Updated : 11/02/2023 18:39 IST

జీవితాంతం నీ ప్రేమలోనే..!

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకొనే ఈ వేలంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే ప్రేమను పంచుకోవడానికైనా, పెంచుకోవడానికైనా అనునిత్యం, అనుక్షణం ప్రత్యేకమైనదే.

నేనున్నాననీ.. నీకేం కాదనీ!

ఎవరో తెలియని వారికి కష్టమొస్తేనే భరించలేకపోతాం.. అలాంటిది మనకెంతో ఇష్టమైన వారు ఆపదలో లేదంటే బాధలో ఉంటే ఆ ఊహను కూడా భరించలేం కదా! మరే ఆలోచన లేకుండా వెంటనే వెళ్లి వారికి సహాయపడతాం. అలాగే ప్రేమికులు కూడా ఒకరికొకరు తోడూ-నీడగా నిలిచినప్పుడే ఆ బంధంలోని సిసలైన మాధుర్యం ఏంటో అర్థమవుతుంది. అంతేకాదు.. ఇలా అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవడం వల్ల ఇద్దరికీ ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ మరింత రెట్టింపవుతాయి.

నీ సంతోషమే.. నా సంతోషం!

జీవితం కష్టసుఖాల సంగమం. తమకు కష్టమొచ్చిందని కుంగిపోయి, దానికి భాగస్వామిని బాధ్యులను చేయడం అస్సలు సరికాదు. ఒకవేళ మీకు బాధొచ్చినా దాన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి.. అవసరమైతే మీ భాగస్వామి సహాయం తీసుకోండి. అలాగే ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవడం వల్ల ఇటు మీరు, అటు మీ భాగస్వామి.. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలోనే ‘నిన్ను ఏ విషయంలోనూ బాధపెట్టకుండా.. జీవితాంతం సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటా..’ అంటూ ఒకరికొకరు బాస చేసుకోండి. ఇలా మీరు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోగలిగితే ఆటోమేటిక్‌గా మీ భాగస్వామిని సంతోషపెట్టిన వారవుతారు. ఇద్దరి మధ్యా ప్రేమ రెట్టింపవడానికి, నమ్మకం పెరగడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది చెప్పండి!

జీవితాంతం నీ ప్రేమలోనే!

ప్రేమికుల మధ్యనైనా, భార్యాభర్తల మధ్యైనైనా.. ప్రేమ అనేది ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. రోజూ ప్రేమ పంచుకుంటేనే అందులోని అసలు సిసలైన మజా ఏంటో ఇద్దరూ ఆస్వాదించచ్చు.. తద్వారా ఆ బంధం నిత్యనూతనమవుతుంది. అందుకే రోజూ ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా డియర్’ అంటూ ఒకరికొకరు బాస చేసుకోండి.

నీ వాళ్లు నా వాళ్లు కాదా!

తమ ప్రేమ బంధాన్ని త్వరలోనే పెళ్లిపీటలెక్కించే వారైనా, ఇది వరకే ప్రణయ బంధంలో మునిగితేలుతున్న వారైనా.. ఇలా దంపతుల మధ్య ప్రేమ మరింత రెట్టింపు కావాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడంతో పాటు వారిరువురి కుటుంబ సభ్యులనూ అంతే సమానంగా ప్రేమించాలన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే ‘మన కుటుంబం అంటే మనిద్దరమే కాదు.. మా వాళ్లు, మీ వాళ్లు.. అందరం కలిస్తేనే మనం.. అందుకే మనం ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటామో.. వారినీ అంతకంటే ఎక్కువగానే గౌరవించాలి..’ అంటూ ఒకరికొకరు మాటిచ్చుకోండి. దాన్ని మాటలకే పరిమితం చేయకుండా.. ప్రత్యేక సందర్భాల్లో వారితో కలిసి గడపడం, అందరూ కలిసి వెకేషన్స్‌కి వెళ్లడం, ఇరు కుటుంబ సభ్యులను పిలిచి డిన్నర్ ఏర్పాటు చేయడం.. ఇలా వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నెన్నో మార్గాలున్నాయి. తద్వారా మీరు చేసుకున్న బాసను నిలబెట్టుకున్నవారవుతారు.. అలాగే మీ బంధంలో ప్రేమ మరింత రెట్టింపవుతుంది.

ఎక్కడున్నా నీ ధ్యాసలోనే!

ఉద్యోగం, ఇతర వృత్తిపరమైన పనుల రీత్యా ప్రేమికులు లేదంటే భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం, లేదంటే ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇలాంటి బిజీ షెడ్యూల్ వల్ల ఒకరికొకరు సమయం గడపడానికి అవకాశమే ఉండట్లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలకు భంగం వాటిల్లుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఇద్దరూ దగ్గర లేకపోయినా, సమయం కుదరకపోయినా.. వీలు చూసుకొని మరీ ఒకరితో ఒకరు సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని