Updated : 17/08/2021 12:45 IST

స్టార్టప్‌ ప్రారంభిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

ఎప్పటికైనా క్రాఫ్ట్‌ బిజినెస్‌ చేయాలనేది కావ్య కల. అయితే కరోనా కారణంగా తన ఉద్యోగం పోవడంతో దీనిపై దృష్టి పెట్టిందామె. ప్రస్తుతం ఇందులో పెట్టుబడి పెట్టేందుకు డబ్బు సమకూర్చుకునే పనిలో ఉంది. జ్యోతి పర్యావరణ ప్రేమికురాలు. ఈ క్రమంలోనే ఎకో-ఫ్రెండ్లీ శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేద్దామనుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల గురించి ఓ చిన్నపాటి పరిశోధన చేయడం ప్రారంభించింది. స్టార్టప్‌/వ్యాపారం.. ఒకప్పుడు పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలోకి ప్రస్తుతం మహిళలు సైతం ప్రవేశిస్తున్నారు. తమ సృజనతో కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చి సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇక ప్రస్తుత కరోనా కాలంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందంటున్నారు నిపుణులు. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించడం, అందులో సక్సెస్‌ అవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మనదైన ప్రత్యేకతను చాటుకోవాలి. మరి, అది జరగాలంటే స్టార్టప్‌ ప్రారంభించే ముందే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

స్టార్టప్‌లు ప్రారంభించే విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడోస్థానంలో ఉందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అన్ని రంగాల్లోలాగే ఇందులోనూ మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లకే సవాల్‌ విసురుతున్నారు. అయితే వ్యాపారమంటే ఎంత మక్కువ ఉన్నా.. తొలిసారి ప్రారంభించే ముందు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే తక్కువ కాలంలోనే సక్సెస్‌ సాధించచ్చంటున్నారు నిపుణులు.

స్వల్ప కాలిక లక్ష్యాలు..!

మనం ఏ పని చేసినా ముందుగా ఓ ప్రణాళిక వేసుకుంటాం.. అదేవిధంగా మనం ప్రారంభించాలనుకుంటోన్న వ్యాపారానికీ ఓ పక్కా ప్రణాళిక అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే తడబడకుండా అడుగు ముందుకు వేయగలుగుతామంటున్నారు. ఈ క్రమంలో మీరు చేయాలనుకుంటోన్న వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆపై మీ టార్గెట్‌ గ్రూప్‌ ఎవరు? మీరు తయారుచేయాలనుకుంటోన్న ఉత్పత్తుల్ని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్లాలి? తొలి దశలో వాటిని ఎంతమందికి చేరవేయాలనుకుంటున్నారు? ఈ క్రమంలో ఉత్పత్తుల్ని మీరే స్వయంగా తయారుచేస్తారా? లేదంటే ఎవరినైనా పనిలో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ పెట్టుకుంటే మీరు అంచనా వేసే లాభాల్లోంచి వారికి ఎంత చెల్లించగలుగుతారు?.. ఇలాంటి విషయాలపై ఓ స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తొలి నాలుగైదేళ్లకు సరిపడా ఓ కచ్చితమైన ప్రణాళిక వేసి పెట్టుకోవాలి. నిజానికి మనం చేసే వ్యాపారంలో మనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నప్పటికీ.. ఇలాంటి స్వల్ప కాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే అప్పటి ట్రెండ్స్‌ని బట్టి మనల్ని మనం మలచుకుంటూ, మన ఉత్పత్తుల్లో తగిన మార్పులు చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగగలం అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే మీకు తెలిసిన వ్యాపారవేత్తల సలహాలు సైతం తీసుకోవచ్చు.

పరిశోధన చేయాల్సిందే!

మార్కెట్లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు.. అది ఎంత నాణ్యమైంది? దాని ప్రత్యేకతేంటి? ఇలాంటి ఉత్పత్తులు ఇంకా ఏవైనా ఉన్నాయా? ఉంటే.. వాటన్నింట్లో ఏది మంచిది? ఇలా ఓ చిన్నపాటి పరిశోధనే చేస్తాం. అదేవిధంగా మనం వ్యాపారం ప్రారంభించే క్రమంలోనూ ఇలాంటి రీసెర్చ్‌ అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే మన ప్రత్యేకతతో వినియోగదారుల్ని ఆకట్టుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో మనం అనుకున్న ప్రొడక్ట్స్‌ వంటివి ఇది వరకే మార్కెట్లో ఏవైనా ఉన్నాయా? అనేది ముందుగా పరిశీలించాలి. లేకపోతే సరే.. ఒకవేళ ఉంటే.. వాటికి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకొని.. అంతకంటే భిన్నంగా, కొత్తగా, కస్టమర్లకు మరింతగా ఉపయోగపడేలా ఆ ఉత్పత్తిని ఎలా తయారుచేస్తామన్నది ఆలోచించాలి. ఈ మార్పులు చేర్పులన్నీ చేసి కొన్ని శాంపిల్స్‌ని మీకు తెలిసిన వారికి పంపించి వాళ్ల అభిప్రాయాల్ని సైతం అడిగి తెలుసుకోవచ్చు.. దీనిపై నిపుణుల సూచనలు కూడా పాటించచ్చు. అప్పుడే మనం చేయాలనుకుంటోన్న వ్యాపారానికి ఓ తుది రూపు వస్తుంది.

‘డిజిటల్‌’ ప్రమోషన్‌!

ఒకప్పుడు ఏదైనా ఉత్పత్తిని అమ్మాలంటే.. పేపర్లలో ప్రకటన ఇవ్వడం, కరపత్రాలు తయారుచేసి పంచడం, వాల్‌పోస్టర్లు అతికించడం.. వంటివి చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అంతా డిజిటల్‌ మయం అయిపోయింది. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే చాలు.. వెంటనే దాన్ని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. క్షణాల్లో దానికి ఫీడ్‌బ్యాక్‌ రావడం.. ఈ ప్రాసెస్‌ అంతా కొన్ని గంటల్లోనే జరిగిపోతోంది. అందుకే ఇప్పుడందరూ తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకోవడానికి డిజిటల్‌ మార్కెటింగ్‌నే ఆసరాగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ ఉత్పత్తి గురించి తమకు తెలిసిన వారికి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయడం.. వారికి అది నచ్చితే వాళ్లకు తెలిసిన వారికి దాన్ని పంపించడం.. ఇలా వైరస్‌లాగా విషయం ప్రపంచమంతా పాకుతోంది. కాబట్టి మీరు కూడా మీ స్టార్టప్‌ ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాను ఎంచుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న గ్రాఫిక్‌ డిజైన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ మీ ఉత్పత్తి గురించి ఆకర్షణీయమైన బొమ్మలు, వీడియోల రూపంలో ప్రకటనల్ని డిజైన్‌ చేయించుకోవచ్చు. వాటిని గూగుల్‌ యాడ్స్‌, యూట్యూబ్‌.. వంటి వాటి ద్వారా అడ్వర్టైజ్‌ చేయచ్చు. ఇలా ఇంట్లోనే ఉంటూ మీ ఉత్పత్తి గురించి ప్రపంచమంతా చాటిచెప్పచ్చు. కాస్త ఖర్చైనా కాలు కదపకుండా పనవుతుందంటే సంతోషమే కదా!

కాస్త ఓపిక పట్టండి!

ఏ వ్యాపారమైనా ఇలా మొదలుపెట్టగానే అలా లాభాల్ని ఆశించడం అత్యాశే అవుతుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా మొదట్లో ఎన్నో నష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నాకే ఈ దశకు చేరుకొని ఉంటారు. కాబట్టి వ్యాపారం విజయవంతంగా ముందుకెళ్లకపోయినా, పదే పదే సవాళ్లు ఎదురైనా, నష్టాల బాట పట్టినా పట్టుదల కోల్పోకుండా ఓపిక పట్టాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ ఉత్పత్తి అంతలా జనాదరణకు నోచుకోకపోవడానికి కారణాలేంటో కనుక్కోవాల్సి ఉంటుంది.. దాన్ని మరింత ఆకర్షణీయంగా, వినియోగదారులకు ఉపయోగపడేలా ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకోవాలి. ఈ క్రమంలో నిపుణుల సలహాలు తీసుకోవడానికీ వెనకాడకూడదు.

ఈ తప్పులు దొర్లకుండా..!

ఏ పనైనా కొత్తగా ప్రారంభించినప్పుడు అందులో మనకు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు దొర్లడం సహజం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయంటున్నారు నిపుణులు. అయితే స్టార్టప్‌ ప్రారంభించే క్రమంలో మాత్రం కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు.

* కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలనుకుంటారు. నిజానికి అది అత్యాశే అవుతుంది. కాబట్టి మీ ఉత్పత్తిని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మలచడానికి కాస్త డబ్బు ఖర్చైనా వెనకాడకూడదంటున్నారు నిపుణులు. అప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం రాబట్టగలుగుతామంటున్నారు.

* కొంతమంది తమ అభిరుచుల్ని పక్కన పెట్టి మార్కెట్‌ ట్రెండ్స్‌నే తమ వ్యాపార ఉత్పత్తిగా మలచుకుంటుంటారు. అయితే ఇది అన్ని వేళలా సక్సెస్‌ కాకపోవచ్చు. ఇలాంటప్పుడు వినూత్నంగా ఉన్న మీ అభిరుచులకే ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. తద్వారా మీ క్రియేటివ్‌ స్టార్టప్‌ మీకు బోలెడన్ని లాభాల్ని అందించచ్చు.

* ఎలాగూ వ్యాపారం మొదలుపెడుతున్నాం కదా అని కొంతమంది ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల లాభాలొస్తే సరే.. ఒకవేళ నష్టాలొస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో నిలదొక్కుకునే దాకా కాస్త కష్టమైనా అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యాపారాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు.

ఇవన్నీ పాటిస్తూ.. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకుంటూ.. అవసరమైనప్పుడు నిపుణుల సలహాలు ఆచరిస్తే.. ఇక మీ స్టార్టప్‌కి తిరుగుండదనడంలో సందేహం లేదు.

మరి, మీరూ ఏదైనా స్టార్టప్‌ నడుపుతున్నారా? ఈ క్రమంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారా? అయితే మీ వ్యాపార సూత్రాలేంటో మాతో పంచుకోండి. ఈ వేదికగా మీ సక్సెస్‌ స్టోరీస్‌ని మరోసారి నెమరు వేసుకోండి..! మీరిచ్చే సలహాలు స్టార్టప్‌ ప్రారంభించాలనుకునే వారికి చిట్కాల్లా ఉపయోగపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని