాను!

ఆగ్రాకు చెందిన అంకితా జైన్‌ ఈ పరీక్షల్లో ఆలిండియా మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. 2019లో డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌గా ఐఏఎస్‌ కేడర్‌తో సమానమైన ఉద్యోగాన్ని సాధించిన ఆమె అంతటితో తృప్తి చెందలేదు. ఎలాగైనా ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకుంది. అందుకే ఉద్యోగం చేస్తూనే రోజూ 6గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించింది. ‘ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధం కావడం కొంచెం కష్టమే. కానీ అమ్మానాన్నలు, నా భర్త, అత్తమామలు నాకు పూర్తిగా సహకరించారు’ అని అంటోంది అంకిత. మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్‌ అధికారి అభినవ్‌ త్యాగితో కొన్ని నెలల క్రితమే ఆమెకు పెళ్లైంది.


కోచింగ్‌ తీసుకోలేదు... 12 గంటలు చదివాను!

హరియాణాలోని బసాయి అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన మమతా యాదవ్‌ గతేడాది సివిల్స్ పరీక్షల్లో 556వ ర్యాంక్‌ తెచ్చుకుంది. ఈసారి మాత్రం ఆలిండియా ఐదో ర్యాంక్‌ను సాధించి తన తల్లిదండ్రులను సంతోషంలో ముంచెత్తింది. సొంత రాష్ట్రం హరియాణా అయినప్పటికీ మమత చదువంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా అందుకున్న ఆమె 4 ఏళ్ల నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. ‘గతంలో రోజుకు 8-10 గంటల పాటు చదివేదాన్ని. అయితే అది సరిపోదనిపించింది. అందుకే 10-12 గంటల పాటు చదివాను. గతేడాది కంటే ఈసారి మెరుగైన ర్యాంక్‌ వస్తుందని తెలుసు. కానీ ఆలిండియా ఐదో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. మా నాన్న (అశోక్‌ యాదవ్‌) ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ నన్ను చదివించారు. అమ్మ (సరోజ్‌ యాదవ్‌) ఇంటి పట్టునే ఉండి నన్ను ప్రోత్సహించింది. ఈ పరీక్షల కోసం నేనెలాంటి కోచింగ్‌ తీసుకోలేదు’ అని అంటోంది మమత.


నాలుగో ప్రయత్నంలో నా కల నెరవేరింది!

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన మీరా సివిల్‌ సర్వీసెస్‌- 2020 పరీక్షా ఫలితాల్లో ఆలిండియా ఆరో ర్యాంకును సాధించింది. త్రిస్సూర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్న ఆమె కొన్నేళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేసింది. అయితే ఐఏఎస్‌ అవ్వాలన్న కోరికతో 2018లో జాబ్‌ వదిలేసింది. ‘బెంగళూరులో జాబ్‌ చేస్తూనే 2018లో మొదటిసారి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాను. కానీ సఫలం కాలేకపోయాను. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. మూడో ప్రయత్నంలో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయాను. అయితే నాలుగో అటెంప్ట్‌లో నా కల నెరవేరింది. ర్యాంక్‌ వస్తుందని తెలుసు కానీ ఆలిండియా ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదు. నా విజయంలో మా అమ్మ కృషి కూడా ఉంది. ఆమె టీచర్‌గా పనిచేస్తూ నన్ను చదివించింది. కెరీర్‌కు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు అందించి నా భవిష్యత్‌ను తీర్చిదిద్దింది. ఇక ప్రిపరేషన్‌కు సంబంధించి ఇన్ని గంటలు చదవాలని ఎప్పుడూ లిమిట్‌ పెట్టుకోలేదు. ఇష్టంగా చదివాను.’ అని తన సక్సెస్‌ సీక్రెట్‌ను చెప్పుకొచ్చింది మీరా.


ఘజియాబాద్‌ డెంటిస్ట్‌కు తొమ్మిదో ర్యాంకు!

ఈ పరీక్షా ఫలితాల్లోనే ఆలిండియా తొమ్మిదో ర్యాంక్‌ను కైవసం చేసుకుంది యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అపాలా మిశ్రా. 2017లో హైదరాబాద్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ కోర్సు పూర్తి చేసిన ఆమె.. దంత వైద్యురాలిగా పనిచేస్తోంది. అయితే ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో  2018నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరవుతోంది. అయితే మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా మూడో అటెంప్ట్‌లో తన లక్ష్యాన్ని చేరుకుంది. ‘నేను క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తాను. అందుకే రోజూ వేకువజామునే నిద్రలేస్తాను. వర్కవుట్లు చేస్తాను. హెల్దీ ఫుడ్‌ తీసుకుంటాను. ఇక ప్రిపరేషన్‌ విషయానికొస్తే రోజూ 7-8 గంటల పాటు చదివాను’ అని చెప్పుకొచ్చిందీ డెంటిస్ట్‌.


అక్క అడుగుజాడల్లోనే!

2015 యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది టీనా దాబి. ఇప్పుడు ఆమె స్ఫూర్తితో సోదరి రియా దాబి సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 15 వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించిన టీనా.. ‘నా సోదరి రియా దాబి సివిల్స్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది. టీనా ప్రస్తుతం రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


సరదాగా, ఇష్టంతో చదివాను!

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన పి. శ్రీజ ఈ పరీక్షా ఫలితాల్లో 20వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా కళాశాల నుంచి 2019లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించడం విశేషం. ‘మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా 20వ ర్యాంకు వస్తుందనుకోలేదు. నేను ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ పూర్తి చేసి, 2019లో ఇంటర్న్‌ పూర్తి చేశాను. అయితే అఖిల భారత సర్వీసుల్లో చేరితే సమాజానికి ఎంతో సేవ చేయొచ్చని మా నాన్న చెప్పేవారు. అదేవిధంగా మా అమ్మ నర్స్‌ కావడంతో ఒక వైద్యురాలు దేశ సేవలో భాగమైతే ఎలాంటి మార్పులు తీసుకురావచ్చో నాకు చెబుతుండేది. ఆరోగ్యం అనే కాకుండా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే సివిల్‌ సర్వీసెస్‌ ఒక ఉత్తమ మార్గం. నా తల్లిదండ్రులు, నా ట్యూటర్స్ కృషి వల్లే ఉత్తమ ర్యాంకు సాధించగలిగాను. సన్నద్ధత విషయంలో ఎప్పుడూ టైం లిమిట్‌ పెట్టుకోలేదు. నేను ఎంతో సరదాగా, ఇష్టంగా చదివాను’ అని తన సక్సెస్‌ సీక్రెట్‌ను చెప్పుకొచ్చింది శ్రీజ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని