Period Party: కూతురు రజస్వలైతే కేక్‌ కోసి.. సెలబ్రేట్ చేసి..!

నేటికీ నెలసరిని కళంకంగా భావించే ఇలాంటి కుటుంబాలున్న ఈ రోజుల్లో.. తన కూతురి రజస్వల వేడుకను కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్‌ చేశాడో తండ్రి. బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, సన్నిహితులు.. ఇలా ఆడ-మగ, చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేడుకకు ఆహ్వానించాడు. అంతటితో ఆగిపోకుండా.. వేడుక తాలూకు ఫొటోల్ని సోషల్‌ మీడియాలోనూ పంచుకున్నాడు.

Published : 25 Jul 2023 13:14 IST

(Photos: Instagram)

ఆడపిల్ల పెద్ద మనిషైనప్పుడు వేడుక చేసుకోవడం చాలా ఇళ్లల్లో జరిగేదే. అయితే అది కూడా అత్యంత సన్నిహితులు, దగ్గరి బంధువులు, అందులోనూ ఆడవారిని మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానిస్తారు చాలామంది.. గుట్టు చప్పుడు కాకుండా తంతు ముగించేస్తుంటారు మరికొందరు. నేటికీ నెలసరిని కళంకంగా భావించే ఇలాంటి కుటుంబాలున్న ఈ రోజుల్లో.. తన కూతురి రజస్వల వేడుకను కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్‌ చేశాడో తండ్రి. బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, సన్నిహితులు.. ఇలా ఆడ-మగ, చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేడుకకు ఆహ్వానించాడు. అంతటితో ఆగిపోకుండా.. వేడుక తాలూకు ఫొటోల్ని సోషల్‌ మీడియాలోనూ పంచుకున్నాడు. ఇలా తన కూతురికి మర్చిపోలేని మధురానుభూతుల్ని అందించడంతో పాటు.. నెలసరిపై సమాజంలో సానుకూల దృక్పథం నింపే ప్రయత్నం చేశాడు. ఇంట్లో మగవాళ్ల ముందు పిరియడ్స్‌ గురించి గుసగుసలాడుకునే ఈ రోజుల్లో ఈ తండ్రి చేసిన ప్రయత్నం.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.. సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

నెలసరి మన శరీర ధర్మం. ఈ విషయం గుర్తెరిగినా.. దీని గురించి బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడుతుంటారు చాలామంది. నలుగురి దాకా ఎందుకు.. ఇంట్లో మగవాళ్లుంటే.. నెలసరికి సంబంధించిన విషయాల గురించి గుసగుసలాడుకోవడం, సైగల ద్వారా తమ సందేహాల్ని తీర్చుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే ఆడవారి జీవితంలో సహజసిద్ధంగా జరిగే ఈ ప్రక్రియను దాచాల్సిన అవసరం లేదంటున్నారు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన జితేంద్ర భట్‌. ఇలా మాటల్లోనే కాదు.. ఇటీవలే రజస్వల అయిన తన కూతురి నెలసరి వేడుకను పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసి.. చేతల్లోనూ ఈ విషయాన్ని నిరూపించారాయన.

కూర్చోబెట్టి.. అవగాహన పెంచి..!

పిరియడ్స్‌ గురించి అవగాహన పెంచాలన్నా, సందేహాలు తీర్చాలన్నా.. ఇది అమ్మల పని అనుకుంటారు చాలామంది. కానీ ఈ విషయంలోనూ తల్లిదండ్రులిద్దరికీ సమాన బాధ్యత ఉందంటున్నారు జితేంద్ర. ఇటీవలే వారి కూతురు రాగిణి పుష్పవతి కావడంతో.. ముందు ఆమెకు దీని గురించి పూర్తి అవగాహన పెంచాలనుకున్నారు జితేంద్ర దంపతులు.  ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి తమ కూతురికి.. నెలసరి గురించిన ప్రాథమిక విషయాలు వివరించారు.. ఆపై ఆమె మనసులోని సందేహాలు తీర్చారు. ప్రతి మహిళ జీవితంలో పిరియడ్స్‌ సహజమని, దీన్ని కళంకంగా, అపరిశుభ్రమైనదిగా భావించాల్సిన అవసరం లేదంటూ.. తమ కూతురిలో అవగాహన పెంచే ప్రయత్నం చేశారీ పేరెంట్స్‌. తల్లిదండ్రులందరూ తమ కూతుళ్లకు ప్రారంభంలోనే నెలసరి గురించి సానుకూలంగా వివరిస్తే.. వారు ప్రతి నెలా పిరియడ్స్‌ని ఇబ్బంది లేకుండా ఆస్వాదించగలుగుతారని అంటున్నారు భట్‌ దంపతులు.

ఘనంగా.. పిరియడ్‌ పార్టీ!

ఇలా తమ కూతురు రాగిణిలో నెలసరి గురించి సానుకూల దృక్పథం నింపడమే కాదు.. తొలి నెలసరిని ఆమెకు మధురమైన జ్ఞాపకంగా అందించాలనుకున్నారు రాగిణి పేరెంట్స్‌. ఈ ఆలోచనతోనే.. పెద్ద ఎత్తున పిరియడ్‌ పార్టీని ఏర్పాటుచేశారు. బంధువులు, స్నేహితులు.. ఇలా ఆడ-మగ, చిన్నా-పెద్దా తేడా లేకుండా తమకు తెలిసిన వాళ్లందరినీ వేడుకకు పిలిచారు. ఇంటి నిండా గులాబీ రంగు బెలూన్లతో అలంకరించి, వేడుకకు తగినట్లుగానే.. ఎరుపు రంగు కేక్‌ను తెప్పించారు. ‘హ్యాపీ పిరియడ్స్‌ రాగిణి’ అని కేక్‌పై రాయించారు కూడా! పార్టీకొచ్చిన అతిథులందరి ముందు తమ కూతురితో కేక్‌ కట్‌ చేయించి.. కొత్త దశలోకి అడుగుపెట్టిన తమ కూతురికి అందరి శుభాశీస్సులు అందేలా చూశారీ తల్లిదండ్రులు.

అంతేకాదు.. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని జితేంద్ర సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ‘నా కూతురు రాగిణి పుష్పవతి అయింది. ఈ శుభ సందర్భంలో మా సంతోషాన్ని అందరితో పంచుకోవడానికే ఈ వేడుకను ఏర్పాటుచేశాం. హ్యాపీ పిరియడ్స్‌ రాగిణి.. అమ్మాయిలు/మహిళలు ఈ రోజుల్లో ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..’ అంటూ క్యాప్షన్‌ పెట్టారాయన.

ఇలా తన కూతురి నెలసరి వేడుకతో.. ఈ అంశంపై సమాజంలో సానుకూల దృక్పథం నింపే ప్రయత్నం చేసిన జితేంద్రపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘తల్లిదండ్రులందరూ తమ కూతుళ్ల నెలసరి గురించి.. ఇలా పాజిటివ్‌గా ఆలోచిస్తే.. వారు ప్రతి నెలా తమ నెలసరిని భారంగా భావించరు.. సానుకూలంగా ఆస్వాదిస్తారు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. ఈ కాలపు తండ్రులు కొంతమంది ఆడపిల్లలు పుట్టినప్పుడే కాకుండా, ఈ విధంగా వారి నెలసరి వేడుకను కూడా ఆడంబరంగా సెలబ్రేట్ చేయడం వారి ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పుకి సంకేతంగా భావించవచ్చు. నెలసరికి సంబంధించి ఇప్పటికీ అనేక రకాల మూఢ విశ్వాసాలతో అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వ్యక్తుల ఆలోచనా దృక్పథంలో సైతం ఇలాంటి సానుకూల మార్పు కనిపించాలని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని