ఎత్తులో వ్యత్యాసం.. స్వలింగ వివాహం.. ఓ అరుదైన ప్రేమ కథ!

‘రంగు, రూపు, ఎత్తు.. నిజమైన ప్రేమకు ఇవి కొలమానాలా?’ అంటే కాదని నిరూపిస్తున్నారు అమెరికాకు చెందిన ఓ జంట.

Updated : 19 Dec 2022 11:40 IST

‘రంగు, రూపు, ఎత్తు.. నిజమైన ప్రేమకు ఇవి కొలమానాలా?’ అంటే కాదని నిరూపిస్తున్నారు అమెరికాకు చెందిన ఓ జంట. ‘ప్రేమంటే శరీరానికి సంబంధించింది కాదు.. మనసుకు సంబంధించింది’ అని తమ అనుబంధంతోనే చాటి చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఎత్తులో సుమారు మూడు అడుగుల వ్యత్యాసం ఉన్నా.. ఇది తమ ప్రేమను అడ్డుకోలేకపోయిందంటున్నారు. ఇక ఇటీవలే ‘ఎత్తులో అత్యధిక వ్యత్యాసమున్న వివాహిత జంట (మహిళా లెస్బియన్‌ కపుల్‌ విభాగంలో)’గా గిన్నిస్‌ బుక్ రికార్డుల్లోకీ ఎక్కారు. ఆ ఆదర్శ జంటే.. క్రిస్టీ ఛాండ్లర్‌, సెనెక్కా కోర్సెట్టీ. సమాజం నుంచి పలు విమర్శల్ని ఎదుర్కొని ఒక్కటైన ఈ జంట ప్రేమకథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదనడం అతిశయోక్తి కాదు..!

క్రిస్టీ ఛాండ్లర్‌, సెనెక్కా కోర్సెట్టీ.. అమెరికా ఉతాలోని సెయింట్‌ జార్జ్‌లో నివసిస్తుంటుందీ జంట. వీరిద్దరూ స్వలింగ సంపర్కులు. ఈ ఇద్దరిలో క్రిస్టీ భర్త, సెనెక్కా భార్య. ఈ జంట మధ్య వయోభేదం ఎంతో తెలియదు కానీ.. ఎత్తులో వ్యత్యాసం మాత్రం చాలానే ఉంది. క్రిస్టీ 5’ 11.74’’ ఎత్తుంటే.. సెనెక్కా 3’ 2.29’’ ఎత్తుంది. అంటే ఇద్దరి మధ్య ఎత్తులో భేదం 2’ 9.44’’ గా ఉంది. ఇలా ఎత్తులో అత్యధిక వ్యత్యాసం ఉన్న వివాహిత జంట (మహిళా స్వలింగ సంపర్కుల విభాగంలో)గా ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించిందీ అమెరికన్‌ జంట.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌!

సెనెక్కా అంత తక్కువ ఎత్తు ఉండడానికి కారణం.. ఆమెకు చిన్న వయసు నుంచే ఉన్న డ్వార్ఫిజం సమస్య. దీనివల్ల మృదులాస్థి, ఎముకల్లో ఎదుగుదల లేకపోవడంతో మరుగుజ్జుగానే ఉండిపోయిందామె. అయినా ఈ శారీరక సమస్య తన కెరియర్‌కు ఆటంకం కాకూడదని నిర్ణయించుకుంది. ఈ తపనతోనే ఉన్నత చదువులు చదివి టీచింగ్‌ రంగంలో స్థిరపడింది. ప్రస్తుతం అక్కడి ఓ స్కూల్‌లో గణిత పాఠాలు బోధిస్తోంది. అయితే అదే స్కూల్‌లో ఆర్ట్‌ టీచర్‌గా పనిచేస్తోంది క్రిస్టీ. తొలి చూపులోనే సెనెక్కాను చూసి మనసు పారేసుకున్నానంటోంది.
‘ఓరోజు నేను ఫ్యాకల్టీ రూమ్‌లో ఉండగా.. అక్కడికి సెనెక్కా వీల్‌ఛెయిర్‌లో వచ్చింది. తను స్కూల్‌కి కొత్త. తనను చూడగానే ముందు ఆశ్చర్యపోయా. ఎందుకంటే అంత తక్కువ ఎత్తున్న అమ్మాయిని నేను అప్పటివరకు చూడలేదు. తను ఎంత త్వరగా కలిసిపోయిందంటే.. తొలి పరిచయంలోనే ఓ ప్రాణ స్నేహితురాలిగా మాట్లాడింది.. అందుకే తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. ఇక అప్పట్నుంచి ఇద్దరం మంచి స్నేహితుల్లా ఉన్నాం.. ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. అలా మా మధ్య చనువు, అనుబంధం పెరిగాయి. అది ప్రేమని తెలిశాక మూడేళ్ల పాటు డేటింగ్‌ చేశాం.. 2021 జూన్‌లో పెళ్లి చేసుకున్నాం..’ అంటూ తమ ప్రేమకథను పంచుకుంది క్రిస్టీ.

అర్థం చేసుకోవడమే.. అసలైన అనుబంధం!

ఒక వ్యక్తిలో ఉండే శారీరక, మానసిక లోపాల గురించి వాటితో బాధపడేవారికన్నా ఈ సమాజమే ఎక్కువగా పట్టించుకుని, వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది.  చాలామంది తరచుగా వాటి గురించే మాట్లాడుతూ, వాళ్లను బాధపెట్టే పనులు చేస్తుంటారు. అయితే ఇలాంటివి తమ ప్రేమను అడ్డుకోలేకపోయాయంటున్నారీ లెస్బియన్‌ కపుల్‌.

‘మా మధ్య అనుబంధం చూసి మా స్కూల్లో సహ ఉపాధ్యాయులు, పిల్లలు ఎంతో సంతోషించారు.. ఒక రకంగా మా ప్రేమను గెలిపించుకునేలా చేశారు. కానీ సమాజంలో కొంతమంది మా ఎత్తుల్లో ఉన్న వ్యత్యాసంపై పలు విమర్శలు చేసేవారు. అయినా వాటిని మేం పట్టించుకోలేదు. అర్థం చేసుకుంటేనే అనుబంధం దృఢమవుతుందంటారు. మా వైవాహిక బంధాన్ని నిత్య నూతనం చేసుకోవడానికి మేమూ ఇదే చిట్కా ఫాలో అవుతున్నాం. కష్టాల్ని పంచుకుంటూనే.. సుఖాల్లో భాగమవుతున్నాం. ఏ విషయమైనా సరే పారదర్శకంగా చర్చించుకుంటున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవితంలో ఏ పరిస్థితినైనా ప్రేమతోనే జయిస్తున్నాం. ప్రతి పనినీ కలిసి పంచుకుంటున్నాం..’ అంటూ తమ అనుబంధానికి మాటల రూపమిచ్చిందీ ఆదర్శ జంట.
ఎత్తులో వ్యత్యాసం.. అందులోనూ స్వలింగ వివాహం.. అయినా సరే.. సమాజానికి ఏమాత్రం భయపడకుండా ఒక్కటై ఆదర్శ దంపతులుగా నిలిచింది ఈ జంట. ఈ ప్రత్యేకతలతోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు సొంతం చేసుకుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని