రోజు కూలీ.. ఆ పోటీలో లక్షలు గెలుచుకుంది!
రెక్కాడితే గానీ పూట గడవని కుటుంబం ఆమెది.. అయినా డ్యాన్స్ అంటే ఆమెకు విపరీతమైన మక్కువ. ఈ విషయం తెలిసి చాలామంది ‘ఈ పరిస్థితిలో ఇది నీకు అవసరమా?’ అని హేళన చేశారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని మనసులో నిలుపుకొని.....
(Photos: Instagram)
రెక్కాడితే గానీ పూట గడవని కుటుంబం ఆమెది.. అయినా డ్యాన్స్ అంటే ఆమెకు విపరీతమైన మక్కువ. ఈ విషయం తెలిసి చాలామంది ‘ఈ పరిస్థితిలో ఇది నీకు అవసరమా?’ అని హేళన చేశారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని మనసులో నిలుపుకొని విలువిద్య నేర్చుకున్నట్లు.. డ్యాన్స్ అంటే ఇష్టమైన వర్ష యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఈ కళలో మరింత పట్టు పెంచుకుంది. కష్టం ఊరికే పోదన్నట్లుగా.. ఏళ్ల పాటు ఆమె చేసిన పరిశ్రమే ఇప్పుడు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్’ సీజన్-3 విజేతగా నిలిపింది. రోజువారీ కూలీ మాత్రమే అందుకునే చేత్తో.. లక్షల చెక్కును అందుకుంటూ భావోద్వేగానికి గురైన వర్షా బుమ్రా కన్నీటి గాథ ఇది!
వర్షది హరియాణాలోని యాషీ నగర్. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది. వివాహమైనా ఆమె తలరాత మాత్రం మారలేదు. తన భర్తతో కలిసి రోజూ భవన నిర్మాణానికి సంబంధించిన కూలీ పనులకు వెళ్లేది వర్ష. పనిచేస్తేనే పూట గడవడం కష్టంగా ఉన్న స్థితిలో ఉన్న వారు పని లేని రోజుల్లో పస్తులుండాల్సి వచ్చేది.
యూట్యూబ్ వీడియోలు చూస్తూ..!
అయితే వర్షకు చిన్న వయసు నుంచే డ్యాన్స్ అంటే ప్రాణం. పెళ్లికి ముందు స్వయంగా అందులో కొన్ని మెలకువలు నేర్చుకొని.. పలు డ్యాన్స్ పోటీల్లోనూ పాల్గొందామె. పెళ్లి తర్వాత కూడా దీన్ని కొనసాగించాలనుకున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక డ్యాన్స్‌లో మెరుగైన శిక్షణ తీసుకోలేకపోయిందామె. ఆఖరికి ఉండబట్టలేక ఓ రోజు భర్తకు తన ఇష్టాన్ని తెలియజేసింది. దాంతో ఆయన కూడా వర్షను ప్రోత్సహించడంతో ఆమెలో ఆతృత మరింత పెరిగింది. అయితే శిక్షణ కోసం వర్ష ఎక్కడికో వెళ్లలేదు. ఇంట్లోనే యూట్యూబ్ వీడియోలు చూస్తూ సాధన చేసింది. ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని మనసులో నిలుపుకొని విలువిద్యలో ఆరితేరితే.. నేడు వర్ష ప్రముఖ కొరియోగ్రాఫర్ వర్తికా ఝా డ్యాన్స్ వీడియోలు చూస్తూ డ్యాన్స్‌లో మెలకువలు పెంచుకుంది.
‘ఇది నీకు అవసరమా?’ అన్నారు!
ఇలా యూట్యూబ్ వీడియోలు చూస్తూ డ్యాన్స్ నేర్చుకునే క్రమంలోనే ఓసారి ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్’ రియాల్టీ షో చూసింది. అంతే.. అందులో పాల్గొనాలని బలంగా నిశ్చయించుకుంది.
‘ఇంటర్నెట్‌లో ఈ డ్యాన్స్ రియాల్టీ షో చూశాను. కానీ అందులో పాల్గొనే పోటీదారుల ఖరీదైన దుస్తులు, న్యాయనిర్ణేతలను చూడగానే.. ఆ స్థాయికి నేను అనర్హురాలిననిపించింది. అయినా నా మనసు ఆ షో వైపే లాగింది. అంతలోనే చండీగఢ్‌లో ఈ షో మూడో సీజన్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. నా భర్తతో కలిసి అక్కడికి వెళ్లా. అక్కడ ఎంపికై రెండో ఆడిషన్ కోసం దిల్లీ వెళ్లా. అనుకోకుండా ఇక్కడా అర్హత సాధించా. దీంతో ముంబయిలో నిర్వహించే ఈ షోలో పాల్గొనాల్సిందిగా నాకు కబురొచ్చింది. ఈ పిలుపు విని నన్ను నేనే నమ్మలేకపోయా! ఇలా ఓవైపు నా డ్యాన్స్ ప్రయత్నాల్లో నేనుంటే.. నలుగురూ నానా రకాలుగా మాట్లాడేవారు. ఈ పరిస్థితిలో ఇది నీకు అవసరమా? అన్న వాళ్లూ లేకపోలేదు. అయినా ఎవరేమన్నా నా మనసు చెప్పిందే విన్నా..’ అంటోంది వర్ష.
ఈ డబ్బు వాడి కోసమే!
ఈ డ్యాన్స్ షోలో ఎన్నో రౌండ్లు దాటి, ఎంతోమంది పోటీదారుల్ని వెనక్కి నెట్టి విజయం సాధించింది వర్ష. ఫలితంగా ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సీజన్ - 3’ విజేతగా నిలిచింది. తద్వారా ట్రోఫీతో పాటు రూ. 5 లక్షల చెక్కును తన సొంతం చేసుకుంది. దీంతో పాటు కార్యక్రమ స్పానర్ కూడా మరో రూ. 2.5 లక్షల చెక్కును ఆమెకు అందించారు.
‘ప్రస్తుతం నాకు ఐదేళ్ల కొడుకున్నాడు. వాడికి భవిష్యత్తులో మాలాంటి పరిస్థితి రాకూడదనే ఇంతలా కష్టపడుతున్నా. ఎలాగైనా ఈ పోటీలో విజయం సాధించాలనుకున్నా. ఆశ నెరవేరేసరికి ఇది కలా? నిజమా? అనిపించింది. భావోద్వేగంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఎందుకంటే కూలీ డబ్బులు అందుకునే నా చేతులతో లక్షలు అందుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఇక్కడిదాకా రాగలిగానంటే నా భర్త సహకారమే ఎక్కువ! నా మెంటార్ వర్తికా సింగ్‌కి కూడా ఈ విజయంలో భాగం ఉంది. ఇక అమ్మానాన్నలు, అత్తమామలు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ డబ్బుతో సొంతంగా ఓ చిన్న ఇల్లు కట్టుకోవడంతో పాటు మిగతా డబ్బును నా కొడుకు చదువు కోసం వెచ్చిస్తా. ఈ డ్యాన్స్ షో జడ్జిలు కూడా నా బాబు చదువు కోసం సహాయం చేస్తామనడం మరింత సంతోషకరమైన విషయం..’ అంటోన్న వర్ష తనకున్న డ్యాన్స్ నైపుణ్యాలతో ఈ సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.