Published : 17/03/2022 19:00 IST

సహజ రంగులే వాడదాం !

హోలీ అంటేనే ఒంటి నిండా రంగులు, మనసు నిండా సంతోషంతో ఎంజాయ్ చేస్తుంటాం. అయితే ఈ రంగుల పండక్కి కలర్స్ ఏవి వాడుతున్నారు? ఇంకేంటి.. బయట రడీగా దొరుకుతున్నాయిగా.. అంటారా? అయితే ఆ రంగులతో పాటు లేనిపోని అనారోగ్యాల్ని కూడా కొనితెచ్చుకుంటున్నారన్నమాట! అర్థం కాలేదా..? బయట దొరికే రంగుల్లో బోలెడన్ని రసాయనాలుంటాయి. అవి మన చర్మం, జుట్టుకు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే వాటిని దూరంగా ఉంచి, ఇంట్లోనే సహజసిద్ధంగా రంగుల్ని తయారుచేసుకోవడం మంచిదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా వాటివల్ల చర్మానికి ఎలాంటి హానీ కలగదు సరికదా.. వాటిలోని ఔషధ గుణాలు చర్మానికి, శరీరానికి మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే న్యాచురల్ కలర్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

రెయిన్‌బో కలర్స్ ఇలా!

* పసుపు రంగు కావాలనుకుంటే నేరుగా ఇంట్లో లభించే పసుపును ఉపయోగించచ్చు. అలాగే ఇందులో కాస్త ముదురు రంగు కావాలనుకుంటే.. కాస్త శెనగపిండికి, పసుపు కలిపితే సరిపోతుంది. ఇక లేత పసుపు రంగు కోసమైతే పసుపులో కాస్త బియ్యప్పిండిని కలిపైనా తీసుకోవచ్చు.

* కమలాఫలం తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే నారింజ రంగుని పొందచ్చు. అలాగే ఇందులో కాస్త ముదురు రంగు కావాలనుకునే వారు దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు.

* ఎరుపు రంగు కోసం కుంకుమ ఉపయోగించవచ్చు. ఇందులో మెరూన్, నారింజ, బ్రౌన్.. వంటి రంగులుండే కుంకుమ కూడా బయట లభిస్తుంది. లేదంటే మందార పూల రెక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకున్నా ఎరుపు రంగు లభిస్తుంది.

* ఆకుపచ్చటి ఆకులు లేదంటే అందులో కాస్త లేత, ముదురు రంగులు కలిగిన ఆకుల్ని తెచ్చి బాగా ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీ పట్టుకుంటే మెత్తటి ఆకుపచ్చటి పొడి రడీ అవుతుంది. ఉదాహరణకు.. కరివేపాకు, పుదీనా, పాలకూర, ఇతర చెట్ల ఆకులు.. వంటివి వాడచ్చు. అలాగే గోరింటాకు ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసుకుంటే ఆకుపచ్చ రంగులో మరో షేడ్ తయారవుతుంది.

* గులాబీల్లో ముదురు, లేత గులాబీ రంగుల పూలు ఉంటాయి. ఈ పూరేకులను బాగా ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకుంటే ఆయా రంగులు దొరికినట్లే.

* మెజెంటా పింక్ కోసం.. బీట్‌రూట్‌ని చిన్నగా, పలుచటి చిప్స్‌లా చేసి బాగా ఎండబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటే అదిరిపోయే మెజెంటా రంగు రడీ. అలాగే బీట్‌రూట్ రసంలో బియ్యప్పిండి కలిపి ఆరబెట్టినా లేత గులాబీ రంగు లభిస్తుంది.

* ముదురు గోధుమ రంగు కోసం కాఫీ పొడి, టీ పొడి; ఇందులో కాస్త లేత రంగు కావాలనుకుంటే.. దాల్చిన చెక్క పొడి లేదంటే గంధం పొడికి కొద్ది మొత్తంలో మెంతి పొడి, ముల్తానీ మట్టి.. ఈ రెండింటినీ కలుపుకొన్నా ఆకర్షణీయమైన లేత గోధుమ రంగు తయారవుతుంది.

* వంటకాల్లో వాడే కొన్ని రకాల ఫుడ్ కలర్స్‌ను కూడా హోలీ కలర్స్‌గా ఉపయోగించవచ్చు. ఇందుకోసం కాస్త ఉప్పులో వేర్వేరు రంగుల ఫుడ్ కలర్స్‌ని విడివిడిగా కలుపుతూ వివిధ రంగుల్ని తయారుచేసుకోవచ్చు. అయితే వీటిలో లేత రంగు కోసం ఫుడ్ కలర్‌ని కాస్త తక్కువగా; ముదురు రంగులు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కాస్త ఎక్కువ మోతాదులో కలుపుకోవాల్సి ఉంటుంది.

రంగు నీళ్లు కావాలంటే..!

అలాగే ఈ హోలీకి రంగుల్ని చల్లుకోవడం మాత్రమే కాదు.. వాటిని నీళ్లలో కలుపుకొని ఆ రంగు నీటిని హోలీ పిస్టన్‌లో నింపి మరీ వాటితో హోలీ ఆడుకోవడం పరిపాటే. మరి, ఆ రంగు నీటిని కూడా సహజసిద్ధంగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం..

* ముందు రోజు రాత్రి బీట్‌రూట్ ముక్కల్ని కట్ చేసి వాటిని కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఉదయాన్నే పిస్టన్‌లో నింపుకొని ఉపయోగిస్తే సరి.

* ఇక నలుపు రంగు నీళ్ల కోసం కొన్ని నల్లద్రాక్ష, ఉసిరి కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొన్ని నీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటిని పూర్తిగా చల్లారనిస్తే నలుపు రంగు నీళ్లు రడీ అయినట్లే!

* ఆకుపచ్చ రంగు కావాలనుకుంటే ఆకుకూరల్ని మిక్సీ పట్టుకొని దాన్ని నీళ్లలో కలిపి మరిగించడం లేదంటే నేరుగా మరిగించడం వంటివి చేయాలి. ఇలా మీకు అవసరమైనన్ని రంగుల్లో నీటిని తయారుచేసుకోవచ్చు.

ఎంత సహజ రంగులు ఉపయోగిస్తున్నా సరే... ‘కరోనా’ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే - హోలీ సంబరాల్లో మునిగిపోయి, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దు !


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని