Published : 23/03/2021 01:11 IST

సహజ రంగుల హోలీ!

చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండగ హోలీ. ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఆ రోజు అందరి ముఖాలు, దుస్తులపై ప్రతిబింబిస్తాయి. ఎంతో సంబరంగా చేసుకునే ఈ వేడుకలో ఉపయోగించే రసాయన రంగుల వల్ల చర్మానికి హాని జరగొచ్చు. మంట, దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్లూ రావొచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెడుతున్నారు ముంబయికి చెందిన తూర్పు కండివాలి ప్రాంతంలోని ‘రివైరా టవర్స్‌’ అపార్ట్‌మెంట్‌ మహిళలు. ఎలా అంటే..
సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో తయారైన రంగుల వల్ల మనకు ఎలాంటి హాని జరగదు. అయితే వీటి  ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాంతో రేటు తక్కువగా ఉండే రసాయనాలున్న వాటి వైపే ప్రజలు దృష్టి పెడతారు. రివైరా టవర్స్‌ వాసులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. 2019లో ఈ అపార్ట్‌మెంట్‌లోని కొందరు మహిళలు కలిసి దీనికోసం ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. ‘మా అపార్ట్‌మెంట్‌లో మొత్తం 260 ఫ్లాట్స్‌ ఉన్నాయి. పండగ నిర్వహించవద్దని ఎవరినీ ఆపలేం కదా. అలాగని కేవలం సేంద్రియ రంగులనే కొనుగోలు చేయాలని బలవంతం కూడా చేయలేం. దాంతో మా బృంద సభ్యులంతా ఏం చేయాలా అని ఆలోచించాం. సంప్రదాయ పద్ధతుల్లో ఎండిన పూల నుంచి రంగులను తయారుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని చెబుతారు సొసైటీలో ఒకరైన అమూల్య మంగేష్‌.

‘ముందుగా కొంతమంది వాలంటీర్లు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్స్‌ అన్నీ తిరిగి పూలను సేకరించి టెర్రస్‌ మీద ఆరబెట్టారు. ఆ తర్వాత వాటిని మెత్తగా పొడి చేసి పెట్టాం. మేం సహజ సిద్ధంగా తయారుచేసిన ఈ వర్ణాలు.. రసాయన రంగుల్లా కాంతివంతంగా ఉండకపోవచ్చు. కానీ ఇవి శరీరానికి ఎలాంటి హాని చేయవని కచ్చితంగా చెబుతాం. అంతేకాదు ఈ రంగులు ఉతికితే త్వరగా పోతాయి కూడా’ అని చెబుతారామె.
అలా మొదలైన ఈ రంగుల తయారీ 2020లోనూ కొనసాగింది. ఈసారి పూలను ఇళ్లతోపాటు దగ్గర్లోని దేవాలయాల నుంచి కూడా సేకరించారు. ‘మా సొసైటీలో మూడు ఆలయాలున్నాయి. అక్కడి పూజారులతో మాట్లాడి పూలదండలు, విడిపూలను సేకరించాం. ఈ పూలను రంగుల ఆధారంగా జాగ్రత్తగా వేరుచేసి వేటికవే ఆరబెట్టడం లాంటి పనులను యువత, పిల్లలకు అప్పజెప్పాం. అలా ఎండిన పూలను బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడి చేసి గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరుస్తున్నాం.’ అని చెబుతారు సుజాత. ఇలా 260 ఫ్లాట్స్‌కు సరిపడా రంగులను హోలీకి ముందే తయారుచేసి పెట్టుకున్నారు వాళ్లు. అయితే కొవిడ్‌ కారణంగా హోలీ వేడుకలను ఆపేసినా... పూజ మాత్రం నిర్వహిస్తామనీ, ఆ సందర్భంలో ఈ రంగులను వాడతామని చెబుతున్నారు అక్కడి మహిళలు. ‘ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా వేడుకలను నిర్వహించొద్దని నిర్ణయించుకున్నాం. అయితే చాలా దగ్గరివారు మాత్రం ఇలా సహజ సిద్ధంగా తయారుచేసిన హోలీ రంగులను వాడుకోవచ్చు’ అని చెబుతున్నారు అమూల్య.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి