ఈ అందాల కిరీటం అమ్మకు అంకితం!

మిస్‌ ఇండియా యూఎస్ఏ... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. అమెరికా వేదికగా జరిగే ఈ పోటీలకు సుమారు 40 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అందుకే ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని భారతీయ సంతతికి చెందిన అమ్మాయిలందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ అందాల కిరీటం అందుకోవాలంటే అమ్మాయిలకు అందంతో పాటు అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ సమపాళ్లలో ఉన్నాయి కాబట్టే తాజాగా జరిగిన మిస్‌ ఇండియా యూఎస్ఏ-2021 టైటిల్‌ను గెల్చుకుంది 25 ఏళ్ల వైదేహీ డోంగ్రే.

Updated : 20 Jul 2021 19:36 IST

Photo: Instagram

మిస్‌ ఇండియా యూఎస్ఏ... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. అమెరికా వేదికగా జరిగే ఈ పోటీలకు సుమారు 40 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అందుకే ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని భారతీయ సంతతికి చెందిన అమ్మాయిలందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ అందాల కిరీటం అందుకోవాలంటే అమ్మాయిలకు అందంతో పాటు అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ సమపాళ్లలో ఉన్నాయి కాబట్టే తాజాగా జరిగిన మిస్‌ ఇండియా యూఎస్ఏ-2021 టైటిల్‌ను గెల్చుకుంది 25 ఏళ్ల వైదేహీ డోంగ్రే.

1980లో తొలిసారిగా ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’ పోటీలు జరిగాయి. అప్పటి నుంచి ఏటేటా ఈ అందాల పోటీలకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. అలా ఈ ఏడాది కిరీటం కోసం అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి 61 మంది అందగత్తెలు పోటీపడ్డారు. మిస్‌ ఇండియా యూఎస్‌ఏ, మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ, మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ అనే మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ మూడు విభాగాల్లో విజేతగా నిలిచేవారు ముంబయిలో జరిగే ‘మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌’ పోటీలకు అర్హత సాధిస్తారు.

‘మిస్‌ ట్యాలెంటెడ్‌’ కూడా!

అలా ఈ ఏడాది మిస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీలకు వేదికగా నిలిచింది మిషిగన్. 1997 మిస్‌ వరల్డ్‌ డయనా హెడెన్‌ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే మిషిగన్‌కు చెందిన వైదేహి మిస్ ఇండియా యూఎస్‌ఏ- 2021 టైటిల్‌ గెల్చుకుందని హెడెన్‌ ప్రకటించింది. దీంతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యమైన కథక్‌లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ‘మిస్‌ ట్యాలెంటెడ్‌’ పురస్కారాన్ని కూడా వైదేహి సొంతం చేసుకుంది. ‘ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో విజేతగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ గుర్తింపుతో మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, అక్షరాస్యత కోసం కృషి చేస్తాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

నాపై నాకు నమ్మకాన్ని పెంచింది!

యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వైదేహి ప్రస్తుతం ఓ సంస్థలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక అందాల పోటీల్లో విజేతగా నిలవడంపై స్పందిస్తూ ‘ఈ అందాల కిరీటం గెల్చుకుంటానని ఊహించలేదు. ఎందుకంటే కరోనా కారణంగా చాలామందిలాగే నేనూ నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. కరోనా ప్రభావంతో గతేడాది ఫిబ్రవరి నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. సుమారు ఏడాది విరామం తర్వాత నా పనిపై దృష్టి పెట్టాను. వివిధ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా ఎలా ఉన్నతి సాధించవచ్చో ఈ పోటీల వల్ల తెలుసుకోగలిగాను. ఈ పోటీల్లో పాల్గొనడం, విజేతగా నిలవడం నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు స్ఫూర్తినిచ్చింది.’

అమ్మకు అంకితం!

‘నేను ఇండియాలో పుట్టాను. అమెరికాలో పెరిగాను. అమెరికాలో స్థిరపడిన నాలాంటి ఎందరో అమ్మాయిలు తమ శక్తి సామర్థ్యాలు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ అందాల పోటీలు ఒక వేదికగా నిలుస్తున్నాయి. ఇక ఈ కిరీటం గెల్చుకోవడంలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఈ ప్రయాణంలో నిత్యం నా వెన్నంటే ఉండి ప్రోత్సహించిన అమ్మకు ఈ అందాల కిరీటాన్ని అంకితం చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ!

ఇదే పోటీల్లో జార్జియా రాష్ట్రానికి చెందిన అర్షి లలనీ మొదటి రన్నరప్‌గా నిలిచింది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె కిరీటం కోసం ఫైనల్‌ రౌండ్‌ వరకు గట్టిగా పోరాడింది. ఈ క్రమంలో టైటిల్‌ గెలవకపోయినా తన ఆత్మవిశ్వాసంతో అతిథులందరి మన్ననలు అందుకుంది.
ఈ సందర్భంగా మిస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో సత్తా చాటిన వైదేహి, అర్షి లలనీ సోషల్‌ మీడియా ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.














Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్