Published : 30/11/2022 20:42 IST

అల్లం పొట్టును ఇలా కూడా వాడచ్చట!

సాధారణంగా తొక్క చెక్కేసిన అల్లాన్ని వాడుకొని.. ఆ పొట్టును పడేయడం చాలామందికి అలవాటు! కొంతమంది ఈ పొట్టును టీ తయారీలోనూ వాడుతుంటారు. అయితే ఇదొక్కటే కాదు.. ఈ అల్లం పొట్టు/తొక్కతో ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

దగ్గు నుంచి విముక్తికి!

అసలే చలికాలం.. ఈ చల్లటి వాతావరణం వల్ల పదే పదే దగ్గు, జలుబు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి టీ తయారీలో అల్లం పొట్టును ఉపయోగిస్తుంటారు చాలామంది. దీంతో పాటు ఒకట్రెండు లవంగాలు, యాలకులు.. వేసి మరిగించిన టీ తాగితే దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇలా ఇదొక్కటే కాదు.. ఈ పొట్టును మరో రకంగా కూడా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. అల్లం పొట్టును ఎండబెట్టి పొడి చేయాలి. టీస్పూన్‌ తేనెకు కొద్దిగా అల్లం పొడి కలుపుకొని తీసుకున్నా ఈ సమస్యల నుంచి సత్వర ఉపశమనం ఉంటుంది.

సహజ ఎరువుగా..!

మన పెరట్లో/కుండీల్లో పెంచుకునే మొక్కలకు వివిధ రకాల సహజ ఎరువులు ఉపయోగిస్తుంటాం. అయితే ఈ లిస్టులో అల్లం పొట్టును కూడా చేర్చచ్చంటున్నారు నిపుణులు. ఇది మొక్కలకు సహజ ఎరువులా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫాస్ఫరస్‌ మొక్కల ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. క్రిమికీటకాల బారి నుంచి వాటిని సంరక్షిస్తుంది.

రుచీ.. ఆరోగ్యం!

కూరల రుచిని పెంచడానికి కొత్తిమీర, పుదీనా, వెనిగర్‌, నిమ్మరసం.. వంటి వివిధ రకాల పదార్థాల్ని ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో అల్లం పొట్టును కూడా వినియోగించచ్చంటున్నారు నిపుణులు. కూర ఉడికేటప్పుడు చిటికెడు అల్లం పొట్టును వేస్తే.. కాస్త ఘాటుదనంతో పాటు రుచీ ఇనుమడిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఉడికించేటప్పుడు ఇలా..!

బ్రకలీ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ.. వంటి కాయగూరల్ని వండే ముందు ఉడికించడం మనకు అలవాటు. తద్వారా వాటి నుంచి వచ్చే పచ్చి వాసన తొలగిపోతుంది. అయితే ఈసారి వాటిని ఉడికించే క్రమంలో కొద్దిగా అల్లం పొట్టును వేసి చూడండి.. ఒక రకమైన సువాసన వెదజల్లుతుంది. ఇక కొన్ని వంటకాల్ని ఆవిరిపై ఉడికిస్తుంటాం. ఇలాంటప్పుడు ఆయా పదార్థాలపై కొద్దిగా అల్లం పొట్టును చల్లి ఉడికిస్తే.. వాటికి కాస్త ఘాటుదనం వస్తుంది.. రుచి కూడా పెరుగుతుంది.

అల్లంతో స్టాక్!

సూప్స్‌, గ్రేవీ కర్రీస్‌, ఇతర వంటకాల్లోకి.. కాయగూరలతో తయారుచేసిన స్టాక్/ బ్రాత్‌ను వాడడం మనకు తెలిసిందే! దీంతో కూరకు చిక్కదనంతో పాటు రుచి కూడా వస్తుంది. అయితే ఈ బ్రాత్‌ను అల్లం పొట్టుతో కూడా తయారుచేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఆరు కప్పుల నీటిలో అరకప్పు అల్లం పొట్టు వేసి అరగంట పాటు మరిగించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక వడకట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. దీన్ని సూప్స్‌, గ్రేవీస్‌, ఇతర కూరల్లోకి వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని