Updated : 28/04/2022 19:43 IST

Momma Story Arts: అమ్మయ్యే క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తోంది!

(Photo: Screengrab)

‘అమ్మయ్యే క్షణం మహిళకు పునర్జన్మతో సమానం’ అంటుంటారు పెద్దలు. అలాంటి అరుదైన ఘట్టాన్ని మాటల్లో వర్ణించలేం.. అందుకే ఆ అద్భుత క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తూ తల్లులకు అమూల్యమైన బహుమతిని అందిస్తోంది దిల్లీకి చెందిన ఉర్షితా సైనీ గుప్తా. ఫొటోగ్రఫీపై మక్కువతో లాయర్‌గా కెరీర్‌ను పక్కన పెట్టిన ఆమెకు.. ఇందులో రాణించడం అంత సులభం కాలేదు. ‘ఒక హాబీ కోసం బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటావా?’ అన్నారు చాలామంది. అయినా ముందడుగు వేసి.. ఎంతో ఆశతో కెరీర్‌ మొదలుపెట్టిన ఆమెతో మొదట్లో ఫొటోలు తీయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ సవాళ్లన్నీ ఎదుర్కొని నిలదొక్కుకున్న ఉర్షిత.. ఇప్పుడు బర్త్‌ ఫొటోగ్రఫీలో తనకు తిరుగులేదనిపిస్తోంది. మరి, ఒక లా స్టూడెంట్‌గా సాగిన ఆమె జర్నీ ఫొటోగ్రఫీ వైపుకి ఎలా మళ్లిందో తెలుసుకుందాం రండి..

దిల్లీకి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది ఉర్షిత. సాధారణంగా ఇలాంటి ఫ్యామిలీలో వ్యాపారం, ఇతర అభిరుచుల కంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. ఉర్షిత కుటుంబం కూడా అదే ఆలోచనతో ఉండేది. అయితే ఆమె మాత్రం చదువుపై అంతగా శ్రద్ధ పెట్టకపోయేది. అయినా ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఎలాగోలా న్యాయవిద్య పూర్తి చేసింది.

అలా తపన తెలుసుకొని..!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అభిరుచి ఉన్నట్లే.. ఉర్షితకూ ఫొటోగ్రఫీ అంటే చిన్నతనం నుంచే ఇష్టం. ఈ క్రమంలోనే కుటుంబంలో జరిగే ఫంక్షన్లు/పార్టీలు, గెట్‌-టు-గెదర్‌.. వంటి ఈవెంట్లలో తానే ఫొటోగ్రాఫర్‌గా మారి ఫొటోలు క్లిక్‌మనిపించేది. ఇలా తాను తీసిన యాంగిల్స్, ఫొటో క్లారిటీ.. వంటివి అందరికీ నచ్చేవి. ఇలా తనలో ఉన్న నైపుణ్యాల్ని, ఫొటోగ్రఫీపై మక్కువను లా పూర్తయ్యే సరికల్లా గ్రహించింది ఉర్షిత. దీంతో లాయర్‌ కావడం కంటే ఫొటోగ్రఫీనే తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇందుకు ఆమె పేరెంట్స్‌ ససేమిరా అన్నారు. అయినా వాళ్లను ఒప్పించి ఈ దిశగా అడుగులేసిందీ యంగ్‌ ఫొటోగ్రాఫర్.

‘ఒక అంశంపై ఆసక్తి ఉంటే అందులో నైపుణ్యాలను పెంచుకోవడం పెద్దగా కష్టమనిపించదు. నా విషయంలోనూ అదే జరిగింది. ఫొటోగ్రఫీపై పట్టు పెంచుకోవడానికి నేను ఏ కోర్సూ నేర్చుకోలేదు. యూట్యూబ్‌, అంతర్జాలంలో ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పంచుకున్న చిట్కాలను అనుసరించి ఇందులో నైపుణ్యాలు పెంచుకున్నా. అన్నింటికంటే ఎక్కువగా సాధన నాకు ఉపయోగపడింది. సమయం, సందర్భం అంటూ లేకుండా నచ్చిన ప్రదేశం, సీన్‌ కనిపిస్తే చాలు.. ఓ ఫొటో క్లిక్‌మనిపించేదాన్ని. అయితే రెండేళ్ల పాటు వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీలో ఫ్రీలాన్సర్‌గా పనిచేశా. ఆ తర్వాత 2016లో ఓ పత్రికలో ఉద్యోగంలో చేరాను..’ అంటోంది ఉర్షిత.

సాధనతోనే పర్‌ఫెక్ట్‌ అయ్యా!

అయితే ఉర్షిత చేరిన పత్రికలో ప్రెగ్నెన్సీ, ప్రసవానంతర ఫొటోషూట్స్‌ తీసే ఫొటోగ్రాఫర్లున్నారు. కానీ ఆమెకు మాత్రం బర్త్‌ ఫొటోగ్రాఫర్‌ కావాలని కోరిక. ఆ సమయంలో తన ఫ్రెండ్‌ సలహాతో ఈ దిశగా అడుగేసిందామె. ఇందుకోసం ఆమె ఎంతోమంది డాక్టర్లను కలిసింది. కానీ లేబర్‌రూమ్‌లో ఫొటోగ్రఫీ అంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆఖరికి ఉచితంగా ఐవీఎఫ్‌ సేవలందించే ఓ ఆస్పత్రిలో డాక్టర్‌ని కలిసింది ఉర్షిత. తను ఒప్పుకోవడం, అక్కడ ఎక్కువగా ఎన్నారై పేషెంట్సే ఉండడం ఆమెకు కలిసొచ్చిందని చెప్పచ్చు. అలా ఓ జంట ఒప్పుకోవడంతో తన తొలి అసైన్‌మెంట్‌ని పూర్తిచేసింది ఉర్షిత. అయితే ఎవరైనా తొలి ప్రయత్నంలోనే పర్‌ఫెక్ట్‌ అయిపోరు కదా..! అందుకే ఈక్రమంలో చేసిన పొరపాట్లు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలు, లేబర్‌ రూమ్‌లో ఎలాంటి ప్రొటోకాల్స్‌ పాటించాలన్న విషయాలపై శిక్షణ కూడా తీసుకుంది ఉర్షిత. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేసి 2017లో ‘Momma Story Arts’ పేరుతో ఓ బర్త్‌ ఫొటోగ్రఫీ సంస్థను ప్రారంభించిందామె.

సవాళ్లెన్నో ఎదుర్కొన్నా!

ప్రస్తుతం తన సంస్థ వేదికగా బర్త్‌ ఫొటోగ్రఫీతో పాటు మెటర్నిటీ ఫొటోషూట్స్‌, న్యూబోర్న్‌ ఫొటోగ్రఫీ, 3-డి హ్యాండ్-ఫీట్‌ క్యాస్టింగ్‌, బర్త్‌డే ఫొటోషూట్స్‌.. వంటి సేవల్ని అందిస్తోంది ఉర్షిత. అయితే తాను ఎంత మక్కువతో ఈ కెరీర్‌ ప్రారంభించానో.. మొదట్లో అంతకుమించిన సవాళ్లు ఎదుర్కొన్నానంటోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

‘బర్త్‌ ఫొటోగ్రఫీ.. నిజానికి ఇది పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతున్నా.. నేను కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో దీనిపై చాలా మూసధోరణులుండేవి. పుట్టిన పసిగుడ్డును ఫొటోలు తీయకూడదని, 40 రోజుల దాకా ఇంట్లో వాళ్లు కాకుండా, ఇతరులు చూడ్డానికి వీల్లేదని.. ఇలా చాలానే అడ్డంకులుండేవి. అందుకే జంటల్ని ఒప్పించడం కష్టమయ్యేది. దీనికి తోడు వేళాపాళా లేని సమయాలు విసుగు తెప్పించేవి. ఓ సందర్భంలోనైతే ఓ మహిళ బర్త్‌ ఫొటోగ్రఫీ కోసం మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీంతో నాకంటూ వ్యక్తిగత సమయాన్ని కూడా మిస్సయ్యేదాన్ని..’ అంటూ తానెదుర్కొన్న సవాళ్లను పంచుకుంది ఉర్షిత.

అందుకే.. అందరూ మహిళలే!

ప్రస్తుతం ఉర్షిత వద్ద 26 మంది ఉద్యోగులున్నారు. అయితే అందులో అందరూ మహిళల్నే నియమించుకున్నానంటోందామె. ‘మన దేశ చట్టాల ప్రకారం లేబర్‌ రూమ్‌లో భర్త, పురుష డాక్టర్‌ మినహాయించి మరో పురుషుడు ప్రవేశించడానికి వీల్లేదు. అందుకే మా కంపెనీలో అందరూ మహిళల్నే నియమించుకున్నా. ఇప్పటిదాకా మేము దాదాపు 500 లకు పైగా బర్త్‌ ఫొటోగ్రఫీ షాట్స్‌ తీశాం. అందులో నేను తీసినవి 300లకు పైగానే ఉన్నాయి. ఈ స్వీట్‌ మెమరీస్‌ చూశాక వినియోగదారుల ముఖాల్లో నవ్వులు చూస్తే ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలేవీ గుర్తు రావు. ఇలాగే ఓసారి ఓ క్లైంట్‌ బంధువు దగ్గర్నుంచి నేను అందుకున్న 500 రూపాయల్ని ఇప్పటికీ ఎంతో అపురూపంగా దాచుకున్నా. ఇక కొంతమంది ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఉచితంగా కూడా ఫొటోగ్రఫీ షాట్స్‌ తీసి అందిస్తున్నాం. భవిష్యత్తులో ఈ నైపుణ్యాల్ని మరింతమందికి చేరువ చేయాలన్న ఆలోచన ఉంది. బర్త్‌ ఫొటోగ్రఫీలో ఔత్సాహికులకు మెలకువలు నేర్పి.. వారితో ఇలాంటి సంస్థలు ప్రారంభింపజేయాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాలను పంచుకుంది ఉర్షిత.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని