Published : 22/07/2021 01:28 IST

ఆమె ఆశయం సముద్రమంత!

పైన నీలాకాశం.. కింద నీలి సంద్రం.. తీరాన్ని తాకాలనే తాపత్రయ పడే అలలు.. ఆహా ఎంత మంచి దృశ్యమో కదా... విశాఖ పర్యాటకులు ఇదే అనుకుంటారు. కానీ వ్యర్థాల వల్ల తను పుట్టి పెరిగిన ఆ నగరం, దాని తీరం కాలుష్య కోరల్లో చిక్కుకోబోతుంటే... ఆ యువతి బాధపడుతూ కూర్చోలేదు... స్నేహితులతో కలిసి శుభ్రం చేస్తోంది. అందుకోసం ఉద్యోగాన్ని వీడి వినూత్న ఆలోచనతో అంకుర సంస్థనూ స్థాపించింది. తనే యామిని కృష్ణ రాపేటి.

విశాఖకి చెందిన యామిని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ చేసింది. తర్వాత బెంగళూరులో డేటా ఎనలిస్ట్‌గా పనిచేసింది. మంచి జీతం, జీవితం. అయినా అవేమీ ఇవ్వని సంతృప్తిని పచ్చదనం, పర్యావరణం ఇచ్చాయంటుంది యామిని. అందుకే వాటి కోసం ఏదైనా చేయాలనుకుంది. అలా పుట్టుకొచ్చిందే ‘సర్కిల్‌’. ‘మాది విశాఖపట్నం. నాన్న ప్రభాకరరావు మర్చంట్‌ నేవీలో చీఫ్‌ ఇంజినీర్‌. అమ్మ వసుంధర గృహిణి. విశాఖ వాసులకు బీచ్‌కి మించిన ఆటవిడుపు ఏముంటుంది? నాకూ చిన్నప్పట్నుంచీ బీచ్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. కానీ కాలుష్యంతో నల్లగా మారిన ఒడ్డుని... పర్యాటకులు ఇష్టమొచ్చినట్లుగా పారేసే ప్లాస్టిక్‌ వస్తువులని చూస్తే బాధనిపించేది. వాటిని ఏరి చెత్తకుండీల్లో వేసేదాన్ని. అలా చేయకపోతే అవన్నీ చేరి సముద్రజీవులని చంపేస్తాయని నా బాధ. అదొక్కటే సరిపోదు... అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేదాన్ని. ఇంకా ప్రభావవంతంగా ఏదైనా చేయాలని ‘సర్కిల్‌’ స్టార్టప్‌ని ప్రారంభించాను. స్టార్టప్‌ అనగానే వ్యాపార సంస్థ అనుకునేరు. నా లక్ష్యం లాభాలు కాదు.. సమాజానికి, పర్యావరణానికి మేలు చేయడం’ అంటూ వివరించింది యామిని.

వ్యర్థాలకు విలువ...

విలువ లేని వస్తువు పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు. అదే వాటికి ఎంతో కొంత విలువని ఆపాదిస్తే భద్రంగా చూసుకుంటారు. ‘అందుకే ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలకు సొమ్ము చెల్లిస్తామంటే వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఇస్తారన్నది నా నమ్మకం. ఏ ప్రయోజనమూ లేకనే చాలామంది వాటిని చెత్తకుండీల్లో పడేస్తుంటారు. పుర/ నగర పాలక సిబ్బంది వాటిని డంపింగ్‌యార్డుల్లో వేస్తారు. ఫలితంగా అవి ఘన వ్యర్థాలతో కలిసి వాయు, నీటి, భూమి కాలుష్యాలు ఏర్పడతాయి. కొన్నిసార్లైతే ఈ వ్యర్థాలను అశాస్త్రీయంగా కాల్చేస్తుంటారు. వాటి నుంచి వెలువడే పొగ క్యాన్సర్లు, నరాల వ్యాధులకు కారణం అవుతోంది. పశువులు తెలియక ఈ వ్యర్థాలు తిని అనారోగ్యాలపాలవుతున్నాయి. సముద్రంలో కలిస్తే సముద్ర జీవులూ చనిపోతాయి. ఈ అనర్థాల్ని నివారించేందుకే ‘సర్కిల్‌’ని ప్రారంభించాను. నా ఆలోచనకి స్నేహితులూ మద్దతిచ్చారు. అమెరికాలో ఉండే జీవన్‌, హర్ష, సుస్మిత, ప్రశాంత్‌ (హైదరాబాద్‌), ప్రత్యూష్‌ (బెంగళూరులో), ప్రియాంక (కోల్‌కతా), రాజీవ్‌ (నెల్లూరు), విశాఖలో ఉండే హరీశ్‌, సుధీర్‌, రాజ్‌కుమార్‌, దినేశ్‌ కుమార్‌ తదితరులు సర్కిల్‌లో భాగస్వాములు. వాళ్లంతా ఉద్యోగాలు చేసుకుంటూనే ‘సర్కిల్‌’కు సేవలు అందిస్తున్నారు. నేను మాత్రం పూర్తిగా దీని మీదే పని చేస్తున్నాను. వ్యర్థాలను సురక్షిత విధానాల్లో రీసైక్లింగ్‌కు పంపే వ్యవస్థ ఉండాలన్నదే మా అందరి లక్ష్యం’ అంటోంది యామిని.  
వ్యర్థాలను సేకరించడానికి
circleindia.co.in సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది యామిని బృందం. ‘అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొందరు మనుషులను నియమించుకున్నాం. యాప్‌నూ తీసుకురాబోతున్నాం. 90637 26766 నెంబరుకు ఫోన్‌/ వాట్సప్‌ చేస్తే మా సిబ్బంది వచ్చి వ్యర్థాలకు నిర్ణీత మొత్తాన్నీ చెల్లించి తీసుకెళ్తారు. ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌లతోపాటు పేపర్‌, గ్లాస్‌ తదితర పొడిగా ఉండే వేటినయినా తీసుకుంటాం. మా సంస్థ కార్యకలాపాలకు మంచి ఆదరణ లభిస్తోంది. సేకరించిన చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో విడగొడతాం. దాన్ని సంబంధిత పరిశ్రమ వర్గాల వారికి విక్రయిస్తాం. పౌరుల్లో అవగాహనను పెంచి విశాఖను ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల రహిత నగరంగా చూడాలన్న మా కల సాకారం అవుతుందన్న నమ్మకం మాకుంది’ అంటోంది యామిని.
దీంతో పాటు యామిని బృందం కొన్ని సంవత్సరాలుగా విశాఖలోను, ఆ చుట్టుపక్కలా ఉన్న బీచ్‌లలో ప్రతివారం క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్‌లను, రన్‌లను నిర్వహిస్తోంది. అక్కడి వ్యర్థాలను సేకరించి వాటిని శుభ్రంగా తయారు చేస్తారు. అక్కడికి వచ్చే వారికి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తారు. కొవిడ్‌ సమయంలోనూ ఈ యువ బృందం ఎంతోమంది ఆకలి తీర్చింది వీటితోపాటూ జంతుపరిరక్షణ కూడా వీరి అజెండాలో భాగమే. వీధి జంతువుల సంరక్షణ కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.  


సర్వే చేశా..

ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఎందుకు తడిచెత్తతో కలిపేస్తున్నారన్నది తెలుసుకునేందుకు వెయ్యిమందితో సర్వేను నిర్వహించా. ఎవరిని అడిగినా తాము విడిగా ఇస్తున్నా చెత్తబండిలో అన్నీ కలిపేస్తున్నారుగా, వాటిని వేరుగా తీసుకెళ్లి ఏం లాభం? అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరేగా తీసుకెళ్తే వాటిని అలానే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, డబ్బులు కూడా అక్కర్లేదని చాలామంది చెప్పారు. దీంతో నాకు ధైర్యం వచ్చింది. మా ఆలోచనకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్న విశ్వాసం కలిగింది. 

- యామిని

బి.ఎస్‌.రామకృష్ణ విశాఖపట్నం


ముఖంలో ముడతలు వెనుక  అపారమైన జీవిత అనుభవం ఉంటుంది. వయసుని హుందాగానే స్వీకరిస్తాను నేను.

- కరీనాకపూర్‌, బాలీవుడ్‌ నటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని