Published : 02/11/2022 21:19 IST

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి!

కళ్లు... ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి దేవుడు ప్రసాదించిన ఓ గొప్ప వరం. కానీ డిజిటల్‌ మోజులో పడి చాలామంది ఆ దేవుడిచ్చిన కళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మన కళ్లకు బాగా పని పెరిగింది. కంప్యూటర్‌/ మొబైల్‌కు గంటల తరబడి కళ్లప్పగించేస్తుండడంతో మన కంటి ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఇందులో భాగంగా చాలామంది డ్రై ఐ సిండ్రోమ్ (కళ్లు పొడి బారడం) సమస్యతో బాధపడుతున్నారు.

ఈ లక్షణాలున్నాయా?

కళ్లు మంటగా అనిపించడం, దురద పెట్టడం, ఎర్రగా మారడం, మసకబారడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కన్నీళ్లు రాకపోవడం... ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని తెలిపే లక్షణాలు. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని కంటి నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే దీర్ఘకాలంలో మరిన్ని కంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఎందుకు వస్తుందంటే!

కళ్లు పొడిబారడానికి చాలా కారణాలున్నాయి. సి-విటమిన్‌ లోపించడం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, కంప్యూటర్లు/మొబైల్స్‌/ టీవీ ముందు ఎక్కువసేపు గడపడం, వివిధ రకాల ఎలర్జీలు, వృద్ధాప్యం, దుమ్ము, ధూళి తదితర కారణాల వల్ల కళ్లు పొడిబారతాయి. ఇక కంటి ఆరోగ్యంలో లాక్రిమల్‌ గ్రంథులది ప్రధాన పాత్ర. దీని నుంచి ఉత్పత్తయ్యే ద్రవాలే ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయి. అయితే పొడి కళ్ల కారణంగా కంటి ఉపరితలం డీహైడ్రేటెడ్‌గా మారుతుంది. చికాకు, దురద వంటివి బాగా ఇబ్బంది పెడతాయి. ఇక చాలామంది కళ్లకు వేసుకునే మేకప్‌ను తొలగించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఇది కూడా కళ్లు పొడిబారడానికి కారణమవుతుంది.

ఇలా ఉపశమనం పొందచ్చు!

⚛ కంప్యూటర్లు/మొబైల్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్ర్కీన్‌ వైపు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారి, బాగా మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి.

⚛ ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి.

⚛ మరీ చల్లని నీరు/వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

⚛ కళ్లలోని లాక్రిమల్‌ గ్రంథులు సమర్థంగా పనిచేయాలంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, దోసకాయ.. మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

⚛ పొడి కళ్ల నుంచి ఉపశమనం పొందాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే సాల్మన్‌, ట్యూన్, సార్డినెస్‌, ట్రౌట్‌, మ్యాకరెల్‌ చేపలను బాగా తినాలి. వీటితో పాటు వాల్‌నట్స్‌, బాదం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

⚛ హెయిర్‌ డ్రయర్స్‌, ఏసీలు, కూలర్లు, హీటర్ల నుంచి వచ్చే గాలులు నేరుగా కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలి.

⚛ వైద్యులను సంప్రదించకుండా డ్రాప్స్, మందులు వంటివి ఉపయోగించకూడదు.

⚛ కంప్యూటర్లు/మొబైల్స్‌ నుంచి వచ్చే నీలి కాంతి నుంచి రక్షణ పొందడానికి బ్లూ లైట్‌ ఫిల్టర్‌ గ్లాసెస్‌ వాడడం మంచిది.

⚛ కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసే వారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

⚛ కళ్లకు మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా కనురెప్పలు, కనుబొమ్మలు, కళ్ల చుట్టు పక్కల చర్మాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

⚛ బయటకు వెళ్లే సమయంలో సన్‌గ్లాసెస్‌ ధరించడం మంచిది. దీనివల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచే కాకుండా సూర్యుని నుంచి వెలువడే కొన్ని ప్రమాదకరమైన కిరణాల నుంచి కళ్లను కాపాడుకోవచ్చు.

⚛ టీ, కాఫీ, ఆల్కహాల్‌ వంటి కెఫీన్‌ అధికంగా ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

⚛ పని చేయడానికి చీకటి గదులు, ఎయిర్‌ కండిషన్డ్‌ గదుల్లో కాకుండా గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని